బాబు మీద వైసీపీ మాజీ మంత్రికి అంత ప్రేముందా ?

చంద్రబాబు నిన్నా ఈ రోజు నాయకుడు కాదు. ఎర్లీ సెవెంటీస్ నుంచి ఉన్న నాయకుడు. ఎన్నో తరాలను మరెన్నో రాజకీయాలను చూస్తూ వచ్చారు.;

Update: 2025-09-30 20:30 GMT

చంద్రబాబు నిన్నా ఈ రోజు నాయకుడు కాదు. ఎర్లీ సెవెంటీస్ నుంచి ఉన్న నాయకుడు. ఎన్నో తరాలను మరెన్నో రాజకీయాలను చూస్తూ వచ్చారు. దేశంలో తెలుగు నాట మారిన రాజకీయాలను చూస్తూ ఎదిగిన వారు. బాబు అంటే గిట్టని వారు ఉండొచ్చు. అయితే రాజకీయంగా విభేదాలు తప్పించి వ్యక్తిగతంగా ఆయన మీద ఎవరికీ ఏమీ ఉండదు అని కూడా అంటారు. ఎందుకంటే రాజకీయం కూడా ఒక క్రీడ. ఆ స్ఫూర్తి ఉన్న వారికి వ్యక్తిగతాలు ఏమీ ఉండవు. అయితే ఏపీ రాజకీయం కడు భిన్నం. ఇక్కడ ఉప్పూ నిప్పులా ప్రత్యర్థి పార్టీల మధ్య అంతా నడుస్తొంది. మరి అలాంటి చోట వైరి శిబిరం నుంచి బాబు మీద సాఫ్ట్ కార్నర్ వైసీపీకి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రికి ఉందా అంటే అది రాజకీయ సంచలనమే అవుతుంది.

కుండబద్ధలు కొట్టిన నాని :

ఒక ప్రముఖ టీవీ చానల్ ఇంటర్వ్యూలో వైసీపీకి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని సూటింగా ఎన్నో విషయాలకు సమాధానాలు చెప్పారు. అయితే ఒక క్లిష్టమైన ప్రశ్న ఆయనకు ఎదురైంది. చంద్రబాబు మీద మీకు సాఫ్ట్ కార్నర్ ఉందా అని. దానికి ఆయన బదులిచ్చింది ఏమిటి అంటే తన ప్రాణం పోయినా ఆయన మీద సాఫ్ట్ కార్నర్ ఉండాల్సిన అవసరం కానీ అగత్యం కానీ లేదని. తాను మొదటి నుంచి టీడీపీ వ్యతిరేక రాజకీయాలు చేస్తూ వచ్చాను అని ఆయన స్పష్టం చేశారు. అంతే కాదు తాను బాబు రాజకీయాన్ని ఆయన పాలనా విధానాలను ఎప్పటికపుడు వ్యతిరేకిస్తూ ఎండగడుతూనే ఉంటాను అన్నారు.

ఆ మాటలకు అర్ధమేంటి :

ఇదిలా ఉంటే కొన్నాళ్ళ క్రితం పేర్ని నాని మీడియా ముందు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ప్రత్యర్ధులు అయినా వారి ఇంట్లో ఆడవారి జోలికి పోవద్దు అని తమ పార్టీ వారికి చెప్పారని. ఆ విధంగా ఆయన బాబుని ఇండైరెక్ట్ గానైనా పొగిడారు. అదే విషయం ముందు పెట్టి సదరు చానల్ యాంకర్ పేర్ని నానిని గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. అయితే తాను ఏ సందర్భంలో ఆ మాట చెప్పాను అన్నది ముఖ్యమని నాని అన్నారు. ఒకానొక సమయంలో తనను కేసులో ఇరికించే ప్రయత్నం జరిగిందని ఇద్దరు మంత్రులు బాబు వద్దకు వెళ్ళి తన భార్యని ఈ కేసులో ఇరికించాలని చూశారని దాని మీద బాబు వారిని అలా చేయవద్దని పేర్ని నాని మాత్రమే మన ప్రత్యర్ధి అని చెప్పినట్లుగా తనకు సమాచారం ఉందని అందుకే అలా తాను చెప్పాల్సి వచ్చిందని అన్నారు. అంతే తప్ప ప్రత్యేకంగా బాబు మీద తనకు ఏ రకమైన ప్రేమలు అభిమానాలు లేవని అన్నారు.

వ్యక్తిగతంగా లేదా :

అయితే ఇదే సందర్భంలో పేర్ని నాని మరో మాట చెప్పారు. బాబు రాజకీయాలను ఆయన పాలనా పరమైన అంశాలను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తాను అని. వ్యక్తిగతంగా ఆయనతో తనకు పేచీ పూచీలు ఏమీ లేవని నాని చెప్పకనే చెప్పేశారు. దాంతో ఈ విషయాల మీదనే చర్చ సాగుతోంది. అయితే బల్ల గుద్ది మరీ తనకు బాబు మీద ఎలాంటి సాఫ్ట్ కార్నర్ లేదని పేర్ని నాని చెప్పుకున్నారు. కానీ ఆయన గతంలో ప్రత్యర్ధుల ఇంట్లో ఆడవారి జోలికి పోవద్దని చేసిన దానిని చెప్పి మరీ జనాల్లో అయితే బాబు ప్రతిష్ట పెంచారు. అంతే కాదు బాబు రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఏ విధంగా వ్యవహరించారో కూడా స్పష్టం చేశారు. మరి దీనిని చూసినపుడు పేర్ని నానికి ఏమైనా ఆయన మీద సాఫ్ట్ కార్నర్ ఉందా అని అప్పట్లో అనుకున్నారు. అయితే లేనే లేదని ఆయన చెప్పినా బాబుని పరోక్షంగా మెచ్చుకున్న ఈ మాజీ మంత్రికి ఎంతో కొంత ప్రేమ లేకపోతే జరగదు కదా అన్న మాట అయితే వినిపిస్తోంది. మొత్తం మీద రాజకీయం అనే చదరంగంలో ఎవరి అంతరంగం ఏమిటి తెలుసు కోసం బహు కష్టమే గురూ అన్న మాట ఉంది కదా అంటున్నారు.

Tags:    

Similar News