ఒంటిమిట్ట ఊసు లేదు.. అక్కడ మాత్రం ఓటుకు రూ.10 వేలు!

రెండు పార్టీలు పులివెందులపైనే ఎక్కువగా ఫోకస్ చేయడంతో ఒంటిమిట్టలో పెద్దగా ఎన్నిక ప్రభావం కనిపించడం లేదు.;

Update: 2025-08-10 06:23 GMT

కడప జిల్లాలో రెండు జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండగా, రెండు చోట్ల భిన్న రాజకీయ పరిస్థితులు నెలకున్నాయి. వైసీపీ ఖాతాలో ఉన్న రెండు స్థానాలను కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ కదన కుతూహలంతో కదులుతోంది. విపక్ష వైసీపీ మాత్రం పులివెందుల స్థానాన్ని మాత్రమే తిరిగి నెల బెట్టుకోడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. దీంతో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఆకర్షిస్తోంది. పులివెందులతోపాటు జరుగుతున్న ఒంటిమిట్ట జడ్పీ స్థానం గెలిచినా, ఓడినా ఒకటే అన్నట్లు వైసీపీ భావిస్తోందని చెబుతున్నారు. మరో ఏడాదిపాటు కాలపరిమితి ఉన్న ఈ రెండు జడ్పీటీసీ పదవుల వల్ల వైసీపీ ఆధీనంలో ఉన్న జడ్పీ పీఠానికి వచ్చే ముప్పు ఏమీ లేకపోయినప్పటికీ పులివెందుల స్థానం ఆ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారిందని అంటున్నారు.

ఓటుకు చాలా రేటు

మాజీ ముఖ్యమంత్రి జగన్ స్వస్థలం అయిన పులివెందులలో గెలుపు విపక్ష వైసీపీకి అత్యావసరం. గత ముప్పయ్యేళ్లుగా వైఎస్ కుటుంబమే నిర్ణయాత్మక శక్తిలా ఉన్న పులివెందులలో తొలిసారి గట్టి పోటీ కనిపిస్తోంది. దీంతో అక్కడ ఓటుకు చాలా రేటు పలుకుతోందని అంటున్నారు. పులివెందుల మండలంలో 10 వేలు ఓట్లు ఉండగా, ఒంటిమిట్టలో 24 వేల ఓట్లు ఉన్నాయి. వాస్తవానికి వైసీపీకి పెట్టని కోట పులివెందుల. అయితే పులివెందులలో వైసీపీని ఓడించి మాజీ సీఎం జగన్ ఇలాకాలోనే ఆయనకు పట్టు పోయిందని ప్రచారం చేయడానికి అధికార పార్టీ పూర్తిస్థాయిలో బలాన్ని ప్రయోగిస్తోందని చెబుతున్నారు. దీంతో ఎన్నడూ లేనట్లు పులివెందులలో ఓటుకు మంచి గిరాకీ ఏర్పడింది.

ఎప్పుడూ లేని పరిస్థితి

సాధారణంగా ఎన్నిక ఏదైనా పులివెందులలో పెద్దగా డబ్బు పంపిణీ చేసిన పరిస్థితి ఎన్నడూ లేదని అంటున్నారు. అసెంబ్లీ, స్థానిక ఎన్నికల్లో ఇప్పటివరకు టీడీపీ ఉనికి చాటుకోడానికే మాత్రమే పరిమితమయ్యేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల వల్ల తొలిసారిగా పులివెందులలో జెండా ఎగరేయాలని టీడీపీ బలంగా పోరాడుతోందని చెబుతున్నారు. దీంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఒంటిమిట్టలో నిల్

రెండు పార్టీలు పులివెందులపైనే ఎక్కువగా ఫోకస్ చేయడంతో ఒంటిమిట్టలో పెద్దగా ఎన్నిక ప్రభావం కనిపించడం లేదు. అదే సమయంలో పులివెందులల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయని చెబుతున్నారు. రెండు పార్టీల బడా లీడర్లు మొత్తం పులివెందులలో మోహరించారు. దీంతో ఆ మండలంలో ఎక్కడ చూసినా సందడి కనిపిస్తోంది. విజయం కోసం శ్రమిస్తున్న నేతలు ఓటర్లకు భారీగా తాయిళాలు ప్రకటిస్తున్నట్లు చెబుతున్నారు. తీవ్ర ప్రలోభాలకు గురిచేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఓటుకు రూ.10 వేలు చెల్లించేందుకు సైతం రెడీ అవుతున్నారని అంటున్నారు. అయితే ఒంటిమిట్టలో ఈ పరిస్థితి లేదని సమాచారం. అక్కడ ఓటు వేస్తే వేశారు.. లేదంటే లేదు అన్నట్లే ఇరుపార్టీలు వ్యవహరిస్తున్నాయని చెబుతున్నారు.

ప్రచారానికి ఫుల్‌స్టాప్

పది వేల ఓట్లు ఉన్న పులివెందులలో సుమారుగా 8 నుంచి 9 వేల ఓట్లు పోలయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు. అంటే కనీసం 4500 నుంచి 5000 వేల ఓట్లు వచ్చిన వారు గెలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ దిశగా లెక్కలు వేసుకుంటున్న పార్టీలు ఓట్లు కొనుగోలు చేసేందుకు భారీగా వెచ్చిస్తున్నట్లు చెబుతున్నారు. ఆదివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. మంగళవారం పోలింగ్ జరుగుతోంది. దీంతో వచ్చే రెండు రోజులు కీలకంగా భావిస్తున్న పార్టీలు ఇప్పటికే భారీగా డబ్బు డంపింగ్ చేసినట్లు చెబుతున్నారు. ఈ డబ్బు పందెంలో ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారన్నదే పెద్ద చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. గతంలో ఎన్నడూ లేనట్లు డబ్బు పంపిణీ చేస్తుండటంతో పులివెందుల ఓటర్లు కూడా ఆశ్చర్యపోతున్నారని అంటున్నారు.

Tags:    

Similar News