జార్ఖండ్ ఎన్ కౌంటర్..చనిపోయినవారిలో రూ.కోటి రివార్డు ఉన్న మావోయిస్టు!

సోమవారం జార్ఖండ్ లోని బొకారో జిల్లా లాల్ పానియా ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది.;

Update: 2025-04-21 09:41 GMT

మావోయిస్టులకు వ్యతిరేకంగా కొంతకాలంగా ఛత్తీస్ గఢ్ లోని దండకారణ్యంలో గర్జిస్తున్న భద్రతా దళాల తుపాకులు.. ఇప్పుడు జార్ఖండ్ లో పేలాయి. కొన్ని నెలలుగా వందల మంది మావోయిస్టులను ఎన్ కౌంటర్ లలో హతమార్చిన భద్రతా దళాలు ఇప్పుడు మరో భారీ ఎన్ కౌంటర్ కు దిగాయి. అయితే, ఈసారి ఛత్తీస్ గఢ్ కాదు.. జార్ఖండ్ లో.

ఉమ్మడి బిహార్ ఉండగా.. అడవులతో కూడిన జార్ఖండ్ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు అధికంగా ఉండేవి.. అయితే, క్రమంగా మావోయిస్టు కార్యకలాపాల కేంద్రం ఛత్తీస్ గఢ్ లోని దండకారణ్యానికి మారింది. ఇటీవలి ఎన్ కౌంటర్లన్నీ అక్కడే జరిగాయి.

సోమవారం జార్ఖండ్ లోని బొకారో జిల్లా లాల్ పానియా ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఇప్పటికే ఎనిమిది మంది చనిపోయినట్లు చెబుతున్నా, ఈ సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. ఇక ఎన్ కౌంటర్ మరణాల్లో ప్రయాగ్ మాంఝీ అలియాస్ వివేక్, పుచన, నాగ మాంఝీ, కరన్, లెతర పేర్లున్న మావోయిస్టు చనిపోయాడు. ఇతడిపై రూ.కోటి రివార్డును గతంలో ప్రకటించింది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ). ఇతడితో పాటు చనిపోయిన 8 మందిలో అరవింద్‌, రామ్‌ మాంఝీలపైనే రూ.10 లక్షల రివార్డు ఉండడం గమనార్హం.

ఇక ప్రయాగ్ మాంఝీ.. మావోయిస్టు పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి అయిన కేంద్ర కమిటీలో సభ్యుడు. ప్రశాంత్‌ హిల్స్‌ ఇతడి అడ్డా. ఉమ్మడి బిహార్‌, ఛత్తీస్‌ గఢ్‌, ఒడిశా రాష్ట్రాల్లో 100 దాడులు చేశాడని చెబుతారు. గిరిధి అనే జిల్లాలోనే 50 కేసులు, ఇతడిపై రూ.కోటి రివార్డ్‌ ఉండడం గమనార్హం.

ధనాబాద్‌ జిల్లా దల్ బుదలో పుట్టిన మాంఝీ.. జార్ఖండ్ లో అత్యధిక రివార్డు ఉన్న రెండో మావోయిస్టు. మాంఝీ కాకుండా మరో నలుగురి పైనే రూ.కోటి రివార్డులు ఉండడం గమనార్హం.

కేంద్ర కమిటీ సభ్యుడు, కీలక నాయకుడైన మాంఝీ కదలికలపై కొన్నాళ్లుగా నిశితంగా ఫోకస్ పెట్టాయి భద్రతా దళాలు. అతడు పరస్నాథ్‌ అనే ప్రాంతంలోకి వచ్చినట్లు తెలియగానే.. అప్రమత్తం అయ్యాయి. తాజాగా సీఆర్‌పీఎఫ్‌, జార్ఖండ్ పోలీసులు కూంబింగ్‌ చేపట్టారు. లుగు హిల్స్‌ వద్ద మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్‌ కౌంటర్‌ మొదలైంది. కాగా, ప్రయాగ్‌ మాంఝీ భార్య జయా నిరుడు పోలీసులకు దొరికిపోయారు. క్యాన్సర్‌ బాధితురాలైన ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది.

Tags:    

Similar News