'విమానంలో ఎక్కడ కుర్చుంటే సేఫ్'... తెరపైకి ఆసక్తికర అధ్యయనం!
విమానంలో ఎక్కడ కుర్చుంటే సేఫ్ అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా 2012లో మెక్సికన్ శాస్త్రవేత్తలు జరిపిన పరీక్షలకు సంబంధించిన వీడియో ఒకటి తెరపైకి వచ్చింది!;
ఇటీవల కాలంలో అగ్రరాజ్యం మొదలు దాదాపు అన్ని దేశాల్లోనూ చిన్నవో, పెద్దవో వరుస విమాన ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే! ఇక తాజాగా అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం ప్రమాదం ఒక్కసారిగా అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మందితో మరణించారు.
అయితే ఈ ప్రమాదంలో ఏ11 సీట్ లో కూర్చున్న వ్యక్తి స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు స్పందిస్తూ... విమానం ముక్కలవ్వడంతో తన సీటు ఎగిరి బయటపడిందని.. తాను బ్రతికి బయటపడ్డానని తెలిపారు! ఈ నేపథ్యంలో విమానంలో ఎక్కడ కుర్చుంటే బెటర్ అనే చర్చ తెరపైకి వచ్చింది.
అవును... విమానంలో ఎక్కడ కుర్చుంటే సేఫ్ అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా 2012లో మెక్సికన్ శాస్త్రవేత్తలు జరిపిన పరీక్షలకు సంబంధించిన వీడియో ఒకటి తెరపైకి వచ్చింది! ఈ పరీక్షల కోసం మెక్సికన్ ఎడారిలో ఉద్దేశ్యపూర్వకంగా బోయింగ్ 727 విమానాన్ని క్రాష్ చేశారు. సీట్లలో డమ్మీలు ఉంచి, రిమోట్ పైలెట్ ద్వారా భూమిని వేగంగా ఢీకొట్టేలా చేశారు.
ఈ పరీక్షల ఫలితంగా.. విమాన ప్రమాదంలో ముందుభాగం తీవ్రంగా ధ్వంసం కాగా.. మధ్య భాగంలో కూర్చున్న వారికి తీవ్ర గాయాలయ్యాయని.. వెనుక భాగంలో కూర్చున్న వారు వీలైనంత వరకూ సేఫ్ గా బయటపడే అవకాశం ఉందని గుర్తించినట్లు తెలిపారు!
ఈ సందర్భంగా స్పందించిన ఎంఐటీ ఏరోనాటిక్స్ & అస్ట్రోనాటిక్స్ ప్రొఫెసర్ జాన్ హోన్స్ మన్... ప్రతీ విమానం క్రాష్ భిన్నంగా ఉంటుందని, అత్యవసర సమయంలో ప్రతీ సీటు వద్ద ప్రమాదం ఉందని అన్నారు! కాకపోతే.. కొన్ని సార్లు విమానం వెనుక భాగంలో ఉండే సీట్లు సాధారణంగా అత్యంత సురక్షితమైనవిగా ఉంటాయని అన్నారు.
ఇదే సమయంలో అమెరికాకు చెందిన ఏవియేషన్ డిజాస్టర్ లా నివేదిక ప్రకారం.. పాపులర్ మెకానిక్స్ మ్యాగజైన్ 1971 - 2005 మధ్య జరిగిన విమాన ప్రమాదాలపై ఓ అధ్యయనం నిర్వహించింది. దీని ప్రకారం.. విమానంలో వెనుక భాగంలో కూర్చున్న సీట్లు ఉన్నంతలో సురక్షితమైనవని ఆ అధ్యయనం వెల్లడించింది.
విమానంలోని ఇతర విభాగాల్లో కూర్చున్న వారితో పోలిస్తే.. వెనుక భాగంలో కూర్చున్న వారు 40% ఎక్కువగ మనుగడకు అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని సందర్భాల్లో విమానం ముందు భాగం షాక్ అబ్జర్వర్ గా పనిచేస్తుందని అధ్యయనం వెల్లడించింది.