ఏంటీ... పవన్ త్రిశూల్.. మంత్రం?
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తాజాగా త్రిశూల్ పేరుతో ఒక కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.;
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తాజాగా త్రిశూల్ పేరుతో ఒక కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విశాఖలో ముగిసిన సేనతో సేనాని కార్యక్రమంలో దీనిని ప్రకటించారు. ఇది తారకమంత్రంగా పనిచేస్తుం దని చెప్పారు. దీంతో ఇప్పుడు ఏ ఇద్దరు జనసేన కార్యకర్తలు కలుసుకున్నా.. త్రిశూల్ గురించిన చర్చే జరుగుతోంది. మరి ఇది ఏంటి? దీనివల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనం జరుగుతుంది? పార్టీ ఏవిధంగా పుంజుకుంటుంది? అనే విషయాలు ఆసక్తిగా మారాయి.
త్రిశూల్ అంటే.. దీనిలోనే ఉన్నట్టుగా మూడు అంచలుగా పార్టీని విస్తరించనున్నారు.
1) పార్టీ లో కార్యకర్తలను బలోపేతం చేయడం: దీనిని మరింత విస్తరించనున్నారు. ప్రస్తుతం నగరాలు, పట్టణాలకే పరిమితమైన జనసేన సభ్యత్వాన్ని త్వరలోనే గ్రామీణ స్థాయికి తీసుకువెళ్తారు. గ్రామ గ్రామానా కూడా.. జనసేన జెండా ఎగురవేసే ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నారు. తద్వారా ఎక్కవ మందికి పార్టీని చేరువ చేయనున్నారు. ఇది తొలి మంత్రం.
2) నాయకత్వం: పార్టీలో చేరిన వారు.. ప్రస్తుతం ఏచేయాలన్న విషయంపై సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. ఏం చేస్తే.. ఏం జరుగుతుందో అనే చర్చ కూడా ఉంది. ఇక, మీదట అలాంటి చర్చకు తావు లేకుండా.. నాయకత్వ పటిమను పెంచుతారు. ప్రతి మూడు మాసాలకు కార్యకర్తల నుంచి నాయకులను తయారు చేస్తారు. లేదా గుర్తిస్తారు. వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తారు.తద్వారా.. పార్టీలో గుర్తింపు లభించేలా చేస్తారు. ఇది నాయకుల సంఖ్యను పెంచేందుకు దోహదపడనుంది. ఇది రెండో మంత్రం.
3) భద్రత-బాధ్యత: ఇది త్రిశూల్ కార్యాచరణలో కీలకమని పవన్ చెబుతున్నారు. పార్టీ నాయకులకు , వారి కుటుంబాలకు కూడా పార్టీ అండగా ఉంటుంది. అదేసమయంలో వారి బాధ్యతలను కూడా పెంచుతుంది. వచ్చే పదేళ్లలో పార్టీని జాతీయస్థాయిలో విస్తరించాలన్న ప్రణాళిక ఉన్న నేపథ్యంలో మూడో దశకు చేరుకున్న కార్యకర్తలు.. ఎమ్మెల్యే స్థాయిలో బాధ్యతలు అప్పగించనున్నారు. వారికిఅదేసమయంలో పార్టీలోనూ మంచి గుర్తింపు.. వారికి అధికార ప్రతినిధులుగా మంచి రాణింపు వచ్చేలా చేస్తారు. ఇలా.. త్రిశూల్ కార్యాచరణ ద్వారా.. పార్టీని మూడు రూపాల్లో డెవలప్ చేయాలన్నది సేనాని పెట్టుకున్న లక్ష్యం.