కొత్త చర్చ : రాజ్యాంగంలో ఆ రెండు పదాలూ ఉండవా ?

భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించారు. రాజ్యాంగ రచనకు ఏకంగా మూడేళ్ళకు పైగా సమయం తీసుకుంది.;

Update: 2025-06-30 07:30 GMT

భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించారు. రాజ్యాంగ రచనకు ఏకంగా మూడేళ్ళకు పైగా సమయం తీసుకుంది. 1950 జనవరి 26 నుంచి దేశంలో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఈ రాజ్యాంగానికి పీఠిక అన్నది ఆత్మ లాంటిది. అందులో ఎలాంటి పదాలు కొత్తగా చేర్చకూడదు అని అని రాజ్యాంగ నిపుణులు అంటారు.

ఇక భారత రాజ్యాంగంలో ఎన్నో అధికరణలు ఉన్నాయి. వాటిని కాలానికి అనుగుణంగా మార్చుకుంటూ సవరణకు చేసుకుంటూ వచ్చారు. దాదాపుగా 120 కి పైగా రాజ్యాంగ సవరణలు జరిగాయని చెబుతారు. ఇదిలా ఉంటే రాజ్యాంగ ప్రవేశికలో మాత్రం కొత్త పదాలను చేర్చే సాహసం ఎవరూ చేయలేదని అంటున్నారు.

కానీ ఆ సాహసం శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా 1975లో ఎమర్జెన్సీ సమయంలో చేశారు అని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. భారత రాజ్యాంగం పీఠికలో సోషలిజం. సెక్యులరిజం అన్న పదాలు మొదట్లో లేవని వాటిని 1975 ప్రాంతంలో చేర్చారు అని ఆరోపిస్తున్నారు.

భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపానికి వేల సంవత్సరా చరిత్రకు భిన్నంగా ఈ పదాల చేర్చడం ఉందని అంటున్నారు. దీంతో ప్రస్తుతం దీని మీద చర్చగా మొదలై రాజకీయ రచ్చగా సాగుతోంది. ఇంతకీ ఏమి జరిగింది అంటే ఆర్ఎస్ఎస్ కీలక నేత ఒకరు దీనిని చర్చగా పెట్టారు

దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 50 సంవత్సరాలు పూర్తయిన ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే మాట్లాడుతూ రాజ్యాంగ ప్రవేశికలో సోషలిస్టు లౌకిక అనే పదాలపై చర్చ సముచితమని అన్నారు. అత్యవసర పరిస్థితి సమయంలో ప్రవేశికలో సోషలిస్టు లౌకిక పదాలు కొత్తగా చేర్చబడ్డాయని ఆయన చెప్పారు.

ఆ తరువాత వాటిని తొలగించడానికి ఎటువంటి ప్రయత్నం జరగలేదు. కాబట్టి అవి అలాగే ఉండాలా వద్దా అనే దానిపై చర్చ జరగాలని ఆయన అన్నారు. అంతే కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఈ పదాలు ప్రవేశికలో లేవని ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ పదాలను చేర్చడానికి వ్యతిరేకంగా అనేక సంవత్సరాలుగా అనేక చట్టపరమైన సవాళ్లు దాఖలయ్యాయి. గత సంవత్సరం సుప్రీంకోర్టు ఒక తీర్పులో వాటిని సమర్థించిందని ఆయన గుర్తు చేశారు.

ఇక చూస్తే కనుక ఈ పదాలను అప్పటి ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితి సమయంలో రాజ్యాంగంలోని 42వ సవరణ చట్టం 1976 ద్వారా చేర్చారు. ఆ తరువాత గత యాభై ఏళ్ళుగా దేశంలో లౌకికవాదం మీద చర్చ సాగుతూనే ఉంది. బీజేపీ లాంటి పార్టీలు నకిలీ లౌకికవాదం అని, ఓటు బ్యాంకు రాజకీయాలు అని, అలాగే, మైనారిటీలను బుజ్జగించే రాజకీయాలు అని విమర్శలు చేస్తూనే ఉన్నారు.

ఇపుడు ఆర్ఎస్ఎస్ దీని మీద విమర్శలు చేయడంతో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ కూడా దీనిని సమర్ధించారు. లౌకిక వాదం. సోషలిజం పదాలను తీసివేయాల్సిందే అన్నది ఆయన మాటగా ఉంది. అదే సమయంలో చాలా మంది బీజేపీ నేతలు అదే అంటున్నారు

దీని మీద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అయితే బీజేపీ అంబేద్కర్ రాజ్యాంగం స్థానంలో మార్పులు చేయాలని చూస్తోందని ఘాటైన విమర్శలు చేశారు. ఈ విధంగా ఇపుడు ఈ రెండు పదాల చుట్టూనే అంతా తిరుగుతోంది. మరి ఈ రెండు పదాలు అంటే వద్దు అంటున్న బీజేపీ పెద్దలు తమ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి తీసివేయగలరా అన్న చర్చ కూడా సాగుతోంది.

రాజ్యాంగం ప్రవేశికలో చేర్చిన ఈ పదాలను తొలగించాలి అంటే ఎన్డీయే బలం సరిపోతుందా మిత్రులుగా ఉన్న పార్టీలు అందుకు అంగీకరిస్తాయా అన్నదే సందేహంగా ఉంది. మరో వైపు చూస్తే బీజేపీకి సొంతంగా మెజారిటీ అయితే లేదు. మరి ఈ చర్చ ఇపుడు ఎందుకు అంటే మరోసారి హిందూత్వని రగిలించడానికా అన్నది కూడా ఉంది. ఏది ఏమైనా 2029లో బీజేపీ పూర్తి మెజారిటీతో గెలిస్తే కనుక ఈ రెండు పదాలను రాజ్యాంగంలో లేకుండా తొలగిస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. మొత్తానికి ఇపుడు సరికొత్త రాజకీయ రచ్చగా ఈ రెండు పదాలు మారిపోయాయి.

Tags:    

Similar News