మే 4 తరువాత పేలనున్న పెట్రో బాంబు ?
దేశంలో ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ ధరలు అందుబాటులోనే ఉన్నాయి. పశ్చిమాసియా దేశాలలో యుద్ధం జరుగుతున్నా కూడా స్థిరంగా ధరలు ఉండడానికి కారణం ఏమిటి అన్న చర్చ సాగుతోంది.;
దేశంలో ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ ధరలు అందుబాటులోనే ఉన్నాయి. పశ్చిమాసియా దేశాలలో యుద్ధం జరుగుతున్నా కూడా స్థిరంగా ధరలు ఉండడానికి కారణం ఏమిటి అన్న చర్చ సాగుతోంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడం వల్ల అమెరికాలో పెట్రోల్ డీజిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా అమెరికా, ఇరాన్‌ల మధ్య నెలకొన్న భారీ సంఘర్షణల నేపధ్యంలో గత పాతిక రోజులుగా చమురు సరఫరాకు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అంతరాయం కలుగుతోంది. దాంతో చాలా దేశాలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేశాయి.
భారత్ లో మాత్రమే :
భారత్ చుట్టు పక్కల దేశాలలో సైతం పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయి. కానీ ఒక్క భారత్ లో మాత్రం పెంచలేదు. దానికి కారణం కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి అని ఎన్డీయే నేతలు అంతటా చెబుతున్నారు. అయితే దేశంలో పెట్రో డీజిల్ ధరలు పెరగకపోవడానికి కారణం అయిదు రాష్ట్రాలలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు అని విపక్షాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల వల్లనే కేంద్రం తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది తప్ప వడ్డింపు ఖాయమని గట్టిగానే బల్ల గుద్ది మరీ చెబుతున్నాయి. మే 4 ఎన్నికల ఫలితాలు వస్తాయని ఆ వెంటనే పెట్రో బాంబు పేలడం ఖాయమని ప్రతిపక్షాలు అంటున్నాయి.
ప్రతికూలం కాకూడదనే :
దేశంలో జరుగుతున్న ఎన్నికలు ప్రస్తుతం బీజేపీకి ఎంతో కీలకంగా మారాయి. పశ్చిమ బెంగాల్ లో ఈసారి ఎలాగైనా గెలవాలని ఆ పార్టీ చూస్తోంది. అంతే కాదు తమిళనాడులో అన్నా డీఎంకేతో కలసి పాగా వేయాలని ఆశపడుతోంది. ఈ నేపధ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే ప్రతికూల ప్రభావం చూపుతాయనే వెనక్కి తగ్గుతోందని ఇండియా కూటమి పార్టీలు విమర్శిస్తున్నాయి. ఇపుడు కాకపోయినా తరువాత వడ్డింపు తప్పనిసరి అని జోస్యం చెబుతున్నాయి.
సిలిండర్ సైతం :
ఇక గ్యాస్ సిలిండర్ మీద కూడా షాక్ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయని బీఆర్ ఎస్ అంటోంది. తెలంగాణాలో గ్యాస్ సిలిండర్ కొరత మీద ఆ పార్టీ నిరసనలు చేపట్టింది. ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ దేశంలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని అంటారు, కానీ తెలంగాణాలో మాత్రం క్యూలు పెద్ద ఎత్తున జనంతో కనిపిస్తున్నాయని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని ఆయన విమర్శించారు. గ్యాస్ సిలిండర్ల మీద కూడా కేంద్రం ధరలను పెంచుతుందని అలాగే 14 కిలోల సిలిండర్ ని మే 4 తరువాత కచ్చితంగా 10 కిలోలకు తగ్గిస్తుంది అని చెప్పారు. ఎన్నికల వల్లనే కేంద్రం ఆలోచిస్తోంది అని కేటీఆర్ విమర్శించారు.
అదే జరిగితే ఇబ్బందే :
ఒక్కసారిగా పెట్రోల్ డీజిల్ తో పాటు గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగితే మాత్రం సామాన్యుడి నడ్డి విరిగినట్లే అని అంటున్నారు. ఇప్పటికే నానా రకాలుగా అవస్థలు పడుతున్న సగటు జీవి జీవితం కకావికలు అవుతుందని అంటున్నారు. మరో వైపు చూస్తే ఈ పెరిగిన ధరలతో ఆహార ద్రవ్యోల్బణం ఏర్పడుతుందని కూడా అంటున్నారు నిత్యావసరాలు కూరగాయలు ఇతర ధరలు పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఇదీ పరిస్థితి :
ఇదిలా ఉంటే పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అంతటా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. పర్షియన్ గల్ఫ్ నుండి చమురు సరఫరాకు అంతరాయం కలుగుతుందనే భయాలు ప్రపంచ చమురు మార్కెట్లను ప్రభావితం చేస్తున్న నేపధ్యం ఉంది. చమురు ధరలలో దాదాపు 55 శాతం పెరుగుదల నమోదు అయ్యేలా పరిస్థితి ఉంది. ఈ సంఘర్షణల కారణంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధరలు కూడా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఒకవేళ ఈ ఘర్షణ హోర్ముజ్ జలసంధి వంటి నౌకా రవాణా మార్గాలకు అంతరాయం ఇంకా కొనసాగుతూ ఉంటే కనుక అమెరికాలో గ్యాసోలిన్ ధరలు మరింత పెరగవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రపంచం అంతటా చమురు ధరల మంటలు తీవ్రమవడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.