నెలలో మూడోసారి వాయింపు.. ఈసారి ఎంతంటే?
ఒకసారి వడ్డనలు మొదలు పెట్టిన తర్వాత ఆ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఈ మాటకు తగ్గట్లే.. పెట్రోల్డీ.. డీజిల్ ధరల పెంపు పరంపర సాగుతోంది.
ఒకసారి వడ్డనలు మొదలు పెట్టిన తర్వాత ఆ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఈ మాటకు తగ్గట్లే.. పెట్రోల్డీ.. డీజిల్ ధరల పెంపు పరంపర సాగుతోంది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు వస్తాయన్న అంచనాలకు తగ్గట్లే.. ఈనెల 15న తొలిసారి లీటరుకు మూడు రూపాయిల చొప్పున పెట్రోల్.. డీజిల్ ధరల పెంపు డిసైడ్ చేశారు.
ఇరాన్ - అమెరికా - ఇజ్రాయల్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్.. డీజిల్ ధరలు భారీ ఎత్తున పెరగటం.. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ధరల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసిన మోడీ సర్కారు.. ఫలితాలు వెల్లడైన తర్వాత పది రోజుల వరకు పెంపు వడ్డనకు పుల్ స్టాప్ పెట్టారు. మే 15న తొలిసారి లీటరుకు రూ.3 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం వడ్డన లీటరుకు మూడు రూపాయిల చొప్పున ఉంటే.. అందుకు తగ్గట్లే ఆయా రాష్ట్రాల పన్నుల వాటాకు తగ్గట్లే అదనంగా మరికొంత కలిసిన పరిస్థితి. ఇదిలా ఉండగా.. తొలిసారి పెంచిన ఐదు రోజుల వ్యవధిలోనే లీటరుకు మరో రూపాయి వరకు ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఇది సరిపోదన్నట్లుగా ఈ రోజు (శనివారం) లీటరు పెట్రోల్ మీద 87 పైసలు.. డీజిల్ మీద 91 పైసలు చొప్పున ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండే రాష్ట్ర పన్నులను కలుపుకుంటే ఈ భారం లీటరుకు రూపాయి కంటే కాస్త ఎక్కువగా ఉండనుంది. మొత్తంగా చూసుకుంటే మే 15 నుంచి ఇప్పటివరకు పెరిగిన ధరలతో లీటరు మీద భారం దగ్గరదగ్గర రూ.5 చేరుకున్నట్లుగా చెప్పాలి. ఇప్పుడు ప్రశ్న ఏమంటే.. ఈ వాయింపు ఇంకెంతకాలం? అన్నది. ఇరాన్ - అమెరికా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో పెట్రోల్.. డీజిల్ ధరల పెంపు సుమారు 30 నుంచి 60 శాతం మధ్యన ఉంది.
ఈ లెక్కన చూస్తే.. మన దేశంలో పెరిగిన ధరలు కేవలం ఐదు శాతం మాత్రమే. అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు ఒక ఎత్తు అయితే.. సప్లై చెయిన్ భారీగా దెబ్బ తిన్న నేపథ్యంలో లభ్యత పెద్ద ప్రశ్నగా మారింది. దీనికి తోడు గల్ఫ్ ప్రాంతం నుంచి కాక యూరోప్.. రష్యా నుంచి తెప్పించేందుకు సైతం రవాణా ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత పెరగటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం దశల వారీగా మరో రూ.5 నుంచి రూ.10వరకు ధరలు పెరగటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. దీనికి తోడు రూపాయి పతనం కూడా ధరల పెంపునకు మరింత దోహదం చేస్తున్నట్లుగా చెప్పాలి. సో.. మరిన్ని షాక్ లకు సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి.