ఢిల్లీలో సంచలనం.. విపక్ష ఎంపీలపై లాఠీ చార్జీకి యత్నం!?
దేశ రాజధాని ఢిల్లీలో కనీ వినీ ఎరుగని సంచలనం చోటు చేసుకుంది. ఏకంగా ఎంపీలపైనే పోలీసులు లాఠీలు ఝళిపించేందుకు సిద్ధపడడం.. తీవ్ర వివాదంగా మారింది.;
దేశ రాజధాని ఢిల్లీలో కనీ వినీ ఎరుగని సంచలనం చోటు చేసుకుంది. ఏకంగా ఎంపీలపైనే పోలీసులు లాఠీలు ఝళిపించేందుకు సిద్ధపడడం.. తీవ్ర వివాదంగా మారింది. అయితే.. ఉన్నతస్థాయి అధికారుల ఆదేశాలతోనే తాము లాఠీలను ఎత్తాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఎవరిపైనా లాఠీలతో దాడి చేయకపోయినా.. ప్రజాప్రతినిధులను లాఠీలతో చెదరగొట్టే ప్రయత్నం చేయడం.. వారిని బెదిరించే ప్రయత్నం చేయడం మాత్రం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఏం జరిగింది?
కేంద్ర ఎన్నికల సంఘానికి, కాంగ్రెస్‌కు మధ్య ఓటర్ల జాబితా, నకిలీ ఓటర్ల తొలగింపు, సీసీ టీవీ ఫుటేజీ ఇవ్వకపోవడం, ఒకే వ్యక్తి పలు రాష్ట్రాల్లో ఓట్లు వేయడం.. ఇలా.. అనేక అంశాలపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘంపై పలు ఆరోపణలు చేశారు. ఇదేసమయంలో ఎన్నికల సంఘం జాబితాలను కూడా ఆయన ప్రదర్శించారు. వీటిలో లోపాలను ఎండగట్టారు. వీటికి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పట్టు బడుతోంది.
అయితే.. రాహుల్ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలంటూ.. కర్ణాటక ఎన్నికల సంఘం ప్రధానాధి కారి నోటీసులు జారీ చేశారు. దీంతో వివాదం మరింత ముదిరింది. తాజాగా పార్లమెంటు నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వరకు ఇండియా కూటమి ఎంపీలు.. సుమారు 302 మంది రాహుల్‌గాంధీ నేతృత్వంలో పాదయాత్ర చేపట్టారు. అయితే.. దీనికి అనుమతి లేదని.. ఆది నుంచి ఢిల్లీ పోలీసులు.. చెప్పుకొచ్చారు. అంతేకాదు.. పార్లమెంటు నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ఉన్న దారిలో (సుమారు కిలో మీటరున్నర) భారీ ఎత్తున బారికేడ్లు పెట్టారు. ముళ్ల కంచెలు కూడా వేశారు.
అయితే.. విపక్ష ఎంపీలు వీటిని సైతం దాటుకుని ఎన్నికల సంఘం కార్యాలయానికి పరుగులు పెట్టారు. ఈ క్రమంలో నలుగురు కానిస్టేబుళ్లు.. ఎంపీలపై లాఠీలతో విరుచుకుపడేందుకు పరుగులు పెట్టారు. అయితే.. ఎక్కడా కొట్టకపోయినా.. ఈ వ్యవహారం జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున హైలెట్ అయింది. ఈ పరిణామాలపై విపక్షం మరింత మండిపడింది. ఏకంగా ఎంపీలపైనే లాఠీ చార్జీకి ప్రయత్నిస్తారా? అంటూ.. నిప్పులు చెరిగింది. అయితే.. సదరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తున్నట్టు ఢిల్లీ డీజీపీ ప్రకటించారు.