పవన్ కానుక.. వదిన పంపిణీ!
తాజాగా శుక్రవారం నాడు స్థానిక పాదగయ క్షేత్రంలో పిఠాపురం నుంచి ఎంపిక చేసిన 10 వేల మంది మహిళలతో సామూహిక వరలక్ష్మీ వ్రతం చేయించారు;
తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గం మహిళలకు శ్రావణ మాసం చివరి శుక్రవారం 10 వేల చీరల ను కానుకగా ఇస్తానని ప్రకటించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆ కానుకలను నాలుగు రోజుల కిందటే పిఠాపురానికి పంపించారు. తాజాగా శుక్రవారం నాడు స్థానిక పాదగయ క్షేత్రంలో పిఠాపురం నుంచి ఎంపిక చేసిన 10 వేల మంది మహిళలతో సామూహిక వరలక్ష్మీ వ్రతం చేయించారు. విడతకు 2000 మంది చొప్పున మహిళలు పాల్గొనేలా క్రమబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మొత్తం 5 విడతలుగా శుక్రవారం తెల్లవారు జాము నుంచి నిర్వహించిన వరలక్ష్మీవ్రతాలు.. మధ్యాహ్నం 2 గంటలకు ముగిశాయి. పిఠాపురం నుంచి భారీ ఎత్తున మహిళలు తరలి వచ్చారు. అయితే.. ముందుగానే వారికి టోకెన్లు పంపిణీ చేయడంతో ఎలాంటి తోపులాటలకు తావు లేకుండా.. ప్రశాంతంగా కార్యక్రమం నిర్వహించారు. అయితే.. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు, ఎమ్మెల్యే నాగబాబు సతీమణి పద్మజ కూడా పాల్గొన్నారు.
స్థానిక మహిళలతో కలిసి కొణిదెల పద్మజ కూడా వరలక్ష్మీ వ్రతం ఆచరించారు. అనంతరం.. పవన్ కల్యా ణ్ పంపించిన చీరల కానుకల కిట్‌ను పద్మజ తన చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా పద్మజ మాట్లాడుతూ.. వరలక్ష్మీవ్రతం సామూహికంగా ఇంత మందితో నిర్వహించడం ఇదే తొలిసారి అని తెలిపా రు. ఈ క్రెడిట్ డిప్యూటీ సీఎంకే దక్కుతుందన్నారు. వరలక్ష్మి ఆశీస్సులు తన మరిదిపై ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. మహిళలు అందరూ ఎంతో భక్తి ప్రపత్తులతో వచ్చి వ్రతం ఆచరించారని పేర్కొన్నారు.