పోప్ ఫ్రాన్సిస్ చివరి కోరిక ఇదే.. ఆయన డెత్ రిపోర్టులో ఏముందంటే ?
ప్రపంచ వ్యాప్తంగా 1.4బిలియన్ల కాథలిక్ క్రైస్తవులకు మత గురువు, పోప్ ఫ్రాన్సిస్(88) సోమవారం కన్నుమూశారు.;
ప్రపంచ వ్యాప్తంగా 1.4బిలియన్ల కాథలిక్ క్రైస్తవులకు మత గురువు, పోప్ ఫ్రాన్సిస్(88) సోమవారం కన్నుమూశారు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నిన్న గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. పోప్ మరణానికి సంబంధించి వాటికన్ డాక్టర్ ఆండ్రియా విడుదల చేసిన డెత్ రిపోర్టులో ఆయన గుండెపోటుతో మరణించారని.. మరణానికి ముందుకు ఆయన కోమాలోకి వెళ్లినట్లు తెలిపారు. పోప్ మరణంతో ప్రపంచవ్యాప్తంగా కాథలిక్ క్రైస్తవులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
పోప్ ఫ్రాన్సిస్ శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యుమోనియా, కిడ్నీ ప్రాబ్లమ్స్ తో చాలా కాలాంగా బాధపడుతున్నారు. ఫిబ్రవరి 14 నుంచి 38 రోజుల పాటు ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఆయన మార్చిలో డిశ్చార్జ్ అయ్యారు. 2013లో 16వ పోప్ బెనెడిక్ట్ తర్వాత ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. అనారోగ్యం కారణంగా ఆదివారం జరిగిన ఈస్టర్ వేడుకల్లో కూడా ఆయన పాల్గొనలేకపోయారు. ఈస్టర్ మరుసటి రోజే ఆయన కన్నుమూయడం విషాదకరం.
పాపల్ పరివర్తనను నియంత్రించే యూనివర్సి డొమినిసి గ్రెగిస్ రాజ్యంగం ప్రకారం పోప్ మరణించిన వారంలోపే ఆయన అంత్యక్రియలు జరగాలి. పోప్ ఫ్రాన్సిస్ తన అంత్యక్రియలను ఎలాంటి ఆడంబరం లేకుండా నిర్వహించాలని తనను మట్టిలోనే పూడ్చాలని, ఇన్ స్క్రిప్షన్ పై తన పేరును లాటిన్ భాషలో రాయాలని ముందుగానే చెప్పారు. పోప్ మరణించిన తర్వాత తొమ్మిది రోజుల సంతాప దినాలు నిర్వహిస్తారు.
పోప్ మరణించిన 15 నుండి 20 రోజుల్లోనే తదుపరి పోప్ ఎన్నుకునేందుకు పాపల్ సమావేశం ప్రారంభమవుతుంది. 80 ఏళ్లలోపు కార్డినల్స్ దీనికోసం వాటికన్‌లో సమావేశం అవుతారు. పోప్ ఎన్నిక అంతా రహస్యంగా జరుగుతుంది. సిస్టీన్ చాపెల్ లోపల మీటింగ్‌లో ఉన్నవారు బయట వ్యక్తులతో సంబంధం లేకుండా ఉంటారు. పోప్ అభ్యర్థికి మూడింట రెండు వంతుల మెజారిటీ ఓట్లు వచ్చే వరకు వారు ఓటు వేస్తారు. కొత్త పోప్ ఎన్నికైన తర్వాత ఆయన తన పాత్రను అంగీకరిస్తున్నారా అని అధికారికంగా అడుగుతారు. ఆయన అంగీకరిస్తే, ఆయన ఒక పాపల్ పేరును ఎంచుకుంటారు. సీనియర్ కార్డినల్ డీకన్ సెయింట్ పీటర్స్ బసిలికా బాల్కనీలో నిలబడి లాటిన్ లో హేబెమస్ పాపం అంటే మనకు పోప్ ఉన్నాడని ప్రకటిస్తారు.