ఆ ఫ్లైఓవర్‌కు పీజేఆర్ పేరు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఫాయిదానేనా?
తాజాగా కొండాపూర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు నిర్మించిన పి.జనార్థన్‌రెడ్డి (పీజేఆర్) ఫ్లైఓవర్‌ను తెలంగాణ సీఎం రేవంత్ ప్రారంభించారు.;
తెలంగాణ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగర రాజకీయాల్లో దివంగత పి.జనార్దనరెడ్డి పేరు విడదీయలేనిది. ఒకప్పటి ఖైరతాబాద్ నియోజకవర్గానికి తిరుగులేని నాయకుడు అయిన పీజేఆర్.. పేదల నాయకుడిగా పేరుగాంచారు. ఎంతటి చిన్న షాప్ అయినా ప్రారంభానికి పిలిస్తే వెళ్లేవారు. ఆ దుకాణాల యజమానులు కూడా అంతే ప్రేమగా పీజేఆర్ ఫొటోను పెట్టుకునేవారు. పీజేఆర్‌తోనే అతిపెద్ద ఖైరతాబాద్ నియోజకవర్గం పేరు మార్మోగేది.
విచిత్రం ఏమంటే.. పీజేఆర్ 2007 డిసెంబరులో చనిపోగా 2009 ఎన్నికల నాటికి పునర్విభజనలో ఈ నియోజకవర్గం పలు నియోజకవర్గాలుగా విడిపోయింది. అలా ఖైరతాబాద్ నుంచి ఏర్పడినదే జూబ్లీహిల్స్. ఇప్పుడంటే శేరిలింగంపల్లిని అతిపెద్ద నియోజకవర్గంగా చెబుతున్నారు కానీ.. 2009కి ముందు ఇదంతా ఖైరతాబాద్ పరిధిలోదే. పీజేఆర్ గనుక జీవించి ఉంటే.. 2014లోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేదనేది చాలామంది చెప్పే మాట.
ఇక ఖైరతాబాద్ నుంచి 2008 ఉప ఎన్నికలో గెలిచారు పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి. 2009లో ఆయన జూబ్లీహిల్స్‌కు మారి విజయం సాధించారు. కానీ, 2014, 2018లో టీడీపీ, బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. 2023లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో బీఆర్‌ఎస్‌లో చేరారు. తాజాగా గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్‌ఎస్ టికెట్ విష్ణుకే వస్తుందా? అనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ఉంచి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి బరిలో దిగుతారా? అని ప్రశ్నలు వస్తున్నాయి. అటు పీజేఆర్ వారసత్వం, ఇటు బీఆర్‌ఎస్ సిటింగ్ సీటును గెలిచేది ఎవరో? అనేది చూడాలి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్‌లో పీజేఆర్ పేరు మరోసారి ప్రస్తావనకు వస్తోంది. తాజాగా కొండాపూర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు నిర్మించిన పి.జనార్థన్‌రెడ్డి (పీజేఆర్) ఫ్లైఓవర్‌ను తెలంగాణ సీఎం రేవంత్ ప్రారంభించారు. ఇది 6 వరుసలు, 24 మీటర్ల వెడల్పుతో 1.2 కి.మీ మేర నిర్మితమైంది. ఐటీ హబ్ గచ్చిబౌలి కూడలి వద్ద ట్రాఫిక్ రద్దీ నివారించనుంది. ఔటర్ నుంచి కొండాపూర్, హఫీజ్‌పేట్ మార్గాల్లో వెళ్లేవారి చాలా అనుకూలం.
కాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముంగిట పీజేఆర్ పేరిట నిర్మించిన ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం కొంత ఫాయిదా పొందే చాన్సుంది. జూబ్లీహిల్స్ బస్తీల్లో ఇప్పటికీ పీజేఆర్ దేవుడు. అందుకే ఫ్లై ఓవర్ ప్రారంభంలో ఆయనను రేవంత్ పొగిడారు. పీజేఆర్ పోరాటాల వల్లే హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి జలాలు వచ్చాయన్నారు. పిలిస్తే పలికే పేదల నాయకుడిగా ఎంతో గొప్ప పేరు సంపాదించారని.. దోమల్‌గూడలోని పీజేఆర్ ఇల్లు జనతా గ్యారేజీ అని కొనియాడాడరు. పీజేఆర్ కృషితోనే హైటెక్ సిటీ గచ్చిబౌలికి మంజూరైందని కూడా పేర్కొన్నారు.