పవన్ ఢిల్లీ టూర్...లెక్కలు చాలానే ఉన్నాయి...?

జనసేన అధినేత పవన్ ఢిల్లీ టూర్ బకాయిలో ఉంది. ఆయన సెప్టెంబర్ నెలలోనే ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది.;

Update: 2023-10-08 09:10 GMT

జనసేన అధినేత పవన్ ఢిల్లీ టూర్ బకాయిలో ఉంది. ఆయన సెప్టెంబర్ నెలలోనే ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. ఈ మేరకు కేంద్ర బీజేపీ పెద్దలను ఆయన అపాయింట్మెంట్ కోరినట్లుగా తెలుస్తోంది. మరి ఏమైందో తెలియదు కానీ అక్టోబర్ వచ్చేసింది. దాంతో పవన్ ఢిల్లీ టూర్ ఎపుడా అన్న చర్చ అయితే అలాగే సాగుతోంది.

పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళి ఏ పరిస్థితులలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో చెప్పబోతారని అంటున్నారు. ఒక విధంగా బీజేపీని ఈ విషయంలో ఒప్పించడానికే ఆయన పర్యటన ఉంటుందని అంటున్నారు. ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలరాదని అందుకే తాను టీడీపీతో పొత్తు ప్రకటన చేశానని పవన్ అంటున్నారు.

అయితే ఏపీ రాజకీయాలను పూర్తిగా అర్ధం చేసుకున్న బీజేపీకి అక్కడ పొలిటికల్ స్పేస్ కావాలి. బీజేపీ ఓటు బ్యాంక్ పెరగాలీ అంటే టీడీపీ తగ్గాలి. టీడీపీని దెబ్బ తీస్తేనే తాము ఎదుగుతామన్నది బీజేపీ ఆలోచన. ఆ విధంగా బీజేపీ ఆలోచిస్తూ జనసేనతో కలసి వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతోంది. ఈ విధంగా చేయడం వల్ల ఏపీలో ట్రయాంగిల్ ఫైట్ సాగుతుందని మరోసారి వైసీపీ గెలిచినా కూదా తమకు ఇబ్బంది లేదని ఈ దఫా కనుక టీడీపీ అధికారంలోకి రాకపోతే ఆ పార్టీ భవిష్యత్తు పూర్తిగా అంధకారంలో పడుతుందని బీజేపీకి లెక్కలు ఉన్నాయి.

అలా 2029 టార్గెట్ గా పెట్టుకుని బీజేపీ జనసేనను చేరదీసింది. అయితే పవన్ ఆలోచనలు జగన్ ఏపీకి సీఎం గా ఉండరాదు అన్నదే. ఈసారి జగన్ కనుక అధికారంలోకి రాకపోతే చాలు అన్న ఆలోచనతోనే ఆయన టీడీపీకి దగ్గర అవుతున్నారు. ఒక విధంగా బీజేపీతో ఉన్నట్లుగా పవన్ కనిపించినా ఆయన జగన్ వ్యతిరేక రాజకీయాలను టీడీపీతో కలిసే చేస్తున్నారు.

అలా కనుక చూసుకుంటే రాజకీయ భావ సారూప్యం ఎక్కువగా జనసేన టీడీపీల మధ్యనే ఉంది. బీజేపీ అయితే ఏపీలో తన ఫ్యూచర్ చూసుకుంటోంది. ఆ పార్టీకి చంద్రబాబు కంటే జగన్ సీఎం అయితేనే ఫ్యూచర్ బాగుంటుంది అన్న అంచనాలు ఉన్నాయి. ఈ విధంగా బీజేపీ జనసేనల మధ్య రాజకీయ దారులు అయితే వేరుగానే కనిపిస్తున్నాయి. ఇది చిన్న విషయం అయితే కాదు.

ఏపీ రాజకీయాలను మార్పు చేసే విధంగా జనసేన తమతో కలిసి రావాలని బీజేపీ కోరుతోంది. కానీ పవన్ మాత్రం టీడీపీతో జత కట్టడానికి బీజేపీని ఒప్పించగలను అని అనుకుంటున్నారు. పవన్ మాటలు చేతలు అన్నీ కూడా బీజేపీ పెద్దలకు అర్ధం అయిన మీదటనే ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చే విషయంలో ఆలోచిస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది.

ఇంకో వైపు చూస్తే తెలుగుదేశం కూడా బీజేపీని వదులుకోరాదనే భావిస్తోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వెనక బీజేపీ హస్తం లేదని నారా లోకేష్ మీడియా సాక్షిగా తాజాగా ప్రకటించిన సంగతి విధితమే దీంతో టీడీపీ జనసేన రెండూ కూడా బీజేపీని తమ కూటమిలోకి ఆహ్వానిస్తున్నట్లు గానే సీన్ అయితే ఉంది. మరి తేల్చాల్సింది బీజేపీ.

ఈ క్రమంలో జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఆయన కేంద్ర బీజేపీ పెద్ద, హోం మంత్రి అయిన అమిత్ షాతో గంటకు పైగా సమాలోచనలు జరిపారు. దాని సారాంశం ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది. ఏపీలో ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా బీజేపీ న్యూట్రల్ గా ఉంటే చాలు అన్నది వైసీపీ విధానం. వైసీపీని బీజేపీ కూడా నమ్ముతోంది అంటున్నారు. బీజేపీకి ఏపీ ఫ్యూచర్ పాలిటిక్స్ తో పాటు 2024 ఎన్నికల తరువాత తమకు మద్దతు ఇచ్చే పార్టీ గురించి కూడా ఉన్నాయి.

అలా కనుక చూస్తే జనసేన అధినేత పవన్ కేవలం ఏపీ వరకూ ఆలోచిస్తూంటే బీజేపీ జాతీయ రాజకీయాలలో నమ్మదగిన మిత్రుల గురించి కూడా ఆలోచిస్తోంది అంటున్నారు. అందువల్ల బీజేపీ కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ పవన్ కి ఇచ్చినా తమతో కలసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమనే కోరుతారని అంటున్నారు. అలా కుదరదు అనుకుంటేనే ఏపీలో టీడీపీ జనసేన కూటమి పోటీ అన్నది ఉంటుంది. మరి ఆ దిశగా ఈ రెండు పార్టీలు మానసికంగా సిద్ధంగా ఉన్నాయా అన్నది పవన్ ఢిల్లీ టూర్ ని బట్టే ఆధారపడి ఉంటుందని అంటున్నారు.

Tags:    

Similar News