కూటమిలో ‘ప్రవీణ్ ప్రకాష్’లు ఎందరు? వైసీపీ సోషల్ మీడియా ప్రశ్న

ఆయన ఎక్కడా రూల్స్ కి వ్యతిరేకంగా పనిచేయలేదని, ఈ విషయాన్ని వీడియోలో స్పష్టం చేశారని వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు.;

Update: 2025-11-13 15:30 GMT

గత ప్రభుత్వంలో తాను తప్పు చేశానని, రాజకీయ నిర్ణయాలు అమలు చేసే సమయంలో నైతికతను విస్మరించానని, సీనియర్ అధికారులు ఏబీ వెంకటేశ్వరరావు, ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్ విషయంలో తొందరపడ్డానని పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ రిటైర్డ్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ విడుదల చేసిన వీడియోపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సర్వీసులో ఉండగా, వెనకాముందు ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల తాను విలన్ అయ్యానంటూ ప్రవీణ్ ప్రకాష్ తన వీడియోలో వాపోయారు. దీంతో ప్రవీణ్ ప్రకాష్ వీడియోపై అఖిల భారత సర్వీసు అధికారులతోపాటు రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రూప్-1 అధికారుల్లోనూ పెద్ద చర్చే నడుస్తోంది. గత ప్రభుత్వంలో ఎదురే లేనట్లు.. సూపర్ సీఎంలా ప్రవర్తించిన ప్రవీణ్ ప్రకాష్ కు పట్టిన గతి.. భవిష్యత్తులో తమకు ఎదురు అవ్వదా? అంటూ విపక్షం వైసీపీ ప్రశ్నిస్తోంది. దీంతో రెండు రోజులుగా ఏపీ సచివాలయంలో ‘ప్రవీణ్ ప్రకాష్’ హాట్ టాపిక్ అయ్యారు.

గత ప్రభుత్వంలో తాను పనిచేసిన విధానానికి చింతిస్తున్నట్లు సీనియర్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ చెప్పడంపై అనేక రకాలుగా చర్చ జరుగుతోంది. రిటైర్డ్ ఐఏఎస్ వీడియోలో క్షమాపణలు చెప్పడాన్ని పక్కన పెడితే.. ఆయన ఎక్కడా రూల్స్ కి వ్యతిరేకంగా పనిచేయలేదని, ఈ విషయాన్ని వీడియోలో స్పష్టం చేశారని వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ప్రవీణ్ ప్రకాష్ వీడియోను పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్న టీడీపీ సోషల్ మీడియాకు కొన్ని ప్రశ్నలు సంధిస్తోంది. వైసీపీ హయాంలో రూల్స్ ప్రకారమే ఏబీవీపై చర్యలు తీసుకోవాల్సివచ్చిందని ప్రవీణ్ ప్రకాష్ చెప్పారని, కానీ, తమ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ సీనియర్ అధికారిని సస్పెండ్ చేశారు కానీ, అరెస్టు చేయించలేదని వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో వీడియోలు చేస్తున్నారు.

ఇదే సమయంలో గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వారిని అరెస్టులు చేయిస్తున్నారని సీనియర్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, సంజయ్ ను జైలుకు పంపడాన్ని ప్రస్తావిస్తున్నారు. అదేవిధంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పదుల సంఖ్యలో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వలేదని చెబుతున్నారు. ఇవన్నీ వైసీపీ సీరియస్ గా తీసుకుంటే ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ పట్టిన దుర్గతి మీకు పట్టదా? అంటూ వైసీపీ సోషల్ మీడియా ప్రచారకులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రవీణ్ ప్రకాష్ లు ఎందరవుతారో చూసుకోవాలని, ఇప్పటికైనా జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు.

మొత్తానికి రిటైర్డ్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ విడుదల చేసిన వీడియో చుట్టూ మరోసారి రాజకీయ దుమారం రేగుతోందని అంటున్నారు. అయితే ఆయన కూటమి ప్రభుత్వానికి సరెండర్ అయిపోయారని, ఆయన ద్వారా కూటమి ప్రభుత్వం ఎవరికో స్కెచ్ వేస్తోందన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో సీఎంవోలో అన్నీ తానై వ్యవహరించిన ప్రవీణ్ ప్రకాష్ కు అప్పటి సీఎం జగన్ గుట్లమట్లు అన్నీ తెలుసు అని, ప్రవీణ్ ప్రకాష్ ను లొంగదీసుకుంటే, వైసీపీ అధినేతను టార్గెట్ చేయడం మరింత తేలిక అవుతోందని కూటమి ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఏడేళ్ల సర్వీసు వదులుకున్న ప్రవీణ్ ప్రకాష్.. తన సర్వీసు పునరుద్దరణకు తెగ ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో ప్రభుత్వాన్ని మంచి చేసుకునేలా సంకేతాలిస్తున్నారని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రవీణ్ ప్రకాష్ కు ఏదో గౌరవ ప్రదమైన పోస్టింగు ఇస్తామనే హామీతో ఇలా మాట్లాడిస్తున్నారా? ఆయన ద్వారా ఏదైనా సంచలనానికి ప్లాన్ చేస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News