రీ పోలింగ్ బహిష్కరణ.. ఓటమిని అంగీకరించినట్లేనా?

రెండు పోలింగు కేంద్రాల్లో ఎన్నిక బహిష్కరిస్తే, ఫలితంపై తీవ్ర ప్రభావం పడుతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.;

Update: 2025-08-13 05:53 GMT

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పరాజయాన్ని వైసీపీ ముందే అంగీకరిస్తుందా? అన్న చర్చ జరుగుతోంది. మంగళవారం పులివెందుల జడ్పీటీసీకి ఉప ఎన్నిక జరగగా, రెండు పోలింగు కేంద్రాల్లో బుధవారం రీ పోలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే రీ పోలింగును తాము బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. ప్రధాన పోటీదారు ఎన్నికను బహిష్కరించడంతో ఫలితం ఏకపక్షమయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని, మొత్తం పోలింగును రద్దుచేసి రీపోలింగు నిర్వహిస్తే తాము అంగీకరిస్తామని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రకటించారు.

రెండు పోలింగు కేంద్రాల్లో ఎన్నిక బహిష్కరిస్తే, ఫలితంపై తీవ్ర ప్రభావం పడుతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పులివెందుల జడ్పీటీసీ పరిధిలో మొత్తం 15 పోలింగు కేంద్రాలు ఉండగా, 10,600 ఓట్లు ఉన్నాయి. మంగళవారం జరిగిన పోలింగులో సుమారు 76.44 శాతం పోలింగు నమోదు అయింది. 3, 14 నెంబర్ల పోలింగు కేంద్రాల్లో సరిగా ఓటింగు జరగలేదని ఫిర్యాదులు వచ్చాయి. ఈ రెండు కేంద్రాల్లో సుమారు వెయ్యి ఓట్లు ఉన్నాయి. అయితే అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ విపక్ష వైసీపీ రీ పోలింగును బహిష్కరించడంతో రెండు కేంద్రాల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటింగు జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

దాదాపు వెయ్యి ఓట్లను వైసీపీ వదులుకుందంటే, పులివెందుల ఫలితం ప్రతికూలంగా వస్తుందని ఆ పార్టీ అంచనాకు వచ్చిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జడ్పీటీసీ ఉప ఎన్నికలో మొత్తం దాదాపు 7,500 ఓట్లు పోలయ్యాయి. ఇందులో సగానికి పైగా ఓట్లు సాధించిన వారు గెలుపొందుతారు. అంటే కనీసం 3,500 ఓట్లు రావాల్సివుంటుందని అంటున్నారు. మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీ చేయగా, ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్యే జరిగింది. అయితే మంగళవారం పోలింగ్ నిర్వహణపై వైసీపీ తీవ్ర అసంతృప్తితో ఉంది. మొత్తం 15 పోలింగు కేంద్రాల్లో కేంద్ర బలగాల పర్యవేక్షణలో రీ పోలింగు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై కోర్టు ఆశ్రయిస్తామని ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రకటించారు.

అయితే విపక్షం ఆలోచనను ముందే పసిగట్టిన అధికార పక్షం, విషయం కోర్టు వరకు వెళితే ఎన్నిక నిర్వహణ సక్రమంగా చేపట్టామని చెప్పేందుకు రెండు కేంద్రాలలో రీ పోలింగ్ నిర్వహిస్తున్నట్లు వైసీపీ చెబుతోంది. అందుకే రెండు చోట్ల రీ పోలింగును బహిష్కరించాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం వల్ల ఎన్నిక ఫలితం టీడీపీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష టీడీపీ కూడా ఇదే విధంగా ఎన్నికలను బహిష్కరించింది. దాంతో అప్పట్లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఏకపక్ష ఫలితాలను సాధించిందని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు

Tags:    

Similar News