కాలక్షేప కథా చిత్రం: సిట్ విచారణపై కేటీఆర్ కామెంట్స్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా.. ఇప్పటి వరకు ప్రజలకు ఏమీ చేయలేదని.. వారి అసమర్థత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటూ.. విచారణ చేస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు.;
బీఆర్ ఎస్ పాలనా కాలంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం ఆ పార్టీ కీలక నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ను శుక్రవారం విచారించింది. ఈ విచారణ దాదాపు 7 గంటలకుపైనే సాగింది. మధ్యలో భోజన విరామం ఇచ్చారు. ఈ కేసులో కేటీఆర్ పాత్రపై ఆది నుంచి విమర్శలు ఉండడం.. కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు సైతం ఆయనపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో తాజాగా జరిగిన విచారణకు ప్రాధాన్యం సంతరించుకుంది. విచారణ అనంతరం.. కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇది కేవలం `కాలక్షేప కథా చిత్రం`అంటూ.. తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా.. ఇప్పటి వరకు ప్రజలకు ఏమీ చేయలేదని.. వారి అసమర్థత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటూ.. విచారణ చేస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. కాగా.. సిట్ అధికారులు తనను ప్రశ్నించడం కాదని..తానే వారిని ప్రశ్నించానని కేటీఆర్ తెలిపారు. ఈ కేసులో ఏదైనా ఉంటే..నేరుగా తనను అడగొచ్చని, కానీ, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఎందుకు లీకులు ఇస్తున్నారని వారిని నిలదీసినట్టు కేటీఆర్ చెప్పారు. హీరోయిన్ల(సమం త!) పేరుతో తనపై దుష్ప్రచారం చేశారని.. దీనికి సిట్ ఇచ్చిన లీకులే కారణమని తెలిపారు.
`ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం.. లీకుల ప్రభుత్వం` అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. హీరోయిన్లను అడ్డు పెట్టి తనపై చేసిన ప్రచారం నిజమేనా? అని సిట్ అధికారులను ప్రశ్నించినట్టు తెలిపారు. అయితే.. ఇది రాజకీయమని.. తమకు సంబంధం లేదని వారు చెప్పారన్నారు. తన ఫోన్‌ను కూడా ట్యాప్ చేస్తున్నారని సిట్ అదికారులకు చెప్పినట్టు తెలిపారు. తనపై ఎవరు ఫిర్యాదు చేశారో చెప్పాలని కోరానన్నారు. ఇదేసమయంలో మీడియాను ఉద్దేశించి కూడా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. లీకుల ప్రభుత్వాన్ని నమ్మి.. తనపై వార్తలు రాయొద్దని ఆయన విన్నవించారు. కాగా.. తనతో పాటు రాధా కిషన్ రావును విచారంటూ వస్తున్న వార్తలను కేటీఆర్ ఖండించారు. తనను ఒక్కడినే సిట్ అధికారులు విచారించానని, కానీ, ప్రశ్నలు మాత్రం తానే అడిగానని వ్యాఖ్యానించారు.