పవన్ లక్ష్యాలు బలంగానే ఉన్నాయా ?
ఆయన పార్టీని పెట్టిన తరువాత తొలి ఎన్నికల్లో బీజేపీ టీడీపీలకు మద్దతు ప్రకటించడం ఒక వ్యూహం.;
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా తెలివైన వారు అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాటకు వస్తే ఆయన రాజకీయ ఎదుగుదల ఆయన మార్క్ వ్యూహాలు చూస్తేనే అన్నీ అర్ధం అవుతాయి. కేవలం పదేళ్ళ కాలంలో పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పార్టీని పెట్టిన తరువాత తొలి ఎన్నికల్లో బీజేపీ టీడీపీలకు మద్దతు ప్రకటించడం ఒక వ్యూహం. 2019లో వామపక్షాలు బీఎస్పీతో కలసి పోటీకి దిగడం మరో వ్యూహం. ఓటమి తరువాత బీజేపీతో వెంటనే జట్టు కట్టడం మరో వ్యూహం.
ఎన్నికలకు ఏణ్ణర్ధం ముందే టీడీపీతో పొత్తుని అనౌన్స్ చేయడం కూడా అసలైన వ్యూహం. ఇలా కూటమి కట్టించి వైసీపీని ఇంటి బాట పట్టించి తాను కోరుకున్న సేఫ్ జోన్ లో జనసేనను కూర్చోబెట్టడం లో పవన్ మార్క్ రాజనీతి ఉందని అంటారు ఈ రోజున ఆయనకు కేంద్రంలో బీజేపీ దన్ను పూర్తిగా ఉంది.
అలాగే ఏపీలో బలమైన ఒక సామాజిక వర్గం తమ ఆకాంక్షలకు ప్రతీకగా ఆయనను చూస్తోంది. ఏపీలో స్ట్రాంగ్ గా ఉన్న టీడీపీతో బంధం కలుపుకుని ఆ పార్టీని వెన్నుదన్నుగా ఒక్క మరో బలమైన సామాజిక వర్గాన్ని ఆకర్షించే పనిలో కూడా పవన్ వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి తరచూ కితాబులు ఇవ్వడం ఆయనను పొగుడుతూ బాబుని మించిన వారు ఎవరూ నాయకులు లేరని చెప్పడంలోనే పవన్ మరో రాజకీయ వ్యూహం ఉందని అంటున్నారు ఆ విధంగా టీడీపీ చుట్టూ అల్లుకున్న బలమైన సామాజిక వర్గంలో కూడా తన పలుకుబడి పెంచుకోవడమే ఆయన మార్క్ ప్లాన్ అని అంటున్నారు. నిజంగా ఈ రోజున చూస్తే టీడీపీని అభిమానించే సామాజిక వర్గానికి ఫస్ట్ ఎప్పటికీ బెస్ట్ చాయిస్ చంద్రబాబే. ఆయనకు వయసు అవుతోంది ఆ తరువాత ఎవరు అంటే లోకేష్ పేరు చెబుతారు. ఆ తర్వాత కచ్చితంగా మూడవ పేరుగా పవన్ ఉంటారు.
మరి అలా ఆ సామాజిక వర్గంలో తనకు ఇంతటి కీలకమైన స్థానం సంపాదించడం అంటే పవన్ రాజకీయ వ్యూహం సక్సెస్ అక్కడే ఉందని అంటున్నారు. ఇక బీజేపీకి ఏపీలో బలం తక్కువగా ఉంది. అయితే బీజేపీకి నమ్మకం అయిన మిత్రుడిగా పవన్ ఉన్నారు ఆయన బీజేపీతో పాటుగానే హిందూత్వను తన ఆలోచనగా చేసుకున్నారని అంటారు.
అలాగే సనాతన ధర్మం పట్ల అనురక్తిని పెంచుకున్నారు. బీజేపీ ఫిలాసఫీని ఆవాహన చేసుకుని కాషాయం పెద్దల మెప్పును అందుకున్నారు. అందువల్ల ఏపీలో ఏమైనా రాజకీయ పరిణామాలు జరిగితే కనుక పవన్ ని ముఖ్యమంత్రిని చేయడానికే బీజేపీ సిద్ధంగా ఉంటుంది అని అంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకూ సీఎం పీఠం వైపు చూసేందుకు ఎవరూ సాహసిచకపోవచ్చు. పవన్ కూడా బాబుని 15 ఏళ్ళ పాటు సీఎం గా ఉండమని కోరుతున్నారు.
అయితే అది ఆచరణలో ఎంతవరకూ సాధ్యం అన్నది కూడా ఉంది. బాబు తర్వాత మాత్రం సీఎం రేసులో బలంగా దూసుకుని వచ్చే కూటమి అభ్యర్ధిగా పవన్ కచ్చితంగా ఉంటారు అని అంటున్నారు. అది 2029 కావచ్చు లేదా 2034 కావచ్చు. లేదా ఆ మధ్యలో అయినా కావచ్చు అని అంటున్నారు
పవన్ కి ఓపిక ఎక్కువ. ఆయన ఇపుడేమీ పీఠం కోసం ఆరాటపడటం లేదు. బాబు వద్ద తాను ఎంతో నేర్చుకుంటాను అని అంటున్నారు. బహుశా ఇలాంటి శిష్యుడు ఒకరు తనకు లభిస్తారని బాబు కూడా ఎపుడూ ఊహించకపోవచ్చు. అలా బాబు మెచ్చిన నేతగా ఉన్న పవన్ ఏ రోజుకైనా సీఎం సీటు అందుకోవాలంటే బలమైన సామాజిక వర్గాల నుంచి ఏ రకమైన వ్యతిరేకత రాకుండా చూసుకుంటున్నారు అని అంటున్నారు.
ఎటూ గోదావరి జిల్లాలో బలమైన సామాజిక వర్గం దన్ను పవన్ కి ఎప్పటికీ ఉంటుంది. దాంతో పాటు టీడీపీ సామాజిక వర్గంలో కూడా పట్టు సాధిస్తే ఇక తిరుగే లేదు అన్నదే జనసేన అధినాయకత్వం విధానంగా ఉంది అని అంటున్నారు. ఇక టీడీపీని అంటిపెట్టుకుని ఉన్న బీసీలు ఇతర సామాజిక వర్గాలలో కూడా బాబు తరువాత తానే బెస్ట్ చాయిస్ గా అనిపించుకునే ప్రయత్నంలో పవన్ ఉన్నారని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ లక్ష్యం అన్నది బలంగానే ఉంది. దానిని సాధించేందుకు కూడా ఆయనకు తగిన వ్యూహాలు ఉన్నాయని చెబుతున్నారు.