పెద్దిరెడ్డికి సీనియర్ల అండదండలు

వైసీపీలో సీనియర్ మోస్ట్ లీడర్ గా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. ఆయన కాంగ్రెస్ లో తన ప్రస్థానాన్ని మొదలెట్టి వైసీపీలో చేరి జగన్ కి కుడి భుజంగా మారారు.;

Update: 2025-09-06 03:15 GMT

వైసీపీలో సీనియర్ మోస్ట్ లీడర్ గా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. ఆయన కాంగ్రెస్ లో తన ప్రస్థానాన్ని మొదలెట్టి వైసీపీలో చేరి జగన్ కి కుడి భుజంగా మారారు. బలమైన సామాజిక వర్గంలో తిరుగులేని మద్దతు కలిగిన పెద్దిరెడ్డి వైసీపీకి ఉమ్మడి చిత్తూరు జిల్లానే కాదు రాయలసీమలో కొండంత బలం అని చెబుతారు. ఆయన కుటుంబం నుంచి ముగ్గురుకి వైసీపీ అధినాయకత్వం టికెట్ ఇవ్వడమే కాదు ఆయన సన్నిహితులకు టికెట్లు ఇచ్చింది అంటే అది ఆయన పార్టీలో సంపాదించుకున్న బలంగానే చెబుతారు.

పెద్ద పరీక్షలో పెద్దిరెడ్డి :

ఇదిలా ఉంటే వైసీపీ విపక్షంలోకి రావడంతోనే కూటమి ప్రభుత్వం నుంచి కష్టాలు మొదలయ్యాయి. అలా పెద్దిరెడ్డి కుటుంబం కూడా టార్గెట్ అయింది. పెద్దిరెడ్డి తనయుడు రాజంపేట నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన మిధున్ రెడ్డి మీద లిక్కర్ కేసు పడింది. దాంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో గత నలభై రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. ఆయనను ములాఖత్ ద్వారా అనేక మంది వైసీపీ నాయకులు పరామర్శిస్తున్నారు. రాయలసీమ నుంచి నాయకుల పరామర్శలు పూర్తి అయ్యాయి. ఇపుడు ఉత్తరాంధ్ర నుంచి నేతలు క్యూ కడుతున్నారు. రాజకీయంగా చూస్తే పెద్దిరెడ్డి కుటుంబం ఇపుడు అతి పెద్ద పరీక్షను ఎదుర్కొంటోంది. దాంతో వైసీపీ నుంచి సీనియర్ నేతలు అంతా ఆయనకు దన్నుగా ముందుకు వస్తున్నారు.

సీనియర్లంతా జట్టుగా :

వైసీపీలోని సీనియర్లు అంతా జట్టుగా ముందుకు కదలడం అయితే ఒకింత ఆసక్తికరంగానే ఉంది. శ్రీకాకుళం జిల్లా నుంచి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మొన్న మిధున్ రెడ్డిన్ ములాఖత్ ద్వారా కలిస్తే తాజాగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పరామర్శించారు. పెద్దిరెడ్డి కుటుంబానికి తమ సంఘీభావాన్ని తెలియచేయడానికి ఉత్తరాంధ్ర నుంచి ఇదే తీరున నేతలు వస్తున్నారు. వైసీపీ నేతలను కూటమి నేతలు టార్గెట్ చేసిన నేపధ్యంలో అనేక మంది జైలు పాలు అయ్యారు. అయితే వారిలో చాలా మందిని జగన్ పరామర్శించారు. కానీ మిధున్ రెడ్డిని మాత్రం పరామర్శించకపోవడం చర్చనీయాంశంగా ఉంది.

ప్రచారం జరిగినా కూడా :

ఇప్పటికి రెండు మూడు సార్లు జగన్ రాజమండ్రి వస్తారు అని మిధున్ రెడ్డిని పరామర్శిస్తారు అని ప్రచారం అయితే సాగింది. కానీ ఆ ముచ్చట మాత్రం జరిగింది లేదని అంటున్నారు. ఈ విషయంలో పెద్దిరెడ్డి కుటుంబం కూడా అసంతృప్తిగా ఉందని అంటున్నారు. అంతే కాదు కీలక నేతలు సీనియర్లు కూడా దీని మీద చర్చించుకుంటున్నారు అని చెబుతున్నారు. పెద్దిరెడ్డి ఫ్యామిలీ జగన్ కి అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చిన నేపథ్యం ఉంది. మిధున్ రెడ్డి అయితే జగన్ కోటరీలో కీలకమైన వారుగా చెబుతారు. అలాంటిది నెల రోజులకు పైగా ఆయన జైలు జీవితం గడిపితే జగన్ రాకపోవడం మీద చర్చ అయితే ఉంది.

మరి కారణాలు అయితే తెలియవు అంటున్నారు. అదే సమయంలో సీనియర్లు అంతా కలసి పెద్దిరెడ్డికి అండగా ఉంటామని సంకేతాలు ఇవ్వడం కూడా కొత్త రకం చర్చకు దారి తీస్తోంది. వైసీపీలో ఓటమి తరువాత జరుగుతున్న పరిణామాలు ఒక ఎత్తు అయితే కూటమి నుంచి టార్గెట్ అవుతున్న వారి విషయంలో అధినాయకత్వం ఇవ్వాల్సినంత భరోసా కల్పిస్తోందా అన్న చర్చ కూడా ఉంది అని అంటున్నారు. ఇక పార్టీ పరంగా కూడా సరైన యాక్షన్ ప్లాన్ తో ముందుకు సాగకపోవడం పట్ల కూడా నేతలలో అసంతృప్తి ఉందని అంటున్నారు. వెరసి ఇవన్నీ కూడా సీనియర్ నేతలను ఒక్కటిగా చేస్తున్నాయా అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి దీని పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయన్నది.

Tags:    

Similar News