ఒకప్పడు వేల కోట్ల స్కామ్ జరిగిన చోటు... నేడు ఆహ్లాదకరమైన కాఫీ కేఫ్!

దక్షిణ ముంబైలోని ఫోర్ట్ ప్రాంతంలో ఉన్న బ్రాడీ హౌస్ బిల్డింగ్ ఒకప్పుడు దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణాలలో ఒకదానికి కేంద్రంగా ఉండేది.;

Update: 2025-04-28 00:30 GMT

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)... ఈ పేరు వింటేనే వేల కోట్ల రూపాయల నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ కుంభకోణం గుర్తుకు వస్తుంది. ముంబైలోని బ్రాడీ హౌస్ బ్రాంచ్ ఈ మోసానికి కేంద్ర బిందువుగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ ప్రదేశం పూర్తిగా మారిపోయింది. ఎలా అంటే నమ్మశక్యం కాని విధంగా ఈ బ్యాంక్ బ్రాంచ్‌ను ఇప్పుడు ఒక అందమైన కాఫీ షాప్‌గా మార్చేశారు. సందర్శకుడు ఇప్పుడు హాయిగా ఇక్కడ కుర్చీల్లో కూర్చుని, మెల్లగా వినిపిస్తున్న సంగీతాన్ని ఆస్వాదిస్తూ రుచికరమైన ఆర్గానిక్ కాఫీని తాగుతున్నారు. ఒకప్పుడు అక్కడ నెలకొన్న గందరగోళానికి ఇది పూర్తి విరుద్ధమని చెప్పొచ్చు.

దక్షిణ ముంబైలోని ఫోర్ట్ ప్రాంతంలో ఉన్న బ్రాడీ హౌస్ బిల్డింగ్ ఒకప్పుడు దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణాలలో ఒకదానికి కేంద్రంగా ఉండేది. నీరవ్ మోదీ, అతని మేనమామ మెహుల్ చోక్సీ 2011 మార్చి నుంచి 2017 నవంబర్ మధ్య బ్రాడీ హౌస్ బ్రాంచ్ అధికారులకు లంచాలు ఇచ్చి లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (LoUలు), ఫారిన్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (FLCలు) ఉపయోగించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి సుమారు 13,000 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును కాజేశారు.

ఈ కుంభకోణం 2018 జనవరిలో వెలుగులోకి వచ్చింది. పీఎన్బీ భారతీయ రిజర్వ్ బ్యాంక్‌కు మోసం గురించి నివేదిక సమర్పించి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)లో ఫిర్యాదు చేసింది. అప్పటికే చోక్సీ, మోదీ దేశం విడిచి పారిపోయారు. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఈ కుంభకోణంపై దర్యాప్తు చేశాయి.

2019 మార్చిలో సీబీఐ, ఈడీ మోదీపై చేసిన ఆరోపణల ఆధారంగా జారీ చేసిన ఎక్స్‌ట్రాడిషన్ వారెంట్‌పై లండన్‌లో అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి వారు జైలులోనే ఉన్నారు. బెల్జియం ఫెడరల్ పోలీస్ సర్వీస్ భారతీయ ఏజెన్సీల అభ్యర్థన మేరకు ఏప్రిల్ 12న చోక్సీని అరెస్ట్ చేసింది. అయితే, పీఎన్ బీ కుంభకోణానికి సంబంధించిన అనేక పరిణామాలు జరుగుతున్నప్పటికీ, బ్రాడీ హౌస్‌పై వాటి ప్రభావం కనిపించడం లేదు. దానిని ఇప్పుడు ఒక విలాసవంతమైన కేఫ్‌గా మార్చేశారు. ఒకప్పుడు ఆర్థిక నేరాలకు సాక్షిగా నిలిచిన ఈ ప్రదేశం ఇప్పుడు ప్రశాంతమైన కాఫీ షాప్‌గా రూపాంతరం చెందడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.

Tags:    

Similar News