పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఆమె...వైసీపీకి గట్టి సవాల్ ?

పులివెందుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఉన్నారు ఆయన సొంత నియోజకవర్గంలో జెడ్పీటీసీకు ఉప ఎన్నిక జరుగుతోంది.;

Update: 2025-08-01 17:30 GMT

పులివెందుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఉన్నారు ఆయన సొంత నియోజకవర్గంలో జెడ్పీటీసీకు ఉప ఎన్నిక జరుగుతోంది. ఒక విధంగా జగన్ కి ఇది అతి పెద్ద అగ్ని పరీక్షగా చూస్తున్నారు. కాలపరిమితి చూస్తే తక్కువే కానీ ఉప ఎన్నికకు మాత్రం ఎంతో ప్రాధాన్యత ఉంది. గెలుపు ఎపుడూ గెలుపే పైగా జగన్ సొంత ఇలాకాలో జెడ్పీటీసీని గెలుచుకోవడం ద్వారా వైసీపీకి గట్టి దెబ్బ కొట్టాలని టీడీపీ ఆలోచిస్తోంది. దాంతో సరైన అభ్యర్ధినే పులివెందుల జెడ్పీటీసీ బరిలోకి దించుతోంది.

జగన్ ప్రత్యర్ధి ఇంటి నుంచే :

వైసీపీ అధినేత జగన్ ని పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో ఢీ కొడుతూ వస్తున్న టీడీపీ నియోజకవర్గం ఇంచార్జ్ అయిన బీటెక్ రవి సతీమణిని జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో బరిలోకి దించుతారు అని అంటున్నారు. పులివెందులలో జెడ్పీటీసీ అంటే పులివెందుల నియోజకవర్గానికి గుండెకాయ లాంటిదే అని అంటున్నారు. అందువల్ల దీనిని నిలబెట్టుకోవాలని వైసీపీ చూస్తుంది. అదే సమయంలో వైసీపీ చేతిలో ఉన్న ఈ సీటుని గెలుచుకోవడం ద్వారా తమ తడాఖా చాటాలని టీడీపీ చూస్తోంది.

భీకరమైన పోరు :

పులివెందుల జెడ్పీటీసీ లో మొత్తం 10 వేల 601 ఓట్లు నమోదైనట్లుగా అధికారులు చెబుతున్నారు. జెడ్పీటీసీ ఎన్నికల కోసం అవసరమైన పోలింగ్ కేంద్రాలను కూడా ఇప్పటికే గుర్తించారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల కోసం పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పులివెందులలో విజయం కోసం వ్యూహాత్మకంగా టీడీపీ పావులు కదుపుతోంది. బీటెక్ రవి భార్యనే అభ్యర్ధిగా ప్రకటించాలనుకోవడం అందులో భాగమే అని అంటున్నారు.

వైసీపీ ప్లాన్ ఏమిటి :

కేవలం ఉప ఎన్నిక అది కూడా ఒక జెడ్పీటీసీకే అని వైసీపీ ఉదాశీనంగా ఉండాల్సింది అయితే లేదు అని అంటున్నారు. ఎందుకంటే టీడీపీ ఈ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకుంటోంది. ఇప్పటికే అభ్యర్ధిని నిర్ణయించడం ద్వారా పులివెందులలో ఉప ఎన్నికల్లో పైచేయి సాధించింది అని అంటున్నారు. మరి వైసీపీ తరఫున ఎవరిని నిలబెడతారు అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు. పులివెందులలో జెడ్పీటీసీగా నెగ్గిన వైసీపీ నాయకుడు రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాంతో ఉప ఎన్నికలు వచ్చాయి. మరి ఆయన సతీమణిని పోటీకి పెట్టి అటు సానుభూతిని మరో వైపు వైసీపీ అభిమాన బలగాన్ని పోగు చేసుకుంటే కూటమి మీద సరైన రాజకీయ సమరంగా ఉంటుందని అంటున్నారు.

బీజేపీ ఎంపీ ధీమా :

ఏపీలో బీజేపీ ఎంపీ ఒకరు టీడీపీ గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు టీడీపీతో దశాబ్దాల బంధం కలిగి ఉన్న సీఎం రమేష్. ఆయన పులివెందుల జెడ్పీటీసీ టీడీపీ అభ్యర్ధిని ప్రకటించారు. బీటెక్ రవి సతీమణి పోటీ చేస్తారు అని ప్రకటించినది కూడా ఆయనే. అంతే కాదు టీడీపీ కచ్చితంగా గెలిచి తీరుతుందని జోస్యం చెబుతున్నారు. అంతే కాదు ఏపీలో వైసీపీ ఇక మీదట ఏ ఎన్నికల్లోనూ గెలిచేది ఉండదని అంటున్నారు. అంతే కాదు ఏపీలో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని కూడా సీఎం రమేష్ చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సమరం కడు ఆసక్తికరం అని బీజేపీ ఎంపీ ప్రకటన ద్వారా తెలుస్తోంది. చూడాలి మరి వైసీపీ వేసే అడుగులు ఏ విధంగా ఉంటాయో.

Tags:    

Similar News