తప్పులో కాలేసిన మోడీ.. నాలుగు గోడల మధ్య జరిగింది చెప్పటమా?

ఎవరైనా ఒకరు.. మరొకరి వద్దకు వెళ్లి.. తన వ్యక్తిగత విషయాల్ని చెప్పుకున్న తర్వాత.. వాటిని నలుగురి ముందు.. మీకో రహస్యాన్ని చెప్పనా?

Update: 2023-10-08 14:30 GMT

ఎవరైనా ఒకరు.. మరొకరి వద్దకు వెళ్లి.. తన వ్యక్తిగత విషయాల్ని చెప్పుకున్న తర్వాత.. వాటిని నలుగురి ముందు.. మీకో రహస్యాన్ని చెప్పనా? అంటూ సదరు వ్యక్తి చెప్పిన వ్యక్తిగత విషయాల్ని చెప్పేస్తే ఎలా ఉంటుంది? అలాంటి వారికి ఎలాంటి మర్యాద దక్కుతుంది? తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అలాంటి తీరునే ప్రదర్శించారన్న విమర్శ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. నాలుగు గోడల మధ్య.. ఇద్దరు అత్యున్నత ప్రముఖుల మధ్య జరిగిన ప్రైవేటు సంభాషణను అందరి ముందు చెప్పటం.. అది కూడా కీలకమైన ఎన్నికలకు ముందు చెప్పటం దేనికి సంకేతం? పెద్ద మనిషిగా తనను తాను గొప్పగా అభివర్ణించుకునే మోడీ.. విలువలకు భిన్నంగా నాలుగు గోడల మధ్య జరిగిన ప్రైవేటు సంభాషణల్ని అందరి ముందు చర్చ పెట్టటాన్ని ప్రశ్నిస్తున్నారు.

ఆయన వెల్లడించిన సీక్రెట్ వల్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు జరిగిన నష్టం కంటే కూడా.. ప్రధాని మోడీ ఇమేజ్ కే ఎక్కువ డ్యామేజ్ జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకూ మోడీ ఎందుకంత ఇరిటేట్ అయ్యారు? బ్యాలెన్స్ మిస్ అయ్యారు? వ్యక్తిగత రహస్యాల్ని బజార్లో పెట్టటం ద్వారా ఆయన కోరుకునే రాజకీయ ప్రయోజనం కలిగితే అదో పద్దతి. అలాంటిదేమీ లేకుండా లాభం కంటే నష్టమే ఎక్కువగా జరగటాన్ని చూస్తే.. మోడీ ఎత్తుగడ అడ్డంగా ఫెయిల్ అయ్యిందన్న విషయం అర్థమవుతోంది.

Read more!

తన కొడుకును ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనను తనతో షేర్ చేసుకోవటమే కాదు.. తన అశీర్వాదాన్ని కేసీఆర్ కోరారంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల కారణంగా గులాబీ బాస్ కు.. ఆయన కొడుక్కి ఎంత నష్టం జరిగిందన్నది పక్కన పెడితే.. ఇలాంటి వ్యాఖ్యలతో మోడీ మీద ఉన్న గౌరవ మర్యాదలు తగ్గేలా మారాయన్న మాట బలంగా వినిపిస్తోంది. ప్రధాని మోడీ తీరును బీజేపీలోకి పెద్దలు సైతం తమ అంతర్గత సంభాషణల్లో ప్రస్తావించటం చూస్తే.. మోడీ గీత దాటినట్లుగా స్పష్టమవుతుంది. అంతేకాదు.. బీజేపీ.. బీఆర్ఎస్ మధ్య రహస్య అవగాహన ఉందన్న ప్రచారాన్ని మోడీ తన మాటలతో అదంతా నిజమన్న సర్టిఫికేట్ ఇచ్చేసినట్లు అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా.. మోడీ మాటలు తెలంగాణ బీజేపీకి శాపంగా మారటం ఖాయమంటున్నారు. ఎన్నికల ఫలితాలు అందులో నిజమెంతో తేల్చేయనున్నాయి.

Tags:    

Similar News