‘అసలే మన పరిస్థితి అంతంతమాత్రం’... ప్రభాస్ నోట వైఎస్ జగన్ డైలాగ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ది రాజా సాబ్. పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోందీ సినిమా.;
గత ఏడాది ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ లో మార్మోగిన డైలాగ్ ఒకటి ఉంది.. అత్యంత హోరాహోరీగా సాగిన ఆ ఎన్నికల్లో వైసీపీ-టీడీపీ, జనసేన, బీజేపీ తలపడ్డాయి. ఫలితం సంగతి వదిలేస్తే... ఆ ఎన్నికలు మాత్రం చరిత్రలో నిలిచిపోయాయి. ఇక ఎన్నికలలో తన పార్టీని వైఎస్సార్‌సీపీ అధినేత, అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్ ఒంటిచేత్తో నడిపించారు. ఒకేసారి అభ్యర్థుల జాబితా ప్రకటించడం నుంచి అటు కూటమి, ఇటు సొంత చెల్లెలు వైఎస్ షర్మిల సారథ్యంలోని కాంగ్రెస్‌ను ఎదుర్కొన్నారు.
ఇక తెలంగాణ తరహాలో కాకుండా ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. నాటి అధికార పార్టీ అయిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను భారీఎత్తున మార్చింది. కొందరిని వేరే జిల్లాల నుంచి తీసుకొచ్చి మరీ మరొక జిల్లాలో పోటీ చేయించారు. రాజకీయాల్లో ఇలాంటి సాహసాలు సహజం. కాగా, వైఎస్సార్‌సీపీ ప్రచారాన్ని మొత్తం భుజాన మోసిన వైఎస్ జగన్ ప్రతి ప్రచార సభలోనూ వారిని ప్రజలకు పరిచయం చేశారు. ఆ సందర్భంగా ‘ఈ అభ్యర్థి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం’ అంటూ చేయి అలాఅలా గాల్లో ఊపుతూ వారికి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఇది నాటి ప్రచారంలో హైలైట్‌గా నిలిచింది. కొందరు ధనవంతులైన అభ్యర్థులనూ ‘ఆర్థికంగా అంతంతమాత్రం’ అంటూ చెప్పడంపై ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలు వచ్చాయి.
అదే మాట ఇప్పుడు డార్లింగ్ నోట...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ది రాజా సాబ్. పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోందీ సినిమా. హారర్ కామెడీగా రూపొందుతున్న ఈ సినిమా డిసెంబరు 5న విడుదల కానుంది. తాజాగా టీజర్‌ను కూడా విడుదల చేశారు. అందులో డార్లింగ్ ప్రభాస్ చెప్పిన ఓ డైలాగ్ బాగా ఆకట్టుకుంటోంది. అదేమంటే ‘అసలే మన పరిస్థితి అంతంతమాత్రం’ అని...! ఇందులో చేయిని అలా అలా ఊపుతూ ప్రభాస్ డైలాగ్ చెప్పిన తీరు వైఎస్ జగన్‌ను ఇమిటేట్ చేసేలా ఉందంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే, డైరెక్టర్‌కు ఆ ఉద్దేశం ఉందో లేదో కానీ.. సోషల్ మీడియా ట్రోలర్లు మాత్రం దేన్నీ వదలరుగా..!