పులివెందుల ఫలితం ఏపీ రాజకీయ సంచలనమేనా ?

ప్రతీ ఎన్నికకూ ఒక విశేషం ఉంటుంది. ప్రతీ తీర్పునకూ ఒక అర్ధం పరమార్ధం ఉంటాయి. ఓటు అన్నది జనాభిమతం.;

Update: 2025-08-12 02:30 GMT

ప్రతీ ఎన్నికకూ ఒక విశేషం ఉంటుంది. ప్రతీ తీర్పునకూ ఒక అర్ధం పరమార్ధం ఉంటాయి. ఓటు అన్నది జనాభిమతం. జనాలు ఏమి ఆలోచిస్తున్నారు ఏమనుకుంటున్నారు అన్నది ఎప్పటికపుడు ఎన్నికల ద్వారా తెలుస్తుంది. అందువల్లనే ఎన్నికలు అంటేనే ఎపుడూ ఉత్కంఠ ఉంటుంది. అది చిన్న ఎన్నిక లేక పెద్ద ఎన్నిక అన్నది ఇక్కడ ప్రధానం కానే కాదు. ఇక కీలక నేతల నియోజకవర్గాలలో ఒక వార్డుకు ఎన్నిక జరిగినా స్టేట్ మొత్తం రీసౌండ్ చేస్తుంది. ఇపుడు అలాంటి సందర్భమే వచ్చింది.

పులివెందుల అడ్డా :

కడప జిల్లాలో పులివెందుల అడ్డా అంటే వైఎస్సార్ ఫ్యామిలీదే అని చెబుతారు. కళ్ళు మూసుకుని మరీ ఆ మాటే పదిసార్లు అంటారు. అంతలా ఆ ప్రాంతం వైఎస్సార్ ఫ్యామిలీకి కట్టుబడిపోయింది. పులివెందుల సామాన్యమైనది కాదు కదా. అక్కడ ఓటుతో ఇద్దరిని ఏపీకి సీఎంలుగా చేసింది. అంతలా ప్రభావం చూపించిన ఓటు అక్కడ ఉంది. పైగా వైఎస్సార్ ఫ్యామిలీకి దశాబ్దాల అనుబంధం ఉన్న చోటు అది.

హోరా హోరీగా పోరు :

పులివెందుల జెడ్పీటీసీకి ఉప ఎన్నిక అన్నది ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. అక్కడ కటాకటీగా ఉన్నవి పది వేల ఓట్లు మాత్రమే. కానీ ఏపీ మొత్తానికి ఈ ఎన్నిక ఆసక్తిని రేకెత్తిస్తోంది అంటే పులివెందుల ఉన్నది మాజీ సీఎం జగన్ ఇలాకాలో. ఆయన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఒక ఎన్నిక అది. దాంతోనే రాజకీయ ప్రాముఖ్యత పెరిగిపోయింది. ఇక్కడ గెలుపు అన్నది అటు అధికార కూటమికి ఇటు వైసీపీకి కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారుతోంది.

కూటమి ధీమా అదే :

పులివెందుల అడ్డా అని జగన్ చెప్పుకున్న చోట ఉప ఎన్నిక జరుగుతోంది. ఈసారి విజయం టీడీపీ కూటమికే దక్కుతుంది అని హోం మంత్రి అనిత అంటున్నారు. పులివెందులలో ఎన్నికలు సక్రమంగా నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు. ఎంతలా అంటే ఏకంగా 11కి పైగా నామినేషన్లు ఇండిపెండెంట్లు వేశారు అంటే అక్కడ ప్రజాస్వామ్యాన్ని ఎన్నికలను జనాలు ఎంతలా కోరుకుంటున్నారో అర్ధం చేసుకోవాలని అన్నారు. తమ పార్టీ గెలుపు తధ్యమని ఆమె జోస్యం చెప్పారు.

ఎందుకు అత ప్రతిష్ట :

ఈ మధ్యన ఏపీలో చూస్తే వైసీపీకి మళ్ళీ గ్రాఫ్ పెరిగింది అన్న చర్చ సాగుతోంది. జగన్ ఎక్కడికి వెళ్ళినా జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. జగన్ వెళ్లిన చోటల్లా జనాలు వెల్లువెత్తుతున్నారు. దాంతో పాటు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం రాసిపెట్టుకోండి అని వైసీపీ అధినాయకత్వం కూడా స్పష్టంగా చెబుతోంది. దీంతో వైసీపీ వర్సెస్ కూటమి అన్నట్లుగా పొలిటికల్ వార్ సాగుతోంది. ఈ క్రమంలోనే పులివెందుల ఉప ఎన్నిక అందివచ్చిన అవకాశంగా కూటమికి వచ్చింది. దాంతో ఈ ఎన్నికల్లో గెలిచి జగన్ సొంత ఇలాకాలోనే ఆయనకు బలం లేదు అని నిరూపించాలన్నది ఒక తాపత్రయంగా కనిపిస్తోంది అంటున్నారు. అంతే కాదు కూటమి ప్రభుత్వం గత పధిహేను నెలలుగా అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలకు జనామోదం ఉందని రుజువు చేసుకునేందుకు వీలు కలుగుతోంది అని అంటున్నారు.

నైతికంగానే షాక్ :

పులివెందుల ఫలితం అటు ఇటు అయినా ఏమవుతుంది అన్నది మరో చర్చ. జగన్ సొంత ఇలాకాలో ఆయన ఒక జెడ్పీటీసీని గెలిపిచుకోలేకపోయారు అన్నది టీడీపీ కూటమి ఏపీ అంతటా ప్రచారం చేస్తుంది. ఉన్న చోటనే బలం లేదని కూడా గట్టిగా చెబుతుంది. తాము పులివెందులను కూడా గెలిచామని ఇక 2029లో జగన్ ఓటమి ఖాయమని కూడా అంటుంది. అయితే కుప్పం విషయంలో వైసీపీ ఇదే విధంగా ప్రచారం చేసింది.

కుప్పం మండలం మునిసిపాలిటీలను గెలుచుకుంది కానీ చివరికి జరిగింది ఏమిటి. తిరిగి 2024 ఎన్నికల నాటికి అంతకు మూడింతలు భారీ మెజారిటీతో చంద్రబాబు కుప్పం నుంచి ఎనిమిదోసారి గెలిచి సత్తా చాటారు. ఉప ఎన్నికలకు సార్వత్రిక ఎన్నికలకూ ఎప్పుడూ సాపత్యం ఉండదు. అయితే గెలుపు ఎపుడూ గెలుపే కాబట్టి వైసీపీని కొన్నాళ్ల పాటు డీమోరలైజ్ చేయడానికి ఈ ఫలితం ఉపయోగపడవచ్చు. ఒక వేళ వైసీపీయే గెలిచినట్లు అయితే మా బలం మాకు ఉంది అని గట్టిగా చెప్పుకోవచ్చు. అంతకు మించి ఏమీ ఉండదనే అంటున్నారు.

Tags:    

Similar News