పాకిస్తాన్‌కు ఇదో గట్టి సందేశం!

ఈ నేపథ్యంలో తాజాగా క్వాడ్ (QUAD) దేశాలు ఈ దాడిని గట్టిగా ఖండించడం పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బగా మారింది.;

Update: 2025-07-02 09:37 GMT

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో ఏప్రిల్ 22న జరిగిన పాశవిక ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా క్వాడ్ (QUAD) దేశాలు ఈ దాడిని గట్టిగా ఖండించడం పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బగా మారింది.

క్వాడ్ సమావేశంలో పహల్గాం దాడిపై చర్చ

అమెరికాలో నిర్వహించిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పహల్గాం దాడి ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ సమావేశంలో భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటన ఉగ్రవాదంపై క్వాడ్ దేశాల ఉమ్మడి వైఖరిని స్పష్టం చేసింది. "హింసాత్మక ఉగ్రవాదానికి ఎటువంటి స్థానం లేదు. పహల్గాం దాడిలో ప్రమేయం ఉన్నవారికీ, దానికి మద్దతునిచ్చినవారికీ తగిన శిక్ష పడాల్సిందే. దర్యాప్తును త్వరగా పూర్తి చేసి నిందితులను తక్షణమే శిక్షించాలి" అని ఆ ప్రకటన పేర్కొంది.

-జైశంకర్ కీలక వ్యాఖ్యలు, ఆపరేషన్ సిందూర్‌కు మద్దతు

ఇలాంటి తీవ్ర దాడుల విషయంలో బాధితులకూ, నేరస్థులకూ ఒకేలా వ్యవహరించకూడదని జైశంకర్ స్పష్టం చేశారు. "భారత్‌కు తన ప్రజలను రక్షించుకునే హక్కు ఉంది. దేశ భద్రత కోసం తీసుకునే చర్యలను క్వాడ్ దేశాలు అర్థం చేసుకోవడం ఆనందంగా ఉంది" అని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే పహల్గాం దాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి జైశంకర్ వివరించారు. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రస్థావరాలను భారత్ ఈ ఆపరేషన్‌లో నేలమట్టం చేసింది. ఈ చర్యకు ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభించడం విశేషం.

-పాకిస్తాన్‌కు గట్టి సందేశం

క్వాడ్ దేశాలైన భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ గళం ఒకటిగా వినిపించడం పాకిస్తాన్‌కు తీవ్రమైన దెబ్బగా మారింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలను బహిరంగంగా గద్దించే ఈ ప్రకటనతో, అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు మద్దతు మరింత బలపడనుంది. పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందినవారికీ, వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ.. "ఉగ్రవాదం మానవతావాదంపై దాడి. దీనిని ప్రపంచం మొత్తం కలిసికట్టుగా ఎదుర్కోవాలి" అని క్వాడ్ నాయకులు గట్టిగా తెలిపారు. ఈ మొత్తం పరిణామం ద్వారా, ఉగ్రవాదంపై అంతర్జాతీయ సమన్వయం ఎంత అవసరమో మరోసారి స్పష్టమైంది.

Tags:    

Similar News