బలప్రదర్శన చేస్తేనే బలం ఉన్నట్లా?
ఎవరి బలం ఎలా తెలుస్తుంది? ఇదో పెద్ద ప్రశ్న. సాదాసీదా ప్రజల బలాన్ని లెక్కించేందుకు సామాజికంగా కొన్ని అంశాల్ని చూపిస్తారు.;
ఎవరి బలం ఎలా తెలుస్తుంది? ఇదో పెద్ద ప్రశ్న. సాదాసీదా ప్రజల బలాన్ని లెక్కించేందుకు సామాజికంగా కొన్ని అంశాల్ని చూపిస్తారు. మరి.. కోట్లాది మందిని ప్రభావితం చేసే పార్టీ అధినేతల స్థాయి వారి బలాన్ని అంచనా వేయటానికి ఉండే మార్గాలేంటి? అన్నది ప్రశ్న. ఈ విషయంలో మిగిలిన అధినేతలకు భిన్నంగా వైసీపీ అధినేత ఆలోచిస్తున్నారా? లేదంటే.. ఆయనకు స్క్రిప్టు రాసే వారు సరికొత్త ప్రయత్నాలు చేస్తున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. శుభకార్యమైనా.. విషాద ఉదంతమైనా.. పలకరింపు అయినా.. పరామర్శ అయినా.. కార్యక్రమం ఏదైనా సరే.. వైసీపీ అధినేత కం ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు వచ్చినంతనే ఆయన్నుచూసేందుకు జనాలు ఎగబడిపోయేలా.. అసలు కార్యక్రమం పక్కకు వెళ్లిపోయి.. ప్రోగ్రాం మొత్తం జగన్ మీదనే ఫోకస్ అయ్యేలా చేయటం వెనుక వ్యూహమేంది? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
ప్రతి విషయాన్ని నెగిటివ్ కోణంలో ఎందుకు చూస్తారు? పాజిటివ్ గా చూడటం రాదా? అన్న మాటతో ఎదరుదాడి చేయొచ్చు. కానీ.. ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత.. వైసీపీ అధినేత ఎక్కడికైనా వెళ్లినా.. వేలాది మంది సదరు కార్యక్రమం వద్దకు చేరుకోవటం.. జగన్ కు జయజయధ్వానాలు పలకటం లాంటివి చేయటమే కాదు.. ఈ హడావుడితో అక్కడ జరుగుతున్న కార్యక్రమం రసాభాసాగా మారటం ఇటీవల కాలంలో అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ తీరు.. వైసీపీ అభిమానులకు.. జగన్ ను ఆరాధించే వారికి బాగున్నా.. వీటితో సంబంధం లేకుండా తమ బతుకు తాము బతికే సామాన్యులు మాత్రం చిరాకు పడే పరిస్థితి.
బలాన్ని చూపించటం తప్పేం కాదు. ఒక రాజకీయ అధినేతకు అది అవసరం. కానీ.. అదెంత వరకు? అన్నదే ప్రశ్న. ఈ విషయంలో వైసీపీ వ్యూహకర్తలు అనుసరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ అభిమానుల వరకు ఓకే. కానీ.. మిగిలిన వారి గురించి కూడా ఆలోచించాలి కదా? అన్నది ప్రశ్న. రాజకీయ సభలకు.. పార్టీ కార్యక్రమాల వేళ.. ఇదే తరహా హడావుడి అవసరం. అంతే తప్పించి.. పెళ్లికి వచ్చినా.. పేరంటానికి వచ్చినా.. చావుకు వచ్చినా.. జగన్ మీద పడిపోవటం..ఆయన మీద తమకు ఉన్నఅభిమానాన్ని చూపేందుకు తహతహలాడిపోవటం లాంటివి కాస్త తగ్గిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పెళ్లికి వెళ్లినా పెల్లుబికే అభిమానం ఓకే కానీ.. ఈ కారణంగా సామాన్య ప్రజలు పడే సమస్యల గురించి కూడా వైసీపీ నేతలు.. క్యాడర్ ఆలోచిస్తే మంచిదంటున్నారు. తాజాగా నెల్లూరులో జరిగిన ఒక వివాహ వేడుకకు వచ్చిన జగన్ విషయంలో ఇదే రచ్చ జరిగింది. నెల్లూరు రూరల్ పరిధిలోనికనుపర్తిపాడులో స్కిల్ డెవలప్ మెంట్ మాజీ ఛైర్మన్.. వైసీపీ నేత కొండూరు అజయ్ రెడ్డి కొడుకు పెళ్లి వేడుకకు వైసీపీ అధినేత జగన్ హాజరయ్యారు. హెలిప్యాడ్ వద్ద దిగిన వెంటనే పలువురు యువకులు పెద్ద ఎత్తున నినాదాలు చేయటం. రోడ్డుకు ఇరువైపులా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం ఒక ఎత్తు అయితే.. జగన్ వాహనాన్ని అనుసరిస్తూ వందలాది టూవీలర్లు పెద్ద ఎత్తున సౌండ్ చేస్తూ ప్రదర్శించిన బలప్రదర్శన కాస్త తగ్గిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెళ్లి వేడుకకు హాజరై..తిరిగి వెళ్లే సమయంలో వైసీపీ అభిమానులు ప్రదర్శించిన హడావుడి ప్రమాదకరంగా మారటంతో పోలీసులు లాఠీలకు పని చెప్పే వరకు విషయం వెళ్లిందంటే.. పరిస్థితి ఎలా ఉందన్నది ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి. మరీ.. ఇంత హడావుడి అవసరమా? పెళ్లి వేడుకకు హాజరయ్యే వేళలోనూ ఈ బలప్రదర్శన ఏంది బాసూ? అన్న రీతిలో ఉందన్నమాట వినిపిస్తోంది.