పులివెందుల..... జగన్ భారం వేసేసారా ?

పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల 12న పోలింగ్ జరగనుంది.;

Update: 2025-08-10 19:30 GMT

పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల 12న పోలింగ్ జరగనుంది. ఇక ప్రచారం ఆదివారం సాయంత్రం నాలుగు గంటలతో ముగిసింది. సిట్టింగ్ సీటుని కాపాడుకోవాలని వైసీపీ పులివెందులను గెలిచి సత్తా చాటాలని టీడీపీ కూటమి హోరాహోరీ పోరాడుతున్న నేపథ్యం ఉంది. దాంతో ఈ అతి చిన్న ఉప ఎన్నిక ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

జగన్ ట్వీట్ లో అలా :

తన సొంత ఇలాకా అయిన పులివెందులలో జరుగుతున్న ఉప ఎన్నిక మీద వైసీపీ అధినేత జగన్ తాజాగా ట్వీట్ చేశారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నారు అని విమర్శించారు. అబద్దాలు చెప్పి మోసాలు చేసి కుర్చీని లాక్కోవాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. సీఎంగా చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.

భారమంతా అదే :

ఇంత చేసినా పులివెందుల ఒంటిమెట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ గెలిచి తీరుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేవుడి దయతో ప్రజల దీవెనలతో వైసీపీ రెండు సీట్లలో విజయం సాధిస్తుందని అన్నారు. మొత్తానికి చూస్తే పులివెందుల విషయంలో జగన్ దేవుడి మీదనే భారం వేశారా అన్న చర్చ అయితే సాగుతోంది.

ఏర్పాట్లు పూర్తి :

ఇదిలా ఉంటే ఈ నెల 12న జరిగే పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. పోలింగ్ ఆ రోజున ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేసినట్లుగా అధికారులు చెప్పారు.

తీర్పు ఎలా ఉంటుందో :

పులివెందులలో మొత్తం 10 వేల ఓట్లు ఉన్నాయి. ఇందులో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 2500 ఓట్ల దాకా వచ్చాయి. వైసీపీకి ఆరు వేల ఓట్ల దాకా వచ్చాయి. దీంతో వైసీపీకి కీలకమైన పట్టు ఉన్న పంచాయతీలలో ఫ్యాన్ గాలి వీస్తుందని ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. మరో వైపు చూస్తే గతంలో పరిస్థితి వేరు. సరిగ్గా ఎన్నికలు జరగనీయకుండా అంతా ఏకగ్రీవం చేసుకున్నారని ఇపుడు ప్రజలు తొలిసారి స్థానిక ఎన్నికల్లో తమ అభిప్రాయం చెబుతారు అని టీడీపీ అంటోంది. పైగా ప్రభుత్వ సంక్షేమ పధకాలు అభివృద్ధి ఫలితాలు ఈ ఎన్నికల్లో సైకిల్ పార్టీకి సానుకూలంగా ఉంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే పులివెందుల ఫలితం మాత్రం చాలా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ నెల 14న ఫలితాలు వెలువడనున్నాయి.

Tags:    

Similar News