ఓటేస్తే కారు గిఫ్ట్.. థాయ్ లాండ్ ట్రిప్.. ఏం ఆఫర్లు సామీ

ఎన్నికలు అంటేనే ఇప్పుడు డబ్బుతో ముడిపడి ఉన్నాయి. ప్రజాస్వామ్య బద్దంగా మేం పనిచేస్తాం.. పాటు పడుతాం అంటే ఎవరూ ఓటు వేయడం లేదు.;

Update: 2025-12-25 18:30 GMT

ఎన్నికలు అంటేనే ఇప్పుడు డబ్బుతో ముడిపడి ఉన్నాయి. ప్రజాస్వామ్య బద్దంగా మేం పనిచేస్తాం.. పాటు పడుతాం అంటే ఎవరూ ఓటు వేయడం లేదు. ఓటుకు ఎంత ఇస్తారు? అన్నదే అసలు ప్రశ్న. గెలిచాక ఆ ప్రజాప్రతినిధిని ప్రశ్నించే సామర్థ్యం లేకుండా డబ్బులకు ఆశపడి ఓటర్లు అమ్ముడుపోతున్న పరిస్థితి నెలకొంది.

తాజాగా ఫూణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) ఎన్నికలకు కేవలం మూడు వారాలే మిగిలి ఉండగా.. ఎన్నికల వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. అభ్యర్థులు విస్తృత ప్రచారం తోపాటు ఓటర్లను ఆకర్షించేందుకు ఖరీదైన హామీలు, లక్కీ డ్రాల పేరుతో ప్రలోభాలు చూపిస్తున్నారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఈ నెల 15న జరగనున్న పుణె మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కొందరు అభ్యర్థులు పట్టుచీరల నుంచి బైక్‌లు, లగ్జరీ కార్లు, బంగారు ఆభరణాలు, విదేశీ ట్రిప్పుల వరకు ఆశ చూపిస్తున్నట్లు సమాచారం. ఓటర్లను ఆకర్షించేందుకు లక్కీ డ్రాలు నిర్వహిస్తూ ముందుగానే రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఒక వార్డులో స్థానిక సీనియర్‌ నేత మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని కొంతమందికి భూమి ఇవ్వడానికి సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. మరో డివిజన్‌లో దంపతుల కోసం ఐదు రోజుల థాయ్‌లాండ్‌ ట్రిప్‌ను ఆఫర్‌గా ప్రకటించారట. ఇంకొన్ని ప్రాంతాల్లో బైక్‌లు, ఎస్‌యూవీలు, బంగారు ఆభరణాలు లక్కీ డ్రా బహుమతులుగా పెట్టారని తెలుస్తోంది.

మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు కొన్ని వార్డుల్లో పట్టుచీరల పంపిణీ మొదలుపెట్టారని సమాచారం. ఇప్పటికే ఒక ప్రాంతంలో సుమారు 500 మందికి సైకిళ్లు, కుట్టుమిషిన్లు పంపిణీ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువతను ఆకర్షించేందుకు క్రికెట్‌ లీగ్‌ మ్యాచ్‌లు నిర్వహించి నగదు బహుమతులు ఇవ్వడం కూడా ప్రచార వ్యూహంగా మారినట్లు తెలుస్తోంది. మరో చోట మెగా లక్కీ డ్రా ఏర్పాటు చేసి లగ్జరీ ఎస్‌యూవీని బహుమతిగా పెట్టారని, దానికి ఐదు వేల మందికిపైగా హాజరైనట్లు వార్తలు వస్తున్నాయి.

ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఓటును కొనుగోలు చేసే ప్రయత్నాలు స్వేచ్ఛాయుత ఎన్నికల సూత్రాలకు విరుద్ధమని, ఎన్నికల కమిషన్‌ అభ్యర్థుల ఖర్చుపై కఠిన నిఘా పెట్టాలని వారు సూచిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రజాస్వామ్య విలువలు నిలబడతాయని సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఓటర్లూ తమ ఓటు విలువను గుర్తించి, తాత్కాలిక లాభాలకు కాకుండా నగర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. పుణె ఎన్నికలు కేవలం అభ్యర్థుల గెలుపు.. ఓటమి విషయం మాత్రమే కాదు… ప్రజాస్వామ్యానికి పరీక్షగా మారుతున్నాయన్నది రాజకీయ వర్గాల అంచనా.

Tags:    

Similar News