పవన్ పర్యటనలో అనుమానాస్పద వ్యక్తి
ఉప ముఖ్యమంత్రి కార్యక్రమానికి ప్రత్యేకంగా పాసులు జారీ చేరీ చేశారు. స్థానికులతోపాటు ప్రభుత్వ సిబ్బంది, జర్నలిస్టులకు ఈ పాసులు ఇచ్చారు.;
రెండు రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో అపరిచిత వ్యక్తి సంచారంపై కలకలం రేగుతోంది. ఈ నెల 26 బుధవారం పవన్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. రాజోలు నియోజకవర్గంలో పల్లెపండుగ-2 ప్రారంభోత్సవంతోపాటు కొబ్బరితోటల పరిశీలన, రైతులతో ముఖాముఖి కార్యక్రమాల్లో పవన్ పాల్గొన్నారు. అయితే శంకరగుప్తం డ్రయిన్ మూలంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలు పరిశీలిస్తున్న సమయంలోనూ, ఆయన తర్వాత అధికారులతో సంభాషిస్తున్న సందర్భంలో ఓ అనుమానాస్పద వ్యక్తి పవన్ కు అత్యంత సమీపంలో తచ్చాడటం అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయాన్ని జనసేన కార్యకర్తలు, ఉపముఖ్యమంత్రి కార్యాలయం పోలీసులకు తెలియజేసింది.
ఉప ముఖ్యమంత్రి కార్యక్రమానికి ప్రత్యేకంగా పాసులు జారీ చేరీ చేశారు. స్థానికులతోపాటు ప్రభుత్వ సిబ్బంది, జర్నలిస్టులకు ఈ పాసులు ఇచ్చారు. కానీ, ఈ కార్యక్రమానికి సంబంధం లేని ఓ వ్యక్తి పవన్ కు అత్యంత సమీపంగా తిరగడం, అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉండటాన్ని జనసేన కార్యకర్తలు గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. పవన్ పర్యటనకు సంబంధం లేని ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడు? ఏ ఉద్దేశంతో వచ్చాడని తెలుసుకోమని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఎస్పీని కోరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పవన్ పర్యటనలో కనిపించిన వ్యక్తి రాజోలు నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్తగా గుర్తించారు. అయితే అతడు ఎందుకలా అనుమానాస్పదంగా తచ్చాడాడు అనేది తేలాల్సివుంది.
పవన్ పర్యటనలో వైసీపీ కార్యకర్త ఉండటంపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. రాజోలు నియోజకవర్గ వాసిగా అతడు కార్యక్రమానికి రావడంపై ఎవరికీ అభ్యంతరం లేకపోయినా, ఆయన కదలికలు అనుమానాస్పదంగా ఉండటమే ఆందోళనకు గురిచేస్తోందని జనసే వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాజకీయంగా చాలా చురుగ్గా, ప్రజాసమస్యలపై దూకుడుగా ఉండే పవన్ కు ప్రస్తుతం Z కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. సహజంగా కేబినెట్ మంత్రి హోదాకు Y+ భద్రత మాత్రమే ఉంటుంది. కానీ, పవన్ ఎదుర్కొంటున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల ఆయనకు Z కేటగిరీ సెక్యూరిటీని ప్రభుత్వం సమకూర్చింది.
ఎల్లప్పుడూ పవన్ చుట్టూ పర్సనల్ సెక్యూరిటీ వింగ్ ఉంటుంది. సుమారు 22 మంది వరకు ఆర్మడ్ ఫోలీస్ ఫోర్సెస్ కమాండోలు ఆయన చుట్టూ వలయంగా ఉంటూ భద్రత పర్యవేక్షిస్తారు. కానీ, రాజోలు పర్యటనలో ఈ భద్రతా వలయాన్ని దాటుకుని ఓ సామాన్య వైసీపీ కార్యకర్త డిప్యూటీ సీఎంకు అత్యంత చేరువగా వెళ్లడమే టెన్షన్ కు కారణమైంది. జనసేన కార్యకర్తలు, నాయకులు కూడా ఆయన వద్దకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతుంటారు. కానీ, అనుమానాస్పద స్థితిలో ఉన్న వ్యక్తి పవన్ కు అత్యంత సమీపంగా ఎలా వెళ్లాడనేదే అనేక అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. అనుమానాస్పద వ్యక్తిని అదుపులోకి తీసుకుని పవన్ పర్యటనకు అతడు రావడానికి కారణాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.