పెన్షన్లలో భారీ కోత ....అనర్హులు లక్షల్లోనే ?
ఏపీలో సామాజిక పెన్షన్లు లెక్క తీసి చూస్తే 66 లక్షల పై చిలుకు ఉన్నాయి.;
ఏపీలో సామాజిక పెన్షన్లు లెక్క తీసి చూస్తే 66 లక్షల పై చిలుకు ఉన్నాయి. వీటికి టీడీపీ కూటమి పెంచిన వేయి రూపాయలను కూడా జత చేసి చూస్తే నెలకు అదనంగా 900 వందల కోట్ల రూపాయలు ఖర్చు పెరుగుతోంది. అలాగే ఏటా 10 వేల కోట్లు అదనపు భారం పడుతోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నెల అంటే జూలైలో ఎలాంటి కటింగులు లేకుండా అందరికీ పెన్షన్ మొత్తం ఏడు వేల రూపాయలు పెంచి మరీ ఇచ్చేశారు.
కానీ ఆగస్టు నెలకు అలా కుదరదు అని అంటున్నారు. ఈ పెన్షన్ల నుంచి అనర్హుల పేరుతో చాలా మందిని ఏరివేయాలని చూస్తున్నారు. సామాజిక పెన్షన్లలో అనర్హులు ఉన్నారా అంటే చాలా మందే అని లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు రంగంలోకి దిగితే ఏకంగా రెండున్నర లక్షల మందికి పెన్షన్లు కట్ అయ్యాయి. వారంతా అనర్హులు అని తేలింది.
అరవై ఏళ్ళు దాటిన వారందరికీ వృద్ధాప్య పెన్షన్లు వర్తింప చేస్తున్నారు. దాంతో చాలా మంది వయసు ఎక్కువ వేసుకుని విధంగా ఆధార్ కార్డులో కూడా ఏజ్ మార్చేసుకుని ఈ పెన్షన్లు పొందుతున్నారని తెలుస్తోంది. అలాంటి వారిని గుర్తించి మరీ పెన్షన్లు కట్ చేసే పనిలో అధికారులు ఉన్నారు.
అదే విధంగా దివ్యాంగులు కాకపోయినా తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చి మరీ తెచ్చిపెట్టుకున్న అంగ వికలత్వం తో ఆ పేరుతో పెన్షన్లు పెద్ద ఎత్తున పొందుతున్న వారి జాబితా ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ విధంగా ఎవరికి పడితే వారికి విచ్చలవిడిగా దివ్యాంగుల సర్టిఫికేట్లు ఇచ్చేశారు. దాంతో వారంతా హ్యాపీగా పెన్షన్లు అందుకున్నారు.
ఇపుడు వీరి అసలు గుట్టుని బయటపెట్టడానికి అధికారులు రంగం సిద్ధం చేశారని అంటున్నారు. అలాగే ఒంటరి మహిళ కేటగిరీలోనూ పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని అంటున్నారు. ఒంటరి మహిళ కానప్పటికీ ఆ విధంగా చెప్పుకుని పెన్షన్లు కొట్టేసిన వారి జాబితా పెద్దదిగానే ఉంది అని అంటున్నారు.
అలాగే వితంతు పెన్షన్ల విషయంలో ఇలాగే అవకతవకలు చోటు చేసుకున్నాయి అంటున్నారు. వితంతువులు కాకపోయినా ఆ విధంగా సర్టిఫికెట్లు పుట్టించుకుని మరీ పెన్షన్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా పెన్షన్ల కేటగిరీలో ఇరవై ఎనిమిది రకాలు ఉంటే చాలా కేటగిరీలలో అవకతవకలు ఉన్నాయని అంటున్నారు.
దాంతో వీరందరికీ పెన్షన్లు కట్ చేయాలని వారికి ఆ విధంగా తప్పుడు సర్టిఫికేట్లు ఎవరు ఇచ్చారో సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం ఆదేశించినట్లుగా ఉంది. ఈ విధంగా ప్రభుత్వం కనుక పెన్షన్లలో అవకతవకలు నిరోధిస్తే లక్షల్లోనే పెన్షన్లు కట్ అవుతాయని అంటున్నారు. ప్రభుత్వానికి ఆర్ధిక భారంగా ఉన్నా పెన్షన్లు పెంచి ఇస్తున్న నేపధ్యంలో అనర్హులను ఏరివేయకపోతే అసలైన వారికి ఇబ్బంది కలుగుతుందని కూడా అంటున్నారు. దాంతో దీని మీద పూర్తి విచారణ చేయించే పనిలో ప్రభుత్వం ఉందని అంటున్నారు.