తమిళనాడులో మరో దుమారం.. ఉదయనిధి కుమారుడిపై పోస్టర్ల కలకలం!
ఇప్పుడు ముఖ్యమంత్రి స్టాలిన్ మనుమడు, ఉదయనిధి స్టాలిన్ కుమారుడు ఇన్బనిధి చిత్రాలతో వేసిన పోస్టర్లు తమిళనాడులో కలకలానికి దారితీశాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి ఆ వ్యాఖ్యలు దారితీశాయి. ఉదయనిధి స్టాలిన్ పై బీజేపీ అగ్ర నేతలు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్, తదితరులు మండిపడ్డారు.
ఈ వ్యవహారం ఇలా ఉండగా... ఇప్పుడు ముఖ్యమంత్రి స్టాలిన్ మనుమడు, ఉదయనిధి స్టాలిన్ కుమారుడు ఇన్బనిధి చిత్రాలతో వేసిన పోస్టర్లు తమిళనాడులో కలకలానికి దారితీశాయి. వివరాల్లోకి వెళ్తే.. పుదుకోటై ఉత్తర జిల్లా డీఎంకే సాంస్కృతిక విభాగ సహాయ ఆర్గనైజర్ మణిమారన్, జిల్లా మత్స్యకార విభాగ సహాయ ఆర్గనైజర్ తిరుమురుగన్, తదితరులు... డీఎంకే యువజన విభాగ కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ కుమారుడు ఇన్బనిధి చిత్రంతో పుదుకోటై్ట నగరవ్యాప్తంగా పోస్టర్లు అంటించారు.
సెప్టెంబర్ 24న ప్రజలకు ఉదయనిధి స్టాలిన్ కుమారుడు ఇన్బనిధి సంక్షేమ సాయం అందజేయనున్నట్లు పుదుకోట్టై నగరంలో పోస్టర్లు అంటించారు. ఈ పోస్టర్లు అధికార డీఎంకేలో తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో పార్టీ నిబంధనలు అతిక్రమించి, పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించిన మణిమారన్, తిరుమురుగన్ ను డీఎంకే ప్రాథమిక సభ్యత్వం సహా అన్ని బాధ్యతల నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధ్వజమెత్తారు. ఈ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
సనాతన ధర్మంపై కాంగ్రెస్ ఉద్దేశం ఏమిటో సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గే ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఈ అంశంపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. సనాతన ధర్మాన్ని అవమానించినందుకు ప్రతిపక్షాల కూటమి... ఇండియాలో సభ్యులు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. లేకపోతే దేశం వారిని క్షమించదన్నారు. సనాతన ధర్మం ఈ ప్రపంచాన్ని ఒక కుటుంబంగా భావిస్తోందని గుర్తు చేశారు.. వసుధైక కుటుంబం అనే సందేశాన్ని ఇస్తోందని రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు.
కాగా ప్రతి రాజకీయపార్టీకి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. అన్ని మతాలను, ప్రజల నమ్మకాలను గౌరవించడమే కాంగ్రెస్ విధానం అని తేల్చిచెప్పారు.
ఉదయనిధి స్టాలిన్ మాటలు ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావొచ్చని.. తాను మాత్రం ఆయన చెప్పిన మాటలతో ఏకీభవించను అని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తెలిపారు. శివసేన (ఉద్ధవ్ వర్గం) ఎంపీ ప్రియాంక చతుర్వేది.. ఉదయనిధి స్టాలిన్ కు మద్దతుగా స్పందించారు.
మరోవైపు ఉదయనిధి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని.. తనపై ఎలాంటి కేసులు వేసినా ఎదుర్కొంటానని తేల్చిచెప్పారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనాలతో పోల్చుతూ.. దాన్ని నిర్మూలించిన ఉదయనిధి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.