పవన్ ఓ సంచలనం.. ఆకాశానికెత్తేస్తున్న నేషనల్ మీడియా!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పనితీరును కొనియాడుతూ నేషనల్ మీడియా ప్రచురించిన కథనాలతో జనసేన పార్టీ రూపొందించిన వీడియో వైరల్ అవుతోంది.;
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయంగా చాలా కీలకంగా మారుతున్నారు. రాష్ట్రంలో కీలక ప్రభుత్వం ఏర్పడేందుకు ప్రధాన కారణమైన పవన్.. ఇప్పుడు తన పనితీరుతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా తన చిన్న కుమారుడు అగ్నిప్రమాదానికి గురై సింగపూర్ లో ఆస్పత్రిలో చేరినా కూడా ఆయన గిరిజనులకిచ్చిన మాట కోసం ఓ మారుమూల గ్రామానికి వెళ్లడం చర్చనీయాంశమవుతోంది. ఇదే విషయాన్ని హైలెట్ చేస్తూ నేషనల్ మీడియా ప్రత్యేక కథనాలను ప్రసారం చేసింది. దీంతో పవన్ ప్రాధాన్యం, పనితీరును వివరిస్తూ జనసేన పార్టీ ఓ వీడియో విడుదల చేసింది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పనితీరును కొనియాడుతూ నేషనల్ మీడియా ప్రచురించిన కథనాలతో జనసేన పార్టీ రూపొందించిన వీడియో వైరల్ అవుతోంది. సుమారు 3 నిమిషాల 30 సెకన్లు ఉండే ఆ వీడియోలో రెండు రోజులపాటు ఏజెన్సీలో పర్యటించిన డిప్యూటీ సీఎం విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో పవన్ ప్రత్యేకంగా రూపొందించిన అడవితల్లి బాట కార్యక్రమం గత సోమవారం ప్రారంభించారు. రెండు రోజుల పాటు విశాఖ ఏజెన్సీలో పర్యటించేందుకు ముందుగానే షెడ్యూల్ రెడీ చేశారు. అయితే రెండో రోజు ఉదయాన్నే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఓ చేదు వార్త తెలిసింది. సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో తన చిన్నకుమారుడు 8 ఏళ్ల మార్క్ శంకర్ గాయపడ్డాడు. సహజం ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఎవరైనా అయితే వెంటనే తన కార్యక్రమం రద్దు చేసుకుని వెళ్లిపోతారు. కానీ, డిప్యూటీ సీఎం అలా చేయలేదు. పార్టీ నేతలు, అధికారులు రెండో రోజు కార్యక్రమాన్ని వాయిదా వేద్దామని చెప్పినా, డిప్యూటీ సీఎం మాత్రం నిరాకరించారు. దీనికి కారణం తొలిరోజు కార్యక్రమంలో ఓ గిరిజన వృద్ధురాలు తమ గ్రామానికి రమ్మంటూ పవన్ ను ఆహ్వానించారు. దీనికి ఆయన ఓకే చెప్పారు.
తమ గ్రామానికి పవన్ వస్తారని మాట ఇచ్చినా, తన చేతిలో చేయి వేసి మాట తీసుకున్నారు ఆ వృద్ధురాలు. తప్పనిసరిగా రావాలని, తమ కష్టాలను చూడాలని విన్నవించారు. దీంతో ఆ గిరిజన వృద్ధురాలికి ఇచ్చిన మాట కోసం ఆమె గ్రామమైన కురిడి వెళ్లివచ్చాకే తాను సింగపూర్ వెళతానంటూ పవన్ భీష్మించారు. ఓ వైపు కుమారుడికి ఏమైందోననే బాధను భరిస్తూనే తనను నమ్ముకున్న గిరిజనం కోసం పవన్ పరితపించడం గమనించిన నేషనల్ మీడియా పవన్ పై ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. కుమారుడు అత్యావసర పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన గిరిజనులకే తొలి ప్రాధాన్యమిచ్చారంటూ కొనియాడింది. దీంతో జనసేన పార్టీ కూడా ఓ ప్రత్యేక వీడియో రిలీజ్ చేసింది. గిరిజన ప్రాంతంలో పవన్ పర్యటన ప్రారంభమైన నుంచి మొదలైన ఆ వీడియోలో ఆయన గిరిజనులతో మమేకం అవ్వడం, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం, పవన్ పై నేషనల్ మీడియా ప్రచురించిన కథనాలు అన్నీ ఉన్నాయి. ఇక చివర్లో మార్క్ శంకర్ కోరుకోవాలంటూ ఓ ఫొటో పెట్టారు. పవన్ మాస్ సినిమాల టీజర్ కు మించిన విధంగా ఈ వీడియో ఉండటంతో నెట్టింట వైరల్ అవుతోంది.