స్టాలిన్ వర్సెస్ పవన్
భాషా భేదం లేకుండా సినిమా దేశమంతటా ఒకేలా పరచుకున్న వేళ పవన్ క్రేజ్ తమిళనాడులో చాలానే ఉంది.;
తమిళనాడులో ఎదురులేని నేతగా ఉన్న డీఎంకే అధినేత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తో ఢీ కొట్టేందుకు జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి రెడీ అంటున్నారు. ఆయన తమిళనాడులో తాజాగా పర్యటించినపుడు చేసిన వ్యాఖ్యలు చూస్తే అదే అర్ధం అవుతోంది. దానికి కొసమెరుపు అన్నట్లుగా పవన్ మరో మాట అన్నారు. తాను ఎన్నికల వేళ ప్రచారానికి వస్తాను అని.
భాషా భేదం లేకుండా సినిమా దేశమంతటా ఒకేలా పరచుకున్న వేళ పవన్ క్రేజ్ తమిళనాడులో చాలానే ఉంది. అంతే కాదు అక్కడ తెలుగు వారు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో కూడా పవన్ ప్రభావం విపరీతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక పవన్ ఇపుడిపుడే జాతీయ సమస్యల మీద ప్రస్తావిస్తూ నేషనల్ లెవెల్ లో ఇమేజ్ ని సంపాదిస్తున్నారు.
దాంతో పవన్ క్రేజ్ తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ అన్నాడీఎంకే కాంబోకు ఆక్సిజన్ గా పనిచేస్తుంది అని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తమకు కొండంత అండ అని బీజేపీ నేతలు చెబుతున్నారు. పవన్ కి ఉన్న చరిష్మా తప్పకుండా ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి అతి పెద్ద ఆయుధంగా ఉంటుందని అంటున్నారు.
పవన్ కి ఉన్న మరో ప్రత్యేకత ఏంటి అంటే ఆయన సగం జీవితం తమిళనాడులో గడచింది. ఆయనకు చాలా సరళంగా తమిళ భాష వచ్చు. పైగా పవన్ ఆవేశపూరితమైన ప్రసంగాలకు పెట్టింది పేరు. తమిళులు ఎక్కువగా దానినే ఇష్టపడతారు. ఆ విధంగా పవన్ కచ్చితంగా తమిళనాడు ప్రజలకు కనెక్ట్ అవుతారని అంతా భావిస్తున్నారు.
ఇక తాను తమిళనాడు నుంచే చాలా నేర్చుకున్నాను అని తాజా పర్యటనలో పవన్ చెప్పడం ద్వారా తమిళుల మనసును తట్టి లేపారు. వారిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక తమిళనాడు రాజకీయాలు చూసుకుంటే అయిదేళ్ళ పాటు అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ మీద సహజంగా యాంటీ ఇంకెంబెన్సీ ఉంది.
మరో వైపు స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ఈసారి కనుక పార్టీ గెలిస్తే సీఎం అవుతారు అని ప్రచారంలో ఉంది. డీఎంకేలో వారసుడి రాజకీయం పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే కనుక అన్నా డీఎంకే సంస్థాగతంగా బలంగా ఉంది. ఎంతలా అంటే ఏపీలో టీడీపీ మాదిరిగా అని చెప్పాలి. ఇక బీజేపీ జత కట్టింది. దాంతో కేంద్ర సాయం వ్యూహాలు అన్నీ సమకూరుతాయి.
పవన్ వంటి చరిష్మా టిక్ లీడర్ కనుక అండగా ఉంటూ ఎన్నికల ప్రచారం చేస్తే డీఎంకేని బలంగా ఢీ కొట్టి విజయతీరాలకు ఎన్డీయే కూటమి చేరుతుందని అంతా నమ్ముతున్నారు. మొత్తానికి పవన్ స్టాలిన్ నే ఎదుర్కోబోతున్నారు అని అంటున్నారు చూడాలి మరి ఈ పోరు ఈసారి తమిళనాటనే కాదు దేశ వ్యాప్తంగానే ఆసక్తిని పెంచే అంశంగా ఉంటుందని అంటున్నారు.