ఎంతసేపూ నెహ్రూ...ఇందిరా గురించేనా...పాయింటే మరి !

ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఒక్కతే స్వాతంత్ర్యం తెచ్చింది అన్నది పూర్తి నిజం కాకపోయినా చాలా వరకూ నిజం అందులో ఉంది. కాంగ్రెస్ అనే సంస్థ అనాడు తెల్ల దొరలతో పోరాడి సాధించింది.;

Update: 2025-11-03 00:30 GMT

ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఒక్కతే స్వాతంత్ర్యం తెచ్చింది అన్నది పూర్తి నిజం కాకపోయినా చాలా వరకూ నిజం అందులో ఉంది. కాంగ్రెస్ అనే సంస్థ అనాడు తెల్ల దొరలతో పోరాడి సాధించింది. ఇక మిగిలిన సంస్థలు కూడా పోరాటం చేసాయి. అంతా కలసి దేశానికి స్వేచ్చా వాయువులు ప్రసాదించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నెహ్రూ ఒక పదిహేడేళ్ళు, ఇందిరాగాంధీ ఒక పదహారేళ్ళు ఈ దేశాన్ని ఏలారు. ఇక రాజీవ్ గాంధీ అయిదేళ్ళ పాలన కూడా కలుపుకుంటే 38 ఏళ్ళ పాటు ఒకే కుటుంబం ఏలుబడిలో దేశం ఉంది. నెహ్రూ ఫ్యామిలీ పాలించడం వల్ల దేశానికి మేలు జరిగిందా లేదా అంటే ఇక్కడ కూడా భిన్న వాదనలు ఉన్నాయి. అయితే మంచీ జరిగింది, కొన్ని సందర్భాలలో ఇబ్బందులు కూడా వచ్చాయి. కానీ విమర్శలు చేసే వారు ప్రధానంగా ప్రత్యర్ధులు అయితే నెహ్రూ ఫ్యామిలీని లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున ఎటాక్ చేస్తూంటారు. మరీ ముఖ్యంగా చూస్తే బీజేపీ ఈ పని చేస్తూ వస్తోంది దీని మీద ఐదవ తరం గాంధీలు గట్టిగా బదులిస్తున్నా బీజేపీ బిగ్ సౌండ్ లో అది పెద్దగా వినిపించడం లేదు అన్న మాట కూడా ఉంది.

ప్రియాంక ఫైర్ :

బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎంపీ ఆ పార్టీ అగ్ర నేత అయిన ప్రియాంకా గాంధీ బీజేపీ అగ్ర నేతల మీద ఒక రేంజిలో ఫైర్ అయ్యారు. ఎంతసేపూ నెహ్రూ ఇందిరాగాంధీలను విమర్శించడం తప్పించి బీజేపీ ఈ దేశానికి ఏమి చేసిందని ఆమె సూటిగా ప్రశ్నించారు. మాట్లాడితే చాలు నెహ్రూ అలా చేసారు, ఇందిర ఇలా చేశారు వారి వల్లనే తప్పులు జరిగాయని నిందలు వేస్తున్న బీజేపీ పెద్దలు తమ హయాంలో ఏమి చేశామో ఎందుకు చెప్పలేకపోతున్నారు అని ఆమె నిలదీశారు. నెహ్రూ ఇందిరాగాంధీ దేశానికి చేసిన మేలు బీజేపీ పెద్దలకు ఏ మాత్రం కనిపించడం లేదని కేవలం రాజకీయ విమర్శలు మాత్రం చేస్తున్నారు అని ఆమె మండిపడ్డారు.

పరిశ్రమలు స్థాపించారు :

ఈ దేశంలో పారిశ్రామిక విప్లవం తీసుకుని వచ్చి పెద్ద ఎత్తున కర్మాగారాలు స్థాపించి ప్రజలకు ఉపాధి కల్పించింది నెహ్రూ ఇందిరాగాంధీలు కాదా అని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వ రంగంలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి అంటే దానికి ఆ ఇద్దరి పాలనలో తీసుకున్న కీలక నిర్ణయాలు కారణం కాదా అని ఆమె నిగ్గదీస్తున్నారు. ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేసి దేశంలో ఉద్యోగ వ్యవస్థని పటిష్టం చేసిన ఆ ఇద్దరు అగ్ర నేతలని విమర్శించే ముందు బీజేపీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది అని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలు బీజేపీ ఎన్ని ఏర్పాటు చేసిందని ఆమె నిలదీశారు.

వర్తమానమేదీ :

బీజేపీ నాయకులు మాట్లాడితే గతం అంటూ చరిత్రలోకి వెళ్తారని లేదా భవిష్యత్తు ఆశలు చూపిస్తారని తప్పించి వర్తమానంలో వారు ఏమి చేశారు అన్నది ఎపుడూ చెప్పింది లేదని ప్రియాంకా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే ప్రభుత్వం బీహార్ లో ఎన్నో ఏళ్ళుగా అధికారంలో ఉండి ఉద్యోగాలు ఇవ్వలేకపోయిందని ఇపుడు మాత్రం ఎన్నికల హామీగా కోటి ఉద్యోగాలు అని ప్రకటిస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడ నుంచి ఎక్కడికి అయినా వలసలకు వెళ్తున్న వారిలో బీహార్ వారే అత్యధికమని ఆమె అన్నారు. ఇలా బీహార్ ని ఏమీ కాకుండా చేసి మరోసారి గెలిపించమని ఎలా అడుగుతారని ఆమె ప్రశన వర్షమే కురిపిస్తున్నారు. మొత్తం మీద చూస్తే నెహ్రూకి ముత్త మనవరాలు, ఇందిరమ్మకు అసలు మనవరాలు అయిన ప్రియాంక సూటిగా సుత్తి లేకుండా బీజేపీ పెద్దలకు వేసిన ప్రశ్నలు ఆలోచింపచేసేలాగానే ఉన్నాయని అంటున్నారు. మరి దీని మీద కమలదళం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News