సామాన్యుడి నడ్డి విరిగినట్లే.... ఈ నెలాఖరు నుంచే ?

దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ప్రస్తుతానికి అయితే అందుబాటులో ఉన్నాయి. దానికి కారణం అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు అని అంటున్నారు.;

Update: 2026-04-15 02:30 GMT

దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ప్రస్తుతానికి అయితే అందుబాటులో ఉన్నాయి. దానికి కారణం అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు అని అంటున్నారు. నిజంగా ఎన్నికలు కనుక లేకుంటే ఈ పాటికి వీటి ధరలు పెంచేస్తారు అని సామాన్యుడు కూడా అంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ పరిణామాలు ముడి సరుకు సరఫరా గొలుసు కట్టుని పూర్తిగా తెంపేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇంతకాలం ఎక్కువో తక్కువో హార్మూజ్ జల సంధి నుంచి వస్తున్న నేపథ్యం ఉంది. అయితే ఇపుడు ఆ జలసంధి నుంచి నౌకలు ఎలా బయటకు వస్తాయో చూస్తామని అమెరికా కన్నెర్ర చేస్తోంది. అంతే కాదు కాచుకుని కూర్చుంది. ఇది రేపటి రోజున చమురు కొరతకు అతి పెద్ద కారణం కాబోతోంది అన్న విశ్లేషణలు ఉన్నాయి.

పెరిగిన ధరలు :

పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణలు చూస్తే కనుక ఆగేట్టుగా లేవు. దాంతో ఈ పరిణామాలు అన్నీ కలగలసి ప్రపంచంలోని ఇంధన మార్కెట్ కే షాక్ ఇచ్చేలా ఉన్నాయి. లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం ప్రకారం చూస్తే అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఒక్కసారిగా వంద డాలర్లకు పెరిగాయని అంటున్నారు. ఇలాంటి పరిస్థితులను చూసినపుడు దేశంలో పెట్రోల్ కొరత ఏర్పడనుందా అన్న చర్చ భారీ ఎత్తున సాగుతోంది. మరో వైపు ఇది ఆందోళకరమైన పరిస్థితులకు దారి తీసేలా ఉందని మార్కెట్ వర్గాల నుంచి కూడా విన వస్తున్న మాటగా ఉంది.

పొంచి ఉన్న ఇబ్బంది :

ఇక దేశంలో చమురు కొరత లేదని ప్రభుత్వం చెబుతోంది కానీ ప్రస్తుతానికి అయితే అనేక దేశాల నుంచి దిగుమతులను పెంచుకోవడం జరుగుతోంది. అలాగే ఇప్పటికే దేశీయంగా ఉన్న పెట్రోల్ డీజిల్ నిల్వలను కూడా ఉపయోగంలోకి తీసుకుని వస్తున్నారు ఈ విధంగా బాలెన్స్ చేయడం వల్ల జనాలకు కొరత అన్నది తెలియడం లేదు, అదే సమయంలో ఎన్నికలు కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ధరలు పెంచడం లేదు. దాంతో అంతా బాగుందని అనుకోవచ్చు. కానీ ఇదే వాతావరణం ముందు ముందు ఉండకపోవచ్చు అని అంటున్నారు. కచ్చితంగా ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయనే అంటున్నారు.

భర్తీ చేసుకోవాల్సిందే :

అంతర్జాతీయ మార్కెట్ లో ఇంధన ధరలు పెరిగిపోయాయి. మరి దానిని భర్తీ చేసుకోవడానికైనా దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతారు అని అంటున్నారు. ఇప్పటికైతే ఒక విధంగా కేంద్రానికి థాంక్స్ చెప్పుకోవాల్సిందే. అదే సమయంలో ఎన్నికలకూ మరో థాంక్స్ చెప్పుకోవాల్సి ఉంది. అయితే అంతమాత్రాన ఎల్లకాలం భరోసా ఉంటుందని ఎవరూ చెప్పలేని నేపథ్యం ఉంది. అందుకే ధరల పెరుగుదలకు అంతా సిద్ధం కావడమే మేలు అంటున్నారు. ఇక పెరిగే ధరలు ఎలా ఉండబోతున్నాయో ఒక అంచనా ఉందని వార్తలు వస్తున్నాయి.

ఆహార ద్రవ్యోల్బణానికి దారి :

లీటర్ పెట్రొల్ కి 18 నుంచి ఇరవై రూపాయల దాకా పెంచుతారని అలాగే డీజిల్ కి 35 నుంచి 40 రూపాయలు పెంచుతారని అంటున్నారు అదే జరిగినట్లు అయితే సామాన్యుడి నడ్డి విరిగినట్లే అని అంటున్నారు. కేవలం వాహనాలకు మాత్రమే ఈ రేటు షాక్ ఉండబోదని అది నిత్యావసరాల మీద కూడా పడి ఆహార ద్రవ్యోల్బణానికి దారి తీస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా ఇవన్నీ అనివార్యతలుగా తోసుకుని వస్తున్న వేళ వడ్డింపునకు రంగం సిద్ధం అవుతోందని జనాలు కూడా సిద్ధ పడిపోవాల్సిందే అంటున్నారు. బహుశా ఈ నెలాఖరు నుంచే పెట్రోల్ డీజిల్ షాక్ తగలవచ్చు అని అంటున్నారు.

Tags:    

Similar News