మార్చురీలో డెడ్ బాడీని కుక్క పీక్కుతినటమా రేవంత్?
ఈ ఉదంతం గురించి తెలిసిన తర్వాత జరిగింది నిర్లక్ష్యంతోనో.. అలక్ష్యంతోనో అన్న మాటలు చెప్పి సరిపెట్టుకోవటానికి వీల్లేదు.;
ఈ ఉదంతం గురించి తెలిసిన తర్వాత జరిగింది నిర్లక్ష్యంతోనో.. అలక్ష్యంతోనో అన్న మాటలు చెప్పి సరిపెట్టుకోవటానికి వీల్లేదు. ఇంతకంటే దారుణ ఉదంతం మరొకటి ఉండదు. అరాచకానికి ప్రతిరూపంగా నిలిచే ఈ ఉదంతం గురించి తెలిసినంతనే షాక్ కు గురి కాక మానదు. అసలు ఇలా ఎలా జరుగుతుందన్న ప్రశ్న మదిలో మెదలటం ఖాయం. ప్రమాదవశాత్తు మరణించిన ఒక వ్యక్తిని.. పోస్టుమార్టం కోసం మార్చురీ గదిలో ఉంచితే.. ఒక కుక్క లోపలికి వెళ్లి.. ఒక డెడ్ బాడీని పీక్కుతున్న వైనం.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. పొరపాటుగా జరిగినట్లుగా చెబుతున్నప్పటికి.. ఇందుకు కారణమైన వారిని క్షమించలేని పరిస్థితి. ఇంతకూ అసలేం జరిగిందంటే..
జడ్చర్ల మండలం నాగసాల గ్రామానికి చెందిన 32 ఏళ్ల భీమేశ్వర్ ఇంటి నుంచి బహిర్భూమి కోసం బయటకు వెళ్లాడు. స్వతహాగా లారీ డ్రైవర్ కావటంతో.. మరేం ఫర్లేదు అనుకొని కుటుంబ సభ్యులు భావించారు. రాత్రి వరకు రాలేదు. తెల్లారిని అతడి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవటంతో.. చుట్టుపక్కల వెతికినా.. అతడి ఆచూకీ లభించలేదు. ఇదిలా ఉండగా.. సోమవారం ఉదయం స్థానిక చెరువులో శవంగా తేలాడు. ఎలా చనిపోయాడన్నది ఒక మిస్టరీ కాగా.. పోస్టుమార్టం కోసం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ గదిలోకి తరలించారు.
మార్చురీ వద్ద సరైన భద్రత లేకపోవటంతో కుక్క లోపలకు చొరబడి శవాన్ని పీక్కుతింటూ కనిపించింది దీన్ని వీడియో చేసి.. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో.. ఈ వీడియో కాస్తా వైరల్ గా మారి.. తీవ్ర విమర్శలకు కారణమైంది. పోస్టుమార్టం సిబ్బంది గదిలోకి వెళుతుంటే.. కుక్క కూడా లోపలకు వెళ్లిందని.. అప్పుడే సిబ్బంది దాన్ని తరిమేసినట్లుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ చెబుతున్నప్పటికీ.. సిబ్బందితో పాటు వీధికుక్కలు మార్చురీ గదిలోకి వెళ్లే పరిస్థితి ఉందన్న విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పినట్లైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ముప్ఫై పడకలతో ఉన్న జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకలకు ఆధునీకరించారు. కొత్త ఆసుపత్రిలో మార్చురీని మాత్రం మార్చకుండా.. పాత ఆసుపత్రి భవనంలో కొనసాగిస్తున్నారు. అక్కడ సరైన భద్రతా కారణాలు లేని కారణంగా ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. ఇలాంటి ఘటనలపై కఠినంగా స్పందించాల్సిన అవసరం ఉంది.