పిఠాపురం వర్మ... వర్కౌట్ కావడం లేదుగా ?
ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నది 2024 ముందు వరకూ ఆయనకు ఉన్న పేరు. పైగా ఆయన ఒక నియోజకవర్గం నాయకుడిగానే అప్పటి దాకా ఉన్నారు.;
ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నది 2024 ముందు వరకూ ఆయనకు ఉన్న పేరు. పైగా ఆయన ఒక నియోజకవర్గం నాయకుడిగానే అప్పటి దాకా ఉన్నారు. కానీ 2024లో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడం, ఆయనకు కూటమి పొత్తులో భాగంగా సీటు ఇవ్వడంతో వర్మ అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో అది స్టేట్ వైడ్ టాపిక్ గా మారింది. దాంతో ఒక్కసారిగా వర్మ రాష్ట్ర స్థాయి నేతగా ఫోకస్ అయ్యారు. అలా ఆయన పేరుకు ముందు పిఠాపురం ఫిక్స్ అయిపోయింది. పేరులో ఊరు చేరింది. ఫోకస్ సైతం మారింది కానీ అధికార హోదాతో కూడిన పదవి అయితే ఈ రోజుకీ దక్కలేదు అన్నదే వర్మ అండ్ కో అసలైన ఆవేదనగా ఉంది.
క్యాలెండర్లు తిరుగుతున్నా :
కాలాలు అన్నీ మారుతున్నాయి. క్యాలండర్ లో రోజులు కూడా గడచిపోతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతోంది. అయినా పిఠాపురం వర్మకు పదవి మాత్రం దక్కలేదు. దాంతో ఆయన సైతం నిరాశలో ఉన్నారని అంటున్నారు. ఆయనకు పదకొండేళ్ళ క్రితం దక్కిన ఎమ్మెల్యే పదవి తప్ప మళ్ళీ అధికార కళ చూడలేదు. తన నియోజకవర్గంలో మకుటం లేని మహరాజుగా ఆయన ఉన్నారు. ఆయన సామాజిక వర్గం సంఖ్య తక్కువగా ఉన్నా కూడా జన బాహుళ్యంలోకి నిత్యం వెళ్తూ వర్మ తమ పలుకుబడిని పరపతిని బాగా పెంచుకున్నారు. 2019 ఎన్నికల్లో సైతం వైసీపీ ప్రభంజనం లో గట్టి పోటీ ఇచ్చారు. ఇక 2024 లో గెలుపు ఖాయం, దాంతో పాటు మా రాజు గారు మంత్రి కూడా అవుతారు అనుకుంటే నియోజకవర్గంలోకి పవన్ ఎంట్రీ ఇచ్చి ఏకంగా ఉప ముఖ్యమంత్రి అయిపోయారు. వర్మ మాత్రం మాజీ ఎమ్మెల్యే ట్యాగ్ తో అన్నీ చూస్తూ ఉండిపోతున్నారు అన్నదే అభిమానుల అనుచరుల మాటగా ఉందిట.
ఆ హామీ నెరవేర్చాలని :
ఇక పొత్తులో భాగంగా టీడీపీ సీటుని జనసేనకు ఇచ్చినపుడు వర్మకు ఆ పార్టీ అధినాయకత్వం ఒక కీలక హామీని ఇచ్చిందని అప్పట్లోనే ప్రచారం సాగింది. ఎమ్మెల్సీగా ఫస్ట్ నామినేట్ అయ్యేది వర్మ అని కూడా చెప్పారట. కానీ ఇప్పటికి అనేక మంది శాశమమండలిలో ప్రవేశించారు. అంతవరకూ ఎందుకు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా ఎమ్మెల్సీ అయ్యారు. దాంతో వర్మ అనుచరులకు మరింత ఇబ్బందిగా మారిందని అంటున్నారు. ఇటు ఎమ్మెల్యే సీటు పోయే, అటు ఎమ్మెల్సీ పదవి దక్కదాయే అన్నట్లుగా సీన్ ఉంది అంటున్నారు.
ఇచ్చే ఆలోచన ఉన్నా :
వాస్తవంగా చూస్తే టీడీపీ అధినాయకత్వానికి వర్మ మీద సానుభూతి ఉంది, అభిమానం కూడా ఉంది అని అంటున్నారు. ఆయనకు ఎమ్మెల్సీగా పదవి ఇవ్వాలని మనసారా ఉందిట. కానీ పిఠాపురంలో చూస్తే కూటమిలో గ్యాప్ ఉంది, జనసేన టీడీపీల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. మాజీ ఎమ్మెల్యేగానే వర్మ జనసేనను ఢీ కొడుతున్నారని ఇక ఆయనకు అధికార పదవి ఇస్తే మరింతగా కూటమి లో లుకలుకలు బయటకు వస్తాయని అంటున్నారు. ఆ రకమైన ఆలోచనల వల్లనే వర్మకు పదవి ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేని పరిస్థితి ఉంది అని అంటున్నారు.
కలుపుకుని పోవడం లేదా :
ఇక పిఠాపురంలో జనసేన టీడీపీల మధ్య గ్యాప్ ఏ స్థాయిలో ఉంది అంటే ఎవరికి వారుగా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. ఒకరిని ఒకరు పిలిచేది ఉండదని అంటున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చినపుడు మాత్రమే వర్మను పిలుస్తున్నరు అలా వేదిక దక్కుతోంది అని అంటున్నారు. అధికారిక కార్యక్రమాలు నియోజకవర్గంలో జరిగినపుడు టీడీపీ ఇంచార్జ్ గా ఉన్న వర్మకు పిలుపులు అయితే ఉండడం లేదని విమర్శలు ఉన్నాయి. ఇలా కూటమిలో ఉన్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకునే వర్మకు అధికార పదవి దక్కడంలేదా అన్న చర్చ అయితే ఉంది.
వైసీపీలోకేనా :
మరో వైపు చూస్తే వర్మ వైసీపీలో చేరుతారు అన్న ప్రచారం అయితే సాగుతోంది. అయితే ఆ ప్రచారాన్ని వర్మ వర్గం గట్టిగా తిప్పికొడుతోంది. తమ మీద కావాలనే ప్రత్యర్ధులు చేస్తున్న తప్పుడు ప్రచారం అని అంటోంది. ఇక వర్మ సైతం ఈ తరహా ప్రచారం మీద అప్రమత్తం అయ్యారు. అందుకే ఆయన వైసీపీ మీద మరింత ధాటీగా విమర్శలు చేస్తున్నారు. తన స్వరాన్ని కూడా పెంచుతున్నారు. ఇలా ఎన్ని చేసినా వర్మకు మాత్రం పదవి అందడం లేదు అన్న బాధ అయితే ఉంది. మరి రానున్న మూడేళ్ళలో అయినా ఆయనకు పదవీ యోగం ఉంటుందా అంటే జవాబు మాత్రం ఎవరికీ తెలియదు అనే వస్తోంది. దటీజ్ ద పాలిటిక్స్ ఆఫ్ పిఠాపురం.