జనసేన Vs వైసీపీ.. పెద్దిరెడ్డికి రక్షణగా రంగంలోకి దిగిన పార్టీ..

పెద్దిరెడ్డి భూములపై డిప్యూటీ సీఎం ఆరోపణలను డైవర్షన్ పాలిటిక్సుగా వైసీపీ వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఎక్స్ లో చేసిన పోస్టులో అనేక అంశాలను ప్రస్తావించింది.;

Update: 2025-11-13 12:30 GMT

మాజీ మంత్రి పెద్దిరెడ్డి టార్గెట్ గా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ స్పందించింది. అటవీ ప్రాంతంలో 76.74 ఎకరాల భూములను పెద్దిరెడ్డి కబ్జా చేశారంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి ఆక్రమణలపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఆయన నిన్న అటవీ అధికారులను ఆదేశించారు. దీనికి కొనసాగింపుగా ఇటీవల శేషాచలంలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి అప్పట్లో తీసిన వీడియోను ఈ రోజు తన ఎక్స్ అకౌంటులో పోస్టు చేశారు. వైసీపీ పాలనలో అటవీ భూముల ఆక్రమించారని ఆరోపిస్తూ పవన్‌ ట్వీట్ చేశారు. అటవీ భూమి ఆక్రమణదారులందరి పేర్లను అటవీశాఖ వెబ్‌సైట్‌లో ప్రచురించాలని. ఆక్రమణ పరిధి, ప్రతి వ్యక్తిపై కేసుల స్థితిని వెల్లడించాలని డిప్యూటీ సీఎం ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక ఈ అంశంపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి కనీసం స్పందించకపోగా, ఆయనకు మద్దతు చెబుతూ పార్టీ సుదీర్ఘ వివరణ ఇచ్చింది.

మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూకబ్జాలపై జనసేన, వైసీపీ మధ్య ట్వీట్ వార్ కొనసాగుతోంది. అటవీ భూమిని ఆక్రమించింది ఎవరైనా మినహాయింపులు లేకుండా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేస్తే.. పాత ఆరోపణలకు సినిమా రంగు తొడిగి కొత్తగా ప్రచారం చేస్తే అబద్ధాలు నిజాలు అవుతాయా? అని ప్రశ్నిస్తూ వైసీపీ ‘ఎక్స్’లో ప్రశ్నించింది. అంతేకాకుండా తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ధైర్యం పవన్ కల్యాణ్ కు ఉందా? అంటూ సవాల్ విసిరింది. దీంతో పెద్దిరెడ్డి భూముల చుట్టూ పెద్ద వివాదం చెలరేగే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ ఎంతవరకైనా వెళ్లేలా ఉన్నారని సంకేతాలు ఇస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో వైసీపీ కూడా తాడో పేడో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు భావిస్తున్నారు.....

పెద్దిరెడ్డి భూములపై డిప్యూటీ సీఎం ఆరోపణలను డైవర్షన్ పాలిటిక్సుగా వైసీపీ వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఎక్స్ లో చేసిన పోస్టులో అనేక అంశాలను ప్రస్తావించింది. ‘‘మా పార్టీ సీనియర్‌ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం భూ కబ్జా చేసిందని నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోంది. వారి చేతిలో అధికారం ఉంది, ఫైళ్లన్నీ వారి దగ్గరే ఉన్నాయి. ఇప్పటికీ ఒక్క ఆరోపణను కూడా రుజువు చేయలేకపోయారు. మేం సవాల్‌ విసరుతున్నాం. ఇవి నిజాలు కావని పవన్‌కళ్యాణ్‌ నిరూపించగలరా? పవన్‌ కళ్యాణ్ ఆరోపిస్తున్న ఈ భూములన్నీ కూడా 2000-2001మధ్యలో కొన్నవి కాదా? ఈ కింది డాక్యుమెంట్ల వివరాలు తప్పని పవన్‌కళ్యాణ్‌ చెప్పగలరా?’’ అంటూ వైసీపీ నిలదీసింది. అంతేకాకుండా కొన్ని డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ నంబర్లతో సహా ప్రస్తావించింది.

‘‘సర్వే సెటిల్‌ మెంట్ డైరెక్టర్‌ 1981లో ఇచ్చిన తీర్పులోని అంశాలను కూడా పవన్‌కళ్యాణ్‌ కాదనగలరా? పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన 75.74 ఎకరాలలకు 1966లోనే రైత్వారీ పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? 1975లో మళ్లీ సుమోటోగా విచారణ జరిపి నోటీసులు జారీచేసి, విచారణ జరిపి, 1981లో డైరెక్టర్‌ ఆఫ్‌ సెటిల్‌ మెంట్‌కు సంబంధించి తుది తీర్పులో అవి పట్టా భూములనేని నిర్ధారించి విచారణను నిలుపుదల చేసిన మాట మాట నిజం కాదా? 1968, సెప్టెంబరు 16న అటవీశాఖ ఈ భూములకు వెళ్లడానికి 30 అడుగుల వెడల్పుతో దారి వదిలిన మాట వాస్తవం కాదా? ఈ మేకరకు అటవీశాఖ కూడా విడుదలచేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను కాదంటారా? ఇవన్నీ కాదని పవన్‌కళ్యాణ్‌ నిరూపించగలరా?’’ అంటూ వరుస ప్రశ్నలను వైసీపీ సంధించింది.

‘‘అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బురదచల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అధికారులతో ఎన్నో కమిటీలు వేసి, విచారణలమీద విచారణలు చేశారు. కానీ ఆరోపణలను రుజువు చేయలేకపోయారు. ఇన్నిరోజుల్లో ఒక్క ఆధారాన్నీ చూపలేకపోయారు. నేపాల్ కు ఎర్రచందనం అంటూ ఇదే వపన్‌కళ్యాణ్‌ అర్థంలేని విమర్శలు చేశారు. నిరూపించాలని పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆ రోజు సవాల్‌ విసిరినా, ఇప్పటికీ దానిపై నోరుమెదపలేదు. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ స్కీంలను ఎగ్గొట్టి, అమలు చేస్తున్న ఏకైక స్కీం డైవర్షన్‌ స్కీం మాత్రమే’’ అంటూ వైసీపీ ఎదురుదాడి చేసింది.

Tags:    

Similar News