రగులుతున్న పీఓకే.. హింసకు అసలు కారణం అదే..

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో ఇటీవల కాలంలో నిరసనలు, హింసాత్మక ఘటనలు నిత్యకృత్యంగా మారాయి.

Update: 2026-06-10 07:43 GMT

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో ఇటీవల కాలంలో నిరసనలు, హింసాత్మక ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. పైకి ఇవి కేవలం ధరల పెరుగుదల, సబ్సిడీల రద్దుపై జరుగుతున్న పోరాటాల్లా కనిపిస్తున్నప్పటికీ వీటి వెనుక దశాబ్దాలుగా పేరుకుపోయిన రాజకీయ అసంతృప్తి.. శతాబ్దాల నాటి వివక్షా పూరిత ఎన్నికల వ్యవస్థే ప్రధాన కారణమని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. ముఖ్యంగా పీఓకే అసెంబ్లీ ఎన్నికల విధానంపై స్థానిక ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతను ‘జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ’ నేతృత్వంలో ప్రజలు పెద్ద ఎత్తున నిలదీస్తున్నారు.

వివాదానికి కేంద్రబిందువు.. ఆ 12 రిజర్వ్ స్థానాలు

పీఓకే అసెంబ్లీలో మొత్తం 45 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి. అయితే ఇందులో ఒక విచిత్రమైన, వివాదాస్పదమైన నిబంధన ఉంది. మొత్తం స్థానాల్లో 12 సీట్లను 1947 దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడే స్థిరపడిన కశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించారు. ప్రస్తుతం ఈ శరణార్థులు పీఓకేలో కాకుండా పాకిస్థాన్‌లోని కరాచీ, ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్ వంటి ప్రధాన నగరాల్లో నివసిస్తున్నారు. వారు తాము నివసిస్తున్న నగరాల నుంచే ఓటు హక్కును వినియోగించుకుంటూ పీఓకే అసెంబ్లీకి ప్రతినిధులను ఎన్నుకుంటున్నారు. ఇదే ఇప్పుడు స్థానిక ప్రజల ఆగ్రహానికి కారణమైంది.

స్థానిక ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న బాహ్య శక్తులు

స్థానికంగా నివసించని, ఇక్కడి కష్టనష్టాలతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు తమ రాజకీయ భవిష్యత్తును, ప్రభుత్వాలను ఎలా నిర్ణయిస్తారని పీఓకే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జాక్ ఆరోపణల ప్రకారం ఈ 12 స్థానాల ఆధారంగా పాకిస్థాన్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు పీఓకే రాజకీయాలను శాసిస్తున్నాయి. ఇస్లామాబాద్‌లోని పాలకులు తమకు నచ్చిన వారిని గెలిపించుకోవడానికి ఈ శరణార్థుల ఓట్లను ఒక సాధనంగా వాడుకుంటున్నారు. దీనివల్ల స్థానికుల మద్దతు లేకపోయినా పాక్ పాలకుల దయాదాక్షిణ్యాలతో ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. స్థానిక ప్రజల ఆకాంక్షలకు విలువే లేకుండా పోతోందని ఇక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థ కేవలం ఒక ప్రహసనంగా మారిందని పౌర సమాజం ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జాక్)

ఈ వివక్షకు వ్యతిరేకంగా జాక్ స్పష్టమైన డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. శరణార్థుల పేరిట ఉన్న ఆ 12 రిజర్వ్డ్ సీట్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. పీఓకే లో నివసించే మూలవాసులకు మాత్రమే తమ ప్రతినిధులను ఎన్నుకునే సంపూర్ణ హక్కు ఉండాలని స్పష్టం చేసింది. ఈ డిమాండ్‌కు స్థానిక యువత, విద్యార్థి సంఘాలు, పౌర సమాజం నుండి అపూర్వ మద్దతు లభిస్తోంది. "మా ప్రాంతంలో ఉండని వారు.. మా కష్టాలు తెలియని వారు మా పాలకులను ఎలా నిర్ణయిస్తారు? మా హక్కులను పాక్ పాలకులకు తాకట్టు పెట్టనివ్వం." అని నిరసనకారుల ప్రధాన నినాదంగా కనిపిస్తోంది.

తీవ్రమౌతున్న రాజకీయ సంక్షోభం

ఇటీవల జరిగిన నిరసనల్లో వేలాది మంది రోడ్లపైకి రావడం, ప్రభుత్వం పోలీసు బలగాలతో అణచివేయాలని చూడడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. కేవలం ఆర్థిక సమస్యలే కాకుండా.. రాజకీయ హక్కులు, ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం, స్థానిక స్వయం ప్రతిపత్తి వంటి అంశాలే ఈ ఉద్యమానికి అసలైన ఇంధనంగా మారాయి.

పాకిస్థాన్ ప్రభుత్వం ఈ 12 రిజర్వ్ సీట్ల అంశంపై స్థానికుల రాజకీయ హక్కులపై త్వరితగతిన సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పీఓకే లో రాజకీయ సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చి అది పాక్ పాలకుల చేతులు దాటిపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News