టైం, ప్లేసు చెబితే అక్కడికే వస్తా.. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓపెన్ ఛాలెంజ్!

ప్రొఫెసర్ నాగేశ్వర్ తన మాటలను ఉపసంహరించుకున్నా, ఆయనపై ఎఫ్ఐఆర్ లను ఉపసంహరించుకోకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడాన్ని రౌండ్ టేబుల్ సమావేశంలో తీవ్రంగా ఖండించారు.

Update: 2026-05-27 12:09 GMT

ఏపీ ప్రభుత్వం, ప్రొఫెసర్ నాగేశ్వర్ మధ్య వివాదం ముదురుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలకు నిరసనగా, జనసేన కార్యకర్తలు పోలీసు కేసులు పెట్టడం, వాటి ఆధారంగా ప్రొఫెసర్ పై పలు పోలీసుస్టేషన్లలో ఎఫ్ఐఆర్ లు నమోదు చేయడంపై తెలంగాణ మేథావులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతుగా బుధవారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రొఫెసర్ నాగేశ్వర్ తోపాటు పలువురు జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారులు పాల్గొన్నారు.

ప్రొఫెసర్ నాగేశ్వర్ తన మాటలను ఉపసంహరించుకున్నా, ఆయనపై ఎఫ్ఐఆర్ లను ఉపసంహరించుకోకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడాన్ని రౌండ్ టేబుల్ సమావేశంలో తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రానికి ఏపీ పోలీసులు వచ్చి, ప్రొఫెసర్ ను ఎలా అరెస్టు చేస్తారో చూస్తామంటూ పలువురు మేథావులు సవాల్ విసిరారు. తెలంగాణ మేథావులను పాత్రికేయులను తొక్కుతామంటే సహించేది లేదని బక్క జాన్సన్ తేల్చిచెప్పారు. నాగేశ్వర్ పై తుపాకి పెట్టి మమ్మల్ని కాల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు వచ్చే ఏపీ పోలీసులను అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.

సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ కు తెలంగాణ కోసం మాట్లాడే అర్హతే లేదన్నారు. ఆయనను ఉప ముఖ్యమంత్రిగా చేయడమే తప్పు అంటూ యాదగిరి వ్యాఖ్యానించారు. నాగేశ్వర్ ను అరెస్టు చేసే అర్హత లేదన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ చాలా సంస్కారవంతంగా మాట్లాడతారని కితాబునిచ్చారు. రాజ్యాంగం తమకు మాట్లాడే స్వేచ్ఛనిచ్చిందన్నారు. చేగువేరా బొమ్మలు పట్టుకుని గద్దర్ ను మోసం చేశావని, రోజుకొక పార్టీ మారుస్తావంటూ యాదగిరి ఫైర్ అయ్యారు.

ఇక ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ, కష్టకాలంలో తనకు అండగా నిలిచిన తెలంగాణ జర్నలిస్టులు, మేథావులు, సామాజిక కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన తాను 30 ఏళ్ల వయసులోనే అరెస్టులకు భయపడలేదని, ఇప్పుడు తనకు 62 వయసు అని ఇప్పుడు భయపడతానా? అంటూ ప్రశ్నించారు. తన ఇంటికి ఏపీ పోలీసులు వచ్చారని కొన్ని పత్రికలు రాస్తున్నాయని అందులో ఎటువంటి నిజం లేదన్నారు. తనకు తెలంగాణ ప్రభుత్వం భద్రత కల్పించిందని వెల్లడించారు.

తనను అరెస్టు చేయడానికి ఏపీ పోలీసులు రారని తాను చెప్పనని నాగేశ్వర్ వ్యాఖ్యానించారు. ఏపీ పోలీసులు హైదరాబాద్ కు వచ్చి ఉంటారని, కానీ తన ఇంటికి మాత్రం రాలేదని స్పష్టం చేశారు. తనపై నమోదు చేసిన కేసులు, సెక్షన్లు నవ్వు తెప్పిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వమే నేరుగా కేసులు పెట్టిందని ఆక్షేపించారు. కుల చిచ్చు పెట్టిందని కేసులు నమోదు చేశారని తన వ్యాఖ్యల్లో ఎక్కడా కులాల ప్రస్తావన లేదని తేల్చిచెప్పారు. ప్రాంతం అడ్డు పెట్టుకున్నారని పవన్ ఆరోపించారని, తాను ఎక్కడా ప్రాంతం అన్న వ్యాఖ్యలు చేయలేదని నాగేశ్వర్ స్పష్టం చేశారు.

ఆ రెండు పార్టీల వారే ప్రాంతాల ప్రస్తావన తీసుకువచ్చారని ఆక్షేపించారు. నువ్వు తెలంగాణ వాడివి ఆంధ్రా రాజకీయాలతో నీకేం పని అంటూ ప్రశ్నిస్తున్నారని, తాను అమెరికా, ఇరాన్ కోసం కూడా మాట్లాడతానన్నారు. మాట్లాడొద్దని చెప్పడం ఎక్కడి సిద్ధాంతమో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘తెలంగాణ వాడిని అని మాట్లాడొద్దంటే ఎలా? కులం చిచ్చు పెట్టానని కేసు పెట్టారు, నోటీస్ ఇవ్వకుండా అరెస్టు చేసేలా అల్లర్లు సృష్టించానని కేసులు పెట్టారు. ప్రజా జీవితాన్ని అల్లకల్లోలం పెట్టానని మరో కేసు పెట్టారు. ఈ కేసులను చూస్తే ఆయా సెక్షన్లు వ్యాఖ్యలు, ప్రకటనలకు వర్తించవని ఉందని తెలిపారు. తాను మాట్లాడటం వల్ల ఎవరికి నష్టం జరిగిందని నాగేశ్వర్ ప్రశ్నించారు.

కనీసం రెండు దోమలు కూడా ఎవరిని చంపలేదు, నాలుగు ఈగలైనా చంపలేదు.. రెండు కుక్కలు అయినా కొట్లాడుకున్నాయా?’’ అంటూ నాగేశ్వర్ ప్రశ్నించారు. తనపై నమోదు చేసిన కేసులు చూస్తే నవ్వొస్తోందన్నారు. చివరగా, చావనైనా చస్తాను కానీ మాట్లాడటం మాననని తేల్చిచెప్పారు. మీరు అరెస్టు చేసుకుంటారా? కేసులు ఉపసంహరించుకుంటారా? అనేది మీ ఇష్టం కానీ నేను మాట్లాడుతూనే ఉంటానని తేల్చిచెప్పారు. అరెస్టుకు తాను సిద్ధంగా ఉన్నానని టైం, ప్లేసు చెబితే అక్కడికే వస్తానంటూ ముగించారు.


Full View


Tags:    

Similar News