వైసీపీలో పోతిన ఆశలు తీరే సీన్ ఉందా ?
జనసేన నేతగా పోతిన మహేష్ కి ఎంతో పేరుంది. ఆయన ఆ పార్టీ ద్వారానే వెలుగులోకి వచ్చారు.;
జనసేన నేతగా పోతిన మహేష్ కి ఎంతో పేరుంది. ఆయన ఆ పార్టీ ద్వారానే వెలుగులోకి వచ్చారు. ఆయన ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. రాజధాని ప్రాంతంలో బలమైన బీసీ నేతగా పవన్ కళ్యాణ్ ఆయనను గుర్తించి 2019లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఆయన సైతం వైసీపీ వేవ్ లో మంచిగానే ఓట్లు సాధించారు.
అయితే పొత్తులలో భాగంగా 2024లో పోతిన సీటు కాస్తా బీజేపీకి వెళ్ళిపోయింది. దాంతో పోతిన ఆవేశపడి జనసేనకు దూరం అయ్యారు. ఆ సమయంలో ఆయన ఎలాంటి ముందస్తు హామీలు తీసుకోకుండా వైసీపీలో చేరిపోయారు. 2024 ఎన్నికల్లో ఆయన వైసీపీ వేదిక నుంచి జనసేనను టీడీపీని కలిపి విమర్శించారు.
అలా ఆయన ఎంత దూకుడు చేసినా వైసీపీకి ఉన్న యాంటీ ఇంకెంబెన్సీ వెల్లువగా మారి భారీ ఓటమి పాలు అయింది. నిజానికి పోతిన 2024లోనే విజయవాడ పశ్చిమ సీటు మీద దృష్టితోనే వైసీపీలో చేరారు. కానీ వైసీపీ మాత్రం ఆ సీటుని షేక్ అసిఫ్ కి ఇచ్చింది. దానికి అక్కడ పెద్ద ఎత్తున ముస్లిం మైనారిటీలు ఉన్నారన్న కారణంతో.
ఇక 2019లో అక్కడ నుంచి గెలిచి మంత్రి కూడా అయిన వెల్లంపల్లి శ్రీనివాస్ ని తెచ్చి విజయవాడ సెంట్రల్ సీటు కి షిఫ్ట్ చేశారు. ఇలా 2024 లో అంతా గందరగోళంగా సాగింది. ఇపుడు చూస్తే ఎవరి సొంత నియోజకవర్గాలకు వారు వెళ్ళబోతున్నారు. అలా విజయవాడ పశ్చిమ సీటుని మరోసారి వెల్లంపల్లి శ్రీనివాస్ కోరుకుంటున్నారు అని అంటున్నారు.
ఆయన 2009లో ప్రజారాజ్యం తరఫున తొలిసారి గెలిచారు. 2019లో వైసీపీ నుంచి గెలిచారు. 2014లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. అలా విజయవాడ పశ్చిమతో మంచి బంధం ఉన్న వెల్లంపల్లి అదే సీటు తనకు లక్కీ అని భావిస్తున్నారు.
ఇక 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలు అయిన షేక్ అసిఫ్ సైతం మరో చాన్స్ కావాలని కోరుతున్నారు. ఈ ఇద్దరు నేతలు టీడీపీలో ఈ సీటు మీద కన్నేసి ఉండడంతో 2029 ఎన్నికల్లో పోతిన మహేష్ కి విజయవాడ పశ్చిమ సీటు దక్కే సీన్ లేదని అంటున్నారు
దాంతో ఆయన వర్గీయులలో కలవరం రేగుతోంది అని అంటున్నారు. జనసేనలో కనుక పోతిన మహేష్ ఉండి ఉంటే ఈపాటికి ఏ నామినేటెడ్ పదవి అయినా దక్కేదని అంటున్నారు. అంతే కాదు 2029లో సీటు కూడా లభించేది అని అంటున్నారు. మొత్తానికి చివరి నిముషంలో ఆగ్రహం చెంది పదేళ్ళ జనసేనలో రాజకీయ ప్రస్థానాన్ని వదిలేసుకున్న పోతినకు వైసీపీలో ఆశలు తీరేలా కనిపించడంలేదు అని అంటున్నారు. ఆయనని ఇటీవల గుంటూర్ పార్లమెంట్ పరిశీలకునిగా వైసీపీ అధినాయకత్వం నియమించింది. మరి ఆయన టికెట్ విషయం ఏమిటి అంటే చూడాల్సిందే అని అంటున్నారు.