పేరుకే ప్రభుత్వ రంగ బ్యాంకులు.. ఎస్ బీఐతో పోలిస్తే ఎంత తేడా?
బ్యాంకుల బాదుడు ఎంతన్న విషయాన్ని ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో ఎదురవుతూనే ఉంటుంది. బ్యాంక్ ఖాతాలో కనీస నగదు లేని కారణంగా జరిమానాలు వేయటం తరచూ చూస్తుంటాం.;
బ్యాంకుల బాదుడు ఎంతన్న విషయాన్ని ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో ఎదురవుతూనే ఉంటుంది. బ్యాంక్ ఖాతాలో కనీస నగదు లేని కారణంగా జరిమానాలు వేయటం తరచూ చూస్తుంటాం. ఈ తీరు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేటు బ్యాంకుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే.. ప్రైవేటు బ్యాంకులకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా వ్యవహరిస్తాయన్న విషయాన్ని తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఇచ్చిన సమాధానాన్ని జాగ్రత్తగా చూసినప్పుడు అర్థమవుతుంది.
బ్యాంకుల్లో మూలుగుతున్న అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించిన లెక్కను అడిగిన సందర్భంలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి మరో విషయాన్ని చెప్పారు. అదేమంటే.. తమ బ్యాంకు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిర్వహించలేని స్థితిలో ఉన్న ఖాతాదారుల నుంచి దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు (ప్రైవేటు బ్యాంకులు కాదు సుమి) వసూలు చేసిన జరిమానాల చిట్టా గురించి చెప్పుకొచ్చారు. దేశంలో అతి పెద్ద బ్యాంకుగా పేర్కొనే ఎస్ బీఐ ఇలాంటి ఫైన్లు వసూలు చేయట్లేదు. కానీ.. ప్రభుత్వ రంగ బ్యాంకులైన మరో పన్నెండు బ్యాంకులు మాత్రం కనీస బ్యాలెన్సు నిర్వహించని ఖాతాదారుల నుంచి ఫైన్లు విధించే వైనాన్ని.. ఆ రూపంలో సదరు బ్యాంకులకు అందిన వందలాది కోట్ల రూపాయిల గురించి చెప్పినప్పుడు ముక్కున వేలేసుకునే పరిస్థితి.
బ్యాంకు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిర్వహించలేని దుస్థితిలో ఉన్నారంటేనే వారి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వారి నుంచి ఫైన్ల రూపంలో బాదేయటం ఏమిటి? అన్నది ప్రశ్న. అయితే.. కొన్ని ప్రైవేటు బ్యాంకుల మాదిరే ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఎలాంటి దయ ఉండదని.. ఆదాయం మీదనే తప్పించి.. తమ వినియోగదారులను పట్టించుకోదన్న విషయం కేంద్రమంత్రి ఇచ్చిన వివరాలతో అర్థమవుతుంది.
కనీస బ్యాలెన్స్ ను నిర్వహించటం లేదన్న కారణంగా జరిమానాలతో బాదేసే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 12 బ్యాంకులు 2020-21 నుంచి 2024-25 మధ్య కాలంలో వసూలు చేసిన ఫైన్ మొత్తం ఎంతో తెలుసా? అక్షరాల రూ.8933 కోట్లు. ఇందులో ఇండియన్ బ్యాంక్ టాప్ ప్లేస్ లో ఉండగా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండో స్థానంలో ఉన్నట్లుగా వెల్లడైంది. పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు వసూలు చేసిన రూ.8933 కోట్ల జరిమానాల్లో.. ఇండియన్ బ్యాంకు వసూలుచేసిన జరిమానాల మొత్తం అక్షరాల రూ.1828.18 కోట్లు కాగా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తాను మాత్రం ఏ మాత్రం తీసిపోనన్నట్లుగా రూ.1662.42 కోట్లు బాదేసింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.1531.62 కోట్లు ఫైన్ల రూపంలో బాదేయగా.. కెనరా బ్యాంకు రూ.1212.92 కోట్లు బాదేసి నాలుగో స్థానంలో నిలిచింది. ఈ పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతి తక్కువగా వసూలు చేసిన ప్రభుత్వ రంగ బ్యాంక్ గా ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకు నిలిచింది. ఈ బ్యాంక్ రూ.62.04 కట్లు మాత్రమే వసూలు చేసింది. అయితే.. 2020 మార్చి నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం ఎలాంటి జరిమానాలు విధించలేదు.
మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. బ్యాంకులు వసూలు చేసే జరిమానాలు ఐదేళ్లలో 90 శాతం పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కెనరా బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ బరోడా.. పంజాబ్ నేషనల్ బ్యాంకు.. ఇండియన్ బ్యాంకు.. బ్యాంక్ ఆఫ్ ఇండియా.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. యూనియన్ బ్యాంకులు ఈ ఫైన్లు రద్దు చేసినట్లుగా చెబుతున్నారు. ఏమైనా మీకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండి.. వాటిల్లో కనీస బ్యాలెన్సుల్ని నిర్వహించని ఖాతాలపై జరిమానాలు విధించే విధానం ఉంటే.. అక్కడ బ్యాంకు ఖాతాను రద్దు చేసుకొని.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలాంటి బ్యాంకుల్లో ఖాతా తెరవటం ఉత్తమం.