ఈజీగా సీఎం అయిపోయారు....నన్ను రోడ్లపైన డేకించారుగా !
తాను దిగజారిపోయి రాజకీయాలు చేయడం లేదని పవన్ అన్నారు. తనకే సీఎం కావాలి అనుకుంటే చంద్రబాబు జైలులో ఉన్నపుడే మంచి అవకాశం అని భావించి పోటీకి దిగేవాడిని కదా అని ప్రశ్నించారు.
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమండ్రిలోని పార్టీ క్యాడర్ తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రాలలో ఎంత సుఖంగా రాజకీయాలు చేశారు అని విజయ్ పార్టీ విజయం గురించి సెటైర్లు వేశారు. వారిని చూస్తే అసూయ కలిగేటంత గా ఉందని అన్నారు. కటౌట్లు హోలోగ్రామ్ పెట్టుకుని ప్రచారం చేసి ఈజీగా సీఎంలు అయిపోయారు అని ఆయన అన్నారు. తనను మాత్రం రోడ్ల మీద పదిహేనేళ్ళ పాటు డేకించారుగా అని ఆయన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ చేస్తున్నపుడు పవన్ నవ్వేశారు. ఏదో సరదాగా అంటున్నాను కానీ తాను నిబద్ధతతో నిజాయతీతో రాజకీయాలు చేయడానికి వచ్చాను అని అన్నారు.
రాజకీయ పార్టీని నడపటం :
ఒక కుటుంబంలోనే ఎన్నో రకాలుగా విభేదాలు వస్తాయని అందరినీ ఒక మాట మీద ఉంచలేమని అన్నారు. అలాంటిది లక్షలాది మంది క్యాడర్ ని ఏక త్రాటి పైన నడిపించడం అన్నది చాలా కష్టమైన విషయం అని పవన్ అన్నారు. తనకు ఏదో చేయాలని ఏదో మార్చాలని పిచ్చి అని ఆయన అన్నారు. అదే ధైర్యంతో తాను రాజకీయ పార్టీ పెట్టాను అన్నారు. ఆ సాహసంతోనే ముందుకు సాగుతున్నాను అన్నారు. తాను ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చిన వాడిని కాను అని ఆయన చెప్పారు. వైఎస్సార్ బతికి ఉన్న రోజులలోనే తన రాజకీయం స్టార్ట్ అయింది అని ఆయన అన్నారు.
దిగజారి పోలేదు :
తాను దిగజారిపోయి రాజకీయాలు చేయడం లేదని పవన్ అన్నారు. తనకే సీఎం కావాలి అనుకుంటే చంద్రబాబు జైలులో ఉన్నపుడే మంచి అవకాశం అని భావించి పోటీకి దిగేవాడిని కదా అని ప్రశ్నించారు. తాను నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేసాను అని ఆయన అన్నారు. తన విధానం అది కాదని అన్నారు. తన గురించి తక్కువగా ఆలోచించొద్దు అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది అన్నీ తెగించి అని పవన్ అన్నారు. తాను కుటుంబాన్ని వదులుకుని మరీ దేనికైనా సిద్ధమని తనలాగా ధైర్యం చేసి వచ్చే వారు ఉన్నారా అని ప్రశ్నించారు.
ప్రజా సమస్యల మీదనే :
తన పోరాటం అంతా ప్రజా సమస్యల మీద మాత్రమే అన్నారు. ఈ దేశం బాగుండాలన్నది తన ఆలోచన అని పవన్ చెప్పారు. అంతే తప్ప తాను వ్యక్తుల గురించి ఆలోచించను అన్నారు. ఈ దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటి మీదనే తాను కేంద్ర పెద్దలను కలసినపుడు తెలియచేస్తాను అని ఆయన చెప్పారు. తనది అంత తక్కువగా ఆలోచించే నైజం కాదని అన్నారు.
బలవంతుడునే కొడతా :
తాను ఎపుడూ బలహీనుడి మీద యుద్ధం చేయను అని పవన్ చెప్పారు. అనారోగ్యంతో మూలన కూర్చుంటే తోసి పారేసే రకం కాదని అన్నారు. తన రాజకీయం అంతా బలంగా ఉన్న వారి మీదనే అని పవన్ స్పష్టం చేశారు. ఒకవేళ ఆ బలహీనుడు బలంగా తయారు అయ్యేదాకా ఆరోగ్యవంతుడు అయ్యేదాకా ఆగి చూసి మరీ దెబ్బ కొడతాను తప్పించి బలహీనతలతో ఆడుకునే నైజం తనది కాదని పవన్ చెప్పారు.
కులాలు ప్రాంతాలు ఎందుకు :
తన మీద పార్టీ మీద రాళ్ళేస్తూ తాము మాత్రం వారిని విమర్శిస్తే కులాలు ప్రాంతాలు తీసుకుని వస్తున్నారని పవన్ అన్నారు. మీరు మాత్రం ఎన్ని అయినా అనేయవచ్చా అని ప్రశ్నించారు. మీరు అంటూ ఉంటే భరించాలి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని ఆయన హెచ్చరించారు. తన సహనం పరీక్షించవద్దు అని కూడా సూచించారు.
ఎంత కావాలంటే అంత :
తాను ఎవరికి ఎంత స్థాయిలో యుద్ధం కావాలంటే వారికి అంత స్థాయిలో అందించగలను అన్నారు. తన బలాన్ని మీరు ఊహించుకుని తక్కువ చేసుకుంటే అది మీ పొరపాటు అని కూడా ఆయన అన్నారు. తనను అంచనా వేయడం కూడా కష్టమని అది అవతల వారి ఊహకు కూడా అందదని పవన్ అన్నారు. మొతం మీద చూస్తే పవన్ స్పీచ్ అలో ఆవేశం ఆలోచన అనీ కలగలిపి కనిపించాయని అంటున్నారు.