‘కాక్రోచ్’ కోసం ఢిల్లీకి ప్రకాష్ రాజ్.. వైవిధ్యనటుడి సంచలన పోస్ట్!
సోషల్ మీడియాలో సంచలనం 'కాక్రోచ్ జనతా పార్టీ'కి దేశంలో ప్రముఖుల మద్దతు లభిస్తోంది.
సోషల్ మీడియాలో సంచలనం 'కాక్రోచ్ జనతా పార్టీ'కి దేశంలో ప్రముఖుల మద్దతు లభిస్తోంది. నీట్ పరీక్ష పేపర్ లీక్ తోపాటు విద్యావ్యవస్థలో లోపాలను ఎత్తిచూపుతూ శనివారం ఢిల్లీలో ఆందోళనకు పిలుపునిచ్చిన కాక్రోచ్ పార్టీకి సామాజిక కార్యకర్తలు, ప్రముఖులు బాసటగా నిలుస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వైవిధ్యభరిత నటుడు ప్రకాష్ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాక్రోచ్ పార్టీ పోరాటానికి ఆకర్షితుడైన తాను ఈ నెల 6న ఢిల్లీకి వస్తున్నానంటూ ప్రకటించారు. ఆ రోజు ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం షూటింగులు ఉన్నప్పటికీ వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకాష్ రాజ్ ప్రకటించారు.
కాక్రోచ్ పార్టీకి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకాష్ రాజ్ చేసిన ప్రకటన వైరల్ అవుతోంది. ఇప్పటికే డిజిటల్ స్క్రీన్లపై సంచలనంగా మారిన కాక్రోచ్ పార్టీ తొలిసారిగా రోడ్డెక్కుతుండటం, దానికి ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖులు అండగా నిలవడంతో కాక్రోచ్ పార్టీ పోరాటంపై హాట్ డిబేట్ నడుస్తోంది. పరీక్షల నిర్వహణలో జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న కాక్రోచ్ పార్టీ శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చింది.
ఇక కాక్రోచ్ పార్టీ ఆందోళన కార్యక్రమంపై ప్రముఖ సామాజిక విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ షేర్ చేసిన సందేశాన్ని రీట్వీట్ చేస్తూ ప్రకాష్ రాజ్ కాక్రోచ్ పార్టీకి సంఘీభావం తెలిపారు. యువత నడుపుతున్న ఈ పోరాటంలో భాగం కావడానికి తాను ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ముందుగా నిర్ణయించిన మేరకు సినిమా షూటింగ్ కమిట్‌మెంట్స్ ఉన్నప్పటికీ, ఎలాగైనా జూన్ 6 నాటికి ఢిల్లీ చేరుకోవాలనేదే తన తాపత్రయం అంటూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.
జూన్ 5 లోపు ప్రభుత్వం దీనిపై స్పందించకపోతే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని సోనమ్ వాంగ్‌చుక్ ప్రకటించిన మరుసటి రోజే.. ప్రకాష్ రాజ్ కూడా దీనికి సపోర్ట్ ఇవ్వడం ఈ ఉద్యమానికి మరింత స్టార్ పవర్ చేకూర్చిందని అంటున్నారు. ఇప్పటివరకు కేవలం ఆన్‌లైన్ హంగామా అనుకున్న కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు పక్కా ప్లానింగ్‌తో అడుగులు వేస్తోందని అంటున్నారు. ఇప్పటికే ముగ్గురు అధికారిక ప్రతినిధులను నియమించిన కాక్రోచ్ జనతా పార్టీ.. తమది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని నాన్-పార్టిసన్ గ్రూప్ అంటూ వివరణ ఇచ్చింది. కేవలం విద్యార్థుల భవిష్యత్తు, దేశ విద్యా వ్యవస్థ బాగుపడటం మాత్రమే తమ అజెండా అని చాటిచెప్పింది.