పట్టని కొడుకులకు తండ్రి షాక్.. 5 ఎకరాల్ని పంచాయితీకి ఇచ్చిన పూజారి
ఈ ఆసక్తికర ఉదంతం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేటలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..;
పెద్ద వయసులో తమను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకులు.. అవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్న తీరుకు సరైన రీతిలో బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యారో పూజారి. అందుకే.. తానున్నఊరికి తనకున్న ఐదు ఎకరాల భూమిని ఇచ్చేసిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఈ ఆసక్తికర ఉదంతం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేటలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..
పెంచికల్ కోటకు చెందిన నాగిళ్ల వెంకటేశ్వర్లు పూజారిగా పని చేస్తుంటారు. యాభై ఏళ్ల క్రితం తమ ఊరికి పూజారులు ఎవరూ లేకపోవటంతో.. వెంకటేశ్వర్లుకు భీమదేవరపల్లి మండలం కొప్పూర్ కు చెందిన వెంకటేశ్వర్లను పెంచికల్ కు తీసుకొచ్చిన గ్రామ పెద్దలు.. అందులో భాగంగా ఆయనకు 4.38 ఎకరాల భూమిని సాగు చేసుకునేందుకు కేటాయించారు. దీంతో.. ఆయనకు జీవనోపాధికి ఎలాంటి సమస్యలు రావని భావించారు.
ఇందుకు తగ్గట్లే వెంకటేశ్వర్లు సదరు భూమిలో పంటలు పండిస్తూ.. గ్రామంలో పౌరహిత్యం చేస్తున్నారు. కాలక్రమంలో ఆయనకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇటీవల ఆయన సతీమణి మరణించారు. మరోవైపు కొడుకులు ఇద్దరు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో.. అతడి బాగోగులు చూసే వారు లేకుండా పోయారు. పెద్ద వయసులో ఉన్న తనను ఎవరూ పట్టించుకోకపోవటం.. కన్నబిడ్డలు తనను పోషించేందుకు ఆసక్తి చూపించకపోవటంతో మనోవేదనకు గురయ్యాడు.
ఈ క్రమంలో ఊళ్లోని ఆలయానికి మరో పూజారిని నియమించారు. ఈ క్రమంలో గతంలో గ్రామస్తులు గతంలో తనకు కేటాయించిన భూమిని తిరిగి ఊరికి ఇచ్చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా గ్రామసభను తాజాగా నిర్వహించారు. తనకు కేటాయించిన భూమిని గ్రామ పంచాయితీకి కేటాయిస్తానన్న పత్రాన్ని.. గ్రామ పంచాయితీ లెటర్ హెడ్ మీద సంతకం చేయటం అందరిని ఆకర్షిస్తోంది. పూజారి నిర్ణయాన్ని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.