దారితప్పుతున్న నేతల పిల్లలు.. రీజనేంటి?
ఏపీలో ఓ మంత్రి కుమారుడు.. కూడా వేధింపుల కేసును ఎదుర్కొంటున్నాడు. ఇలా.. నాయకుల పిల్లలు దారి తప్పుతున్నారు.
రాజకీయ నేతల పిల్లలు.. ఇటీవల కాలంలో దారి తప్పుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఆయా సంఘటనలు జరిగినప్పుడు.. తమ వారి పాత్రలేదని చెబుతున్నా.. నేరాల విచారణలో ఆయా పిల్లల పాత్ర ఉందని పోలీసులు చెబుతున్నారు. దీంతో మేనేజ్ పాలిటిక్స్ పెరుగుతున్నాయి. ఒక నేత కుమారుడు హిట్ అండ్ రన్ కేసులో చిక్కుకుని విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. ఇటీ వలే తెలంగాణ పోలీసులు సదరు నేత కుమారుడిని అరెస్టు చేశారు.
ఇక, టీడీపీకి చెందిన ఓ కీలక నేత కుమారుడు, ప్రజాప్రతినిధి కూడా అయిన.. నాయకుడు.. డ్రగ్స్ కేసులో చిక్కుకున్నారు. తాజాగా కేంద్ర సహాయ మంత్రి కుమారుడిపై పోక్సో కేసు నమోదైంది. ఇవొక్కటే కాదు.. ఏపీలోను.. తెలంగాణలోనూ.. పలువురు మంత్రుల పిల్లలు కేసుల్లో చిక్కుకున్నారు. తెలంగాణకు చెందిన మహిళా మంత్రి కుమార్తె పోలీసులపై నోరు చేసుకోవడం.. కొన్నాళ్ల కిందట కలకలం రేపింది. దీంతో సీఎం స్వయంగా జోక్యం చేసుకుని సరిదిద్దారు.
ఏపీలో ఓ మంత్రి కుమారుడు.. కూడా వేధింపుల కేసును ఎదుర్కొంటున్నాడు. ఇలా.. నాయకుల పిల్లలు దారి తప్పుతున్నారు. దీనిని రాజకీయం అనే ముడి వేసి.. తమ పిల్లలను అభాసుపాల్చేస్తున్నారని.. నాయకులు ఆరోపిస్తున్నారు.కానీ, వాస్తవాలు ఏంటనేది నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో పిల్లలు దారి తప్పకుండా చూసుకునే బాధ్యత నాయకులదేనని విశ్లేషకులు చెబుతున్నారు. అధికారంలో ఉన్న నాయకుల పిల్లలకు విచ్చలవిడి స్వేచ్ఛను ఇవ్వడమే ప్రధాన కారణంగా కనిపిస్తోందని అంటున్నారు.
గతంలో ముఖ్యమంత్రులు, మంత్రులుగా ఉన్నవారు.. తమ కుటుంబాలను దూరం పెట్టేవారు. కానీ.. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంటే.. ఎమ్మెల్యేలు తమ పిల్లలను తీసుకువస్తున్నారు. మంత్రులు తమ స్థానంలో పిల్లలను పంపిస్తున్నారు. ఇవన్నీ.. పిల్లలకు లేని అధికారాన్ని కట్టబెట్టినట్టు అవుతోంది. తాము ఏం చేసినా.. మేనేజ్ చేసేందుకు వెనుక తమ వారున్నారన్న బలమైన నిశ్చితాభిప్రాయానికి వస్తున్నారు. దీంతోనే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి చర్యలను కట్టడిచేయకుండా.. ప్రత్యర్థులు తమపై రాజకీయ కుట్రలు చేశారంటూ.. ఎదురు దాడి చేయడం వల్ల నాయకులకు ఒరిగేది ఏమీ ఉండదని అంటున్నారు పరిశీలకులు.