శ్రీశైలం పర్యటన: ప్రధాని వెంటే బాబు-పవన్.. చిత్రం ఏంటంటే!
ప్రధాని నరేంద్ర మోడీ శ్రీశైలంలో పర్యటించారు. అయితే.. ఆయన వెంట ఆద్యంతం సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు ఉన్నారు.;
ప్రధాని నరేంద్ర మోడీ శ్రీశైలంలో పర్యటించారు. అయితే.. ఆయన వెంట ఆద్యంతం సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు ఉన్నారు. తొలుత కర్నూలు నుంచి హెలికాప్టర్‌లో భ్రమరాంబ గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. అక్కడ నుంచి బయలుదేరి నంది మండపం సర్కిల్ ద్వారా దేవాలయ ప్రాంగణంలోని గంగాధర మండపం వైపు పయనమయ్యారు. నంది మండపం సర్కిల్ నుండి గంగాధర మండపం వరకు మార్గమంతా దాదాపు 8,000 మంది శివసేవకులు కాషాయ వస్త్రధారణలో నిలబడి హర హర మహాదేవ అంటూ ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు.
దేవస్థానం ప్రధాన ద్వారం వద్ద వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి విభూతి, కుంకుమ ధరింపజేసి ప్రదక్షిణాకార మార్గంలో ఆలయ అంతర్భాగానికి ఆహ్వానించారు. అనంతరం మొదట ధ్వజస్తంభ నమస్కారం, శివ సంకల్పం, అనంతరం రత్నగర్భ గణపతి పూజ నిర్వహించారు. తరువాత మూలవిరాట్ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగానికి ఏకవార రుద్రాభిషేకం, బిల్వార్చన, పుష్పార్చన, మహా మంగళ హారతి, మంత్రపుష్పాలతో భక్తిశ్రద్ధలతో దర్శనం చేశారు.
అనంతరం సరస్వతి నది అంతర్వాహినిగా ప్రసిద్ధి చెందిన మల్లికాగుండం వద్ద స్వామివారి గర్భాలయ శిఖర దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి భ్రమరాంబ అమ్మవారి ముఖ మండపంలో ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీ చక్రానికి ఖడ్గమాలతో కుంకుమార్చన నిర్వహించి, షోడశోపచార పూజలు భక్తిశ్రద్ధలతో ఆచరించారు. అనంతరం అమ్మవారి హారతి స్వీకరించారు. తరువాత వేదాశీర్వచన మండపంలో వేద పండితులు చతుర్వేద ఆశీర్వచనం చేసి, అమ్మవారి తీర్థప్రసాదాలను ప్రధానమంత్రికి సమర్పించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రికి స్వామి, అమ్మవార్ల చిత్రపటాలు, శేష వస్త్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపరాష్ట్రపతి పవన్ కళ్యాణ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్తిగా ప్రధాని వెంటే ఉన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు పూజల్లో పాల్గొనకుండా.. ఆయనను అనుసరించడం విశేషం. కాగా.. ఈ పర్యటనలో బీజేపీ నాయకులు ఎవరూ లేకపోవడం గమనార్హం.