జగన్ పథకాలు ఆగవు... ఇంకా బెటర్ అంటున్న పవన్!

జగన్ మళ్లీ అధికారంలోకి రాకపోతే ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయనే ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు.

Update: 2023-08-16 06:47 GMT

సంక్షేమం విషయంలో జగన్ పై ఏపీ ప్రజలకు కీలకమైన అభిప్రాయం ఉందని, కరోనా సమయంలో కూడా వాటిని కంటిన్యూ చేశారని చెబుతుంటారు. పైగా ఏపీలోని కొన్ని సంక్షేమ పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందనే కామెంట్లూ వినిపించాయి. ఈ సమయలో ఆ పథకాలపై పవన్ కీలక వ్యాఖ్యలు!

ఏపీలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథాకాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి రాకపోతే ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయనే ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. వాటిని మరింత మెరుగ్గా అమలు చేస్తామని తెలిపారు.

అవును... "వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ లో జగన్ మళ్లీ అధికారంలోకి రాకపోతే పథకాలు ఆగిపోతాయని, సంక్షేమం ఆగిపోతుందని దయచేసి అపోహ పడకండి. ఏ పథకమూ ఆగదు, మెరుగైన సంక్షేమ పథకాలు ప్రవేశపెడతాం" అని మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం జరిగిన సభలో పవన్ కల్యాణ్ అన్నారు.

ఇదే సమయలో జాతీయ నాయకుల పేరుతో సరికొత్త సంక్షేమ పథకాలు అమలు చేస్తామని పవన్ చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న అన్ని పథకాలను మెరుగైన పద్ధతిలో అమలు చేస్తాము కాబట్టి చింతించాల్సిన పనిలేదని పవన్ స్పష్టం చేశారు. పేద ప్రజల అసలైన బాధలపై ప్రభుత్వం స్పందించడం లేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.

Read more!

సాధారణంగా ఒక ప్రభుత్వం పెట్టిన పథకాలను మరో పార్టీ సమర్ధించదని చెబుతుంటారు! వాటికే పేర్లు మార్చి ప్రకటించడం.. లేదా మరింత లోతుగా అధ్యయనం చేసి, ప్రజా సమస్యలపైనా, వారి అవసరాలపైనా అవగాహన తెచ్చుకుని కొత్త పథకాలు ప్రవేశపెట్టాలని ఆలోచిస్తుంటారని అంటుంటారు.

అలాకానిపక్షంలో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే సక్సెస్ అయిన పథకాలను పేర్లు మార్చి, అర్హతలు మార్చి కొత్త హామీగా మసిపూసి ప్రవేశపెడుతుంటారని చెబుతుంటారు. అయితే విచిత్రంగా... ఏపీలో మాత్రం జగన్ ప్రవేశపెట్టిన ఏ సంక్షేమ పథకాన్ని తీసేది లేదని.. తాము అధికారంలోకి వచ్చినా ఆ పథకాలు కంటిన్యూ అవుతాయని విపక్షాలు చెప్పడం కొత్త విషయం అని అంటున్నారు పరిశీలకులు.

గతంలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రెండు రూపాయలకే కిలో బియ్యం.. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంటు, 108.. మొదలైన సేవలను ఆయన అనంతరం వచ్చిన ప్రభుత్వాలు కూడా కొనసాగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా జగన్ ప్రవేశపెట్టిన పథకాలనూ కంటిన్యూ చేస్తామని పవన్ తాజాగా ప్రకటించారు. ఇంకా మెరుగ్గా అమలు చేస్తామని తెలిపారు!

దీంతో తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తారో చెప్పమని అడుగుతుంటే... జగన్ పథకాలు కంటిన్యూ చేస్తానని చెబుతున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు!

కాగా ఈమధ్యకాలంలో రాజమండ్రిలో మహానాడు జరిగిన సంగతి తెలిసిందే. మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు మినీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. దీనిపై కాపీ పేస్ట్ కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే. అందులో సగం వైసీపీ పథకాలే అని, మిగిలినవి కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ పథకాలని కామెంట్స్ వినిపించాయి!

Tags:    

Similar News