మాక్స్ వెల్ ను పెళ్లి చేసుకో.. ప్రీతి జింటా చేదు అనుభవం.. గట్టి కౌంటర్

క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టేంత వరకు కార్పొరేట్ సెటప్‌లో మహిళలు ఎంతగా కష్టపడాల్సి వస్తుందో తనకు తెలియదని ప్రీతి అన్నారు.;

Update: 2025-05-14 20:30 GMT

బాలీవుడ్ నటిగా, ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ సహ యజమానిగా సుపరిచితులైన ప్రీతి జింటాకు ఇటీవల సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. ఒక నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యపై ఆమె తీవ్రంగా స్పందిస్తూ, దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.

ఐపీఎల్ వేలం, జట్టు వ్యూహాలలో చురుగ్గా పాల్గొనే ప్రీతి, స్టేడియంలోనూ తమ జట్టు ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ కనిపిస్తారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆమె, తన వ్యక్తిగత విషయాలతో పాటు, పంజాబ్ జట్టుకు సంబంధించిన విశేషాలను కూడా తరచుగా పంచుకుంటారు.

ఈ క్రమంలో ఇటీవల ఆమె 'ఎక్స్' వేదికగా నిర్వహించిన 'ఆస్క్ మీ ఎనీథింగ్' సెషన్‌లో ఒక నెటిజన్ హద్దు మీరి ప్రవర్తించాడు. పంజాబ్ కింగ్స్ ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ ప్రదర్శనను ప్రీతి జింటాతో ముడిపెడుతూ, "మేడమ్.. మీరు మాక్స్‌వెల్‌ను పెళ్లి చేసుకోలేదు కాబట్టే.. అతడు మీ జట్టుకు సరిగ్గా ఆడటం లేదు" అని నీచంగా వ్యాఖ్యానించాడు.

ఈ వ్యాఖ్యపై ప్రీతి జింటా ఏమాత్రం సంశయించకుండా గట్టిగా బదులిచ్చారు. "ఐపీఎల్ ఫ్రాంచైజీల పురుష యజమానులను కూడా నువ్వు ఇదే ప్రశ్న అడగగలవా? లేదా మహిళను కాబట్టి నా పట్ల ఇలా వివక్షపూరితంగా కామెంట్ చేస్తున్నావా?" అని ప్రశ్నించారు.

క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టేంత వరకు కార్పొరేట్ సెటప్‌లో మహిళలు ఎంతగా కష్టపడాల్సి వస్తుందో తనకు తెలియదని ప్రీతి అన్నారు. "బహుశా నువ్వు ఏదో సరదా కోసమని ఇలా మాట్లాడి ఉండవచ్చు.. కానీ దయచేసి ఇలా చెత్తగా ప్రవర్తించవద్దు" అని సూచించారు. గత పద్దెనిమిదేళ్లుగా తాను కష్టపడి సంపాదించుకున్న పేరుకు కాస్త గౌరవం ఇవ్వాలని, దానికి తాను అర్హురాలినని పేర్కొన్నారు. ఇలా లింగవివక్షకు పాల్పడటం సరికాదని గట్టిగా బదులిచ్చి, నెటిజన్ నోరు మూయించారు.

కాగా, కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికి 11 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఏడింట గెలిచి, 15 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. దాదాపుగా ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకున్న పంజాబ్, ఈసారి టైటిల్ లేని లోటును తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది.

ఇక, గతంలో పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించి, ఐపీఎల్ 2025లో తిరిగి జట్టుతో చేరిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ప్రదర్శన ఈ సీజన్‌లో ఆశాజనకంగా లేదు. ఏడు మ్యాచ్‌లు ఆడి కేవలం 48 పరుగులే చేసి, గాయం కారణంగా మధ్యలోనే టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

ఇటీవల భారత్-పాకిస్తాన్ సరిహద్దుల ఉద్రిక్తతల నేపథ్యంలో ధర్మశాలలో పంజాబ్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ బ్లాక్ అవుట్ కారణంగా అర్ధంతరంగా ఆగిపోయింది. హుటాహుటిన స్టేడియం ఖాళీ చేయించగా, ప్రీతి జింటా కూడా తన వంతు సాయం చేశారు.

Tags:    

Similar News