విజయనగరం ఎంపీ సీటు కోసం రఘురామ ...!?

అంగబలం అర్ధబలం దండీగా ఉన్న రఘురామ ప్రముఖ సామాజిక వర్గం నేత. దాంతో ఆయన రాక టీడీపీకి బలమే అంటున్నారు

Update: 2024-04-07 03:48 GMT

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు టీడీపీలో చేరిపోయారు. ఇంతకాలం చంద్రబాబుకు మద్దతు ఇస్తూ వచ్చిన ఆయన ఇపుడు ఆయన పార్టీలో కీలక సభ్యుడు అయ్యారు. అంగబలం అర్ధబలం దండీగా ఉన్న రఘురామ ప్రముఖ సామాజిక వర్గం నేత. దాంతో ఆయన రాక టీడీపీకి బలమే అంటున్నారు.

ఇక రఘురామకు టీడీపీలో చేరినందుకు ప్రతిఫలం ఏంటి అన్నది కూడా చర్చకు వస్తోంది. అయితే ఆయనకు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ సీటుని చంద్రబాబు ఇచ్చారని ప్రచారం సాగింది అది ఒక్కసారిగా సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో ఉండి నియోజకవర్గం టీడీపీ అభ్యర్ధిగా ఉన్న రామరాజు ఫైర్ అవుతున్నారు.

బాబు తొలి జాబితాలో రిలీజ్ చేసిన తీరుగానే ఉండిలో రామరాజు అభ్యర్ధిత్వాన్ని అలాగే కొనసాగించాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ఉండి సీటులో ఇపుడు మంట రేగింది. నిజానికి టీడీపీ సీటు ప్రకటించిందో లేక లీకులు వదిలిందో తెలియదు కానీ అగ్గి మాత్రం ఉండిలో రాజుకుంది.

ఆ మీదట తాపీగా రఘురామ క్రిష్ణం రాజు అయితే తనకు ఉండి టికెట్ ప్రకటించారు అన్నది ఎక్కడా అధికారికంగా చెప్పెలేదే అంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. అదంతా మీడియా స్టోరీ అని కొట్టిపారేసారు. తాను ప్రస్తుతం టీడీపీ సభ్యుడిని అని తనకు ఎక్కడ టికెట్ ఇవ్వాలనేది బాబు డిసైడ్ చేస్తారు అని అన్నారు.

Read more!

అంతే కాదు ఎంపీగానా లేక ఎమ్మెల్యేగానా అన్నది కూడా బాబు చేతిలో ఉందని అన్నారు. పనిలో పనిగా తనకు విజయనగరం ఎంపీ సీటు మీద మక్కువ ఉందని ఆయన మనసులో మాటను బయట పెట్టుకున్నారు. విజయనగరం ఎంపీ సీటు క్షత్రియులకు తరాలుగా కలసి వస్తున్న సీటు. ఆ సీటు నుంచి గతంలో పూసపాటి వంశీకులు గెలిచారు.

ఇపుడు ఆ సీటుని బీసీ నేత అయిన కలిశెట్టి అప్పలనాయుడుకు బాబు కేటాయించారు. అయితే బాబు తలచుకుంటే తిరిగి ఆ సీటుని రఘురామకు కేటాయించనూ గలరు. కలిశెట్టికి సర్దిచెప్పుకోగలరు కూడా. దాంతోనే రఘురామ తనకు ఎంపీ సీటు ముద్దు అని అయితే నర్సాపురం లేకపోతే విజయనగరం ఎంపీ సీటు అన్నట్లుగా హింట్ ఇచ్చారు అని అంటున్నారు.

మొత్తానికి చూస్తే రఘురామ ఎంపీగానే పోటీ చేయాలనుకుంటున్నారు అని తెలుస్తోంది. ఆయన ఎమ్మెల్యే అయితే ఏమీ ప్రయోజనం ఉండదని అంటున్నారు. ఎంపీగా ఉంటే ఢిల్లీ స్థాయిలో హవా చలాయించవచ్చు అన్నది ఆయన ఆలోచన అంటున్నారు.

చంద్రబాబు రఘురామకు ఎక్కడ అకామిడేట్ చేస్తారో తెలియదు కానీ విజయనగరం ఎంపీ సీటు కూడా రాజులకు ఇస్తే బీసీలు ఆ జిల్లాలో భగ్గుమనడం ఖాయమని అంటున్నారు. మరి తనకు ఆ జిల్లా నుంచి పోటీ చేయమని ఆహ్వానాలు వచ్చాయని రఘురామ అంటున్నారు. చూడాలి మరి ఎవరు ఆహ్వానించారో ఎందుకు ఆహ్వానించారో కూడా కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది అని అంటున్నారు.

Tags:    

Similar News