వందేభారత్ కార్యక్రమంలో ఆరెస్సెస్ పాట... సీఎం ఘాటు విమర్శలు!
దేశ రాజకీయాల్లో గత కొంతకాలంగా మరీ విపరీతంగా కుల, మత ప్రస్థావన పెరిగిపోతుందని.. మరికొన్ని సందర్భాల్లో మరింత శృతిమించిపోతుందనే కామెంట్లు కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే!;
దేశ రాజకీయాల్లో గత కొంతకాలంగా మరీ విపరీతంగా కుల, మత ప్రస్థావన పెరిగిపోతుందని.. మరికొన్ని సందర్భాల్లో మరింత శృతిమించిపోతుందనే కామెంట్లు కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే! ఆ సంగతి అలా ఉంటే... దేశంలోని లౌకికవాదాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా పలు చర్యలు తెరపైకి వస్తున్నాయని అంటున్నారు. ఈ సమయంలో కేరళ సీఎం నిప్పులు కక్కారు!
అవును... ఎర్నాకుళం - బెంగళూరు వందే భారత్ రైలు సర్వీసు ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులతో ఆరెస్సెస్ గణగీత్ పాడించారనే ఆరోపణల నేపథ్యంలో దక్షిణ రైల్వేను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా విమర్శించారు. అధికారిక కార్యక్రమాల్లో మతపరమైన, రాజకీయ తటస్థతను కొనసాగించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనలకు పిలుపునిచ్చారు.
ఇదే సమయంలో... ఇతర మతాలపై ద్వేషాన్ని, మత విభజన రాజకీయాలను నిరంతరం వ్యాపింపజేసే ఆరెస్సెస్ పాటను ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో చేర్చడం రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించడమే అని ఆయన అన్నారు. అదేవిధంగా... వందే భారత్ ప్రారంభోత్సవ కార్యక్రమం తీవ్రమైన హిందూత్వ రాజకీయాలను బయటపెట్టిందని తెలిపారు.
ఇలాంటి చర్యల వెనుక లౌకికవాదాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా ఉన్న సంకుచిత రాజకీయ మనస్తత్వం ఉందని కేరళ సీఎం మండిపడ్డారు. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్వేలను కూడా సంఘ్ పరివార్ తమ మత రాజకీయ ప్రచారం కోసం ఉపయోగించుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సీఎం విజయన్ ఫైరయ్యారు.
ఇదే క్రమంలో... ఈ గణగీత్ ను 'దేశభక్తి గీతం' అనే శీర్షికతో సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా దక్షిణ రైల్వే తనను తాను అపహాస్యం చేసుకొందని తెలిపారు. అదే విధంగా... స్వాతంత్ర్య పోరాట సమయంలో భారతదేశ లౌకిక జాతీయవాదానికి మూలస్తంభంగా పనిచేసిన రైల్వేలు ఇప్పుడు స్వాతంత్ర్య పోరాటానికి ద్రోహం చేసిన ఆరెస్సెస్ మతపరమైన ఎజెండాకు మద్దతు ఇస్తున్నాయని అన్నారు.
సీఎం విజయన్ అనంతరం తగులుకున్న కాంగ్రెస్!:
ఈ వ్యవహారంపై కేరళ సీఎం నిప్పులు కక్కిన అనంతరం.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ స్పందించారు! ఈ సందర్భంగా... ఒక పబ్లిక్ ఈవెంటును ఆరెస్సెస్ ఫంక్షన్ లాగా మార్చారని.. దక్షిణ రైల్వే అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ దీన్ని గర్వంగా పంచుకుందని తెలిపారు. దీనిపై వివరణ కోరుతూ రైల్వే మంత్రికి లేఖ రాశానని అన్నారు.
ఇదే సమయంలో... భారతదేశాన్ని రాజ్యాంగ గణతంత్ర రాజ్యం నుండి ఆరెస్సెస్ నియంత్రణలో ఉన్న నిరంకుశత్వంగా నెమ్మదిగా మార్చడానికి ఇది ఒక కృత్రిమ ప్రయత్నమని.. ఇటువంటి చర్యలు రాజ్యాంగం యొక్క లౌకిక విలువలను, మన సంస్థల గౌరవాన్ని దెబ్బతీస్తాయని మండిపడ్డారు.